NTV Telugu Site icon

Review: వర్జిన్ స్టోరీ

లగడపాటి శిరీషా, శ్రీధర్ దంపతులది చిత్రసీమలో సుదీర్ఘ ప్రయాణం. 2005లో ‘ఎవడిగోల వాడిది’తో మొదలైన ఆ ప్రయాణం మొన్న ‘నా పేరు సూర్య’ వరకూ అప్రతిహతంగా సాగింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి, మెప్పించిన వారి తనయుడు విక్రమ్ సహిదేవ్ ఇప్పుడు హీరోగా ఎదిగాడు. అతన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వారు తీసిన యూత్ ఫుల్ మూవీ ‘వర్జిన్ స్టోరీ’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

ఇది వన్ నైట్ లో జరిగే కథ. అంతేకాదు… వన్ నైట్ స్టాండ్ కు సంబంధించిన కథ. పీ అని అందరూ ముద్దుగా పిలుచుకునే పియాన్షూ (సౌమిక పాండియన్)కు లవ్ బ్రేకప్ అవుతుంది. ఎక్స్ లవర్ ను మర్చిపోవడం కోసం ఆమె స్నేహితురాలు వన్ నైట్ స్టాండ్ కు ఒప్పిస్తుంది. ఆ రోజు పబ్ లో విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)ను చూసి అతనితో ఆ రాత్రి గడపాలని పీ భావిస్తుంది. నైట్ స్పైండ్ చేయడానికి పబ్ నుండి బయటకు వెళ్ళిన వారిద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? కొన్ని కారణాల వల్ల ఒకరిని ఒకరు హేట్ చేసుకున్న వీరు తిరిగి ఎలా ఒక్కటి అయ్యారన్నది మిగతా కథ.

ఈ మధ్య కాలంలో ముక్కూ ముఖం తెలియని వారితో ఓ రాత్రి ఎంజాయ్ చేసే కథాంశాలు తెలుగులోనూ బాగానే వస్తున్నాయి. యూత్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలన్నా, వారిని అట్రాక్ట్ చేయాలన్న ఇలాంటి కాన్సెప్ట్స్ వర్కౌట్ అవుతాయనే నమ్మకంతో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇవాళ విడుదలైన ‘వర్జిన్ స్టోరీ’తో సహా అలాంటి కథాంశాలతో వచ్చిన సినిమాలేవీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. పూర్తిగా తెలియని వ్యక్తితో ఓ రాత్రి గడిపే కాన్సెప్ట్ అని కాకపోయినా ఓ అబ్బాయి, అమ్మాయి రాత్రి గడపడం కోసం రకరకాల ప్రదేశాలు తిరగడం, ప్రయత్నాలు చేయడంతో గతంలో మల్లాది సీరియల్ ను జంధ్యాల ‘శ్రీవారి శోభనం’ పేరుతో తెరకెక్కించాడు.

అవుట్ ఆఫ్‌ ది బాక్స్ ఆలోచించి సినిమాలు తీస్తే జనాలు చూస్తారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సినిమాలో కథలేకపోయినా కంటెంట్ ను కన్వెన్స్ గా చూపితేనూ, దానికి కాస్తంత సెంటిమెంట్ ను జతచేస్తేనూ జనం ఆదరిస్తారు. అదే సమయంలో చట్టబద్ధమైనవన్నీ జనాల ఆమోదం పొందుతాయని, వాటిని వారు గౌరవిస్తారని అనుకోవడం మూర్ఖత్వం. లెస్బియనిజం, గే కల్చర్ కు చట్టబద్ధత ఉండొచ్చు, అంత మాత్రాన జనం అలాంటి వారిని గొప్పగా ఏమీ చూడరు. చిన్నచూపే చూస్తారు. ‘మాకు చట్టం హక్కులు కలిగించినా సమాజంలో గౌరవం దక్కడం లేద’ని వగచీ ఉపయోగం లేదు. ఈ సినిమాలోనూ కొన్ని పాత్రల ద్వారా దర్శకుడు వారిపై సానుభూతి కల్పించే ప్రయత్నం చేశాడు. అలాంటి బలహీనుల పట్ల సానుభూతి ఉండొచ్చు కానీ ప్రకృతి విరుద్ధమైన పనులను ప్రోత్సహించడం సమంజసం కాదు. యువతను ఆకట్టుకోవాలని పబ్ సీన్స్ తో సినిమాను నడిపినా ఏమంత ఉపయోగం ఉండదు. అలాంటి సీన్స్ చూడాలంటే ఆ కుర్రకారు పబ్ లకే వెళతారు, థియేటర్లకు కాదు. ఆ సన్నివేశాలనే బేస్ చేసుకుని హృదయాన్ని హత్తుకునేలా ఏమైనా చెప్పి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమీ జరగేలేదు. క్లయిమాక్స్ లోనూ అల్జీమర్స్ తో బాధపడే బామ్మగారితో దర్శకుడు ‘వర్జీన్’ అంటే ఏమిటో చెప్పించాడు. చిత్రం ఏమంటే… ఈ సినిమాలో ఎవరు వర్జిన్? ఎవరు కాదు? కాకపోవడం వల్ల వాళ్ళకేదో సమస్య వచ్చిందనే అంశమే లేదు. ఆ పేరు పెట్టాం కదాని ‘వర్జినిటీ’ గురించి ఆత్రంగా, ఆవేశంగా నాలుగు మాటలు ఇటు పోలీస్ అధికారితోనూ, ఆపైన దానికి కౌంటర్ గా బామ్మగారితోనూ చెప్పించినట్టుగా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే విక్రమ్ సహిదేవ్ కు మొదటి నుండి నటనలో చక్కని ఈజ్ ఉంది. ఆ మధ్య వచ్చిన ‘రౌడీ బాయ్స్’ మూవీలోనూ అతను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించాడు. ఇందులో అతని బాడీ ఎంత ఫెక్సిబుల్ గా ఉందో ఓపెనింగ్ షాట్ లోని డాన్స్ బిట్ తో అర్థమౌతుంది. అతని కోసం ఓ చక్కటి డాన్స్ నంబర్ పెట్టి ఉండే బాగుండేది. హీరోయిన్ సౌమిక పాండియన్ కాస్తంత బొద్దుగా ఉన్నా, చూడముచ్చటగా ఉంది. ఆమె స్నేహితురాలిగా చేసిన రిషిక ఖన్నా పాత్రోచితంగా నటించింది. లోహిత్, జయశ్రీ రాచకొండ, ఆర్.కె., అప్పారావు, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అచ్చు స్వరాలు, ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగున్నాయి. భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, గిరిధర్ రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. అనీశ్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. అయితే దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి కంటెంట్ ను మరి కాస్తంత పాలిష్డ్ గా చూపించి ఉంటే బాగుండేది. యూత్ మాట్లాడే భాష అని సమర్థించుకుంటూ పబ్లిక్ లో వినడానికి ఇబ్బందిగా ఉండే పదాలను ఆయా పాత్రధారులతో పలికించారు. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు బీప్ సౌండ్ వేస్తే చాలా భాగం అదే సౌండ్ వినిపిస్తుందని కావచ్చు, సెన్సార్ వారు చూసి చూడనట్టు వదిలేసినట్టు అనిపిస్తోంది. ఏదేమైనా…. యూత్ మూవీ పేరుతో లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు ఆ వర్గం నుండి కూడా పెద్దంత స్పందన లభించేలా లేదు!

ప్లస్ పాయింట్స్
విక్రమ్ సహిదేవ్ నటన
అచ్చు సంగీతం
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
ఎమోషన్ లేని సీన్స్
ఆసక్తి కలిగించని కథనం

రేటింగ్: 2.25 / 5

ట్యాగ్ లైన్: వల్గర్ స్టోరీ!