కంటెంట్ ఓరియెంటెడ్ పరభాషా చిత్రాలనే కాదు… వెబ్ సీరిస్ ను కూడా రీమేక్ చేసి ఆహా సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. అలా టి.వి.ఎఫ్. ‘ఫ్లేమ్స్’ను తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ చేసింది. ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫస్ట్ సీజన్ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల, స్నేహల్ కామత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ ఫీల్ గుడ్ వెబ్ సీరిస్ ఎలా ఉందో.. తెలుసు కుందాం…
సాగరతీరంలోని ఓ పట్టణంలో గౌరీ శంకర్ ట్యూషన్స్ లో జరిగే కథ ఇది. అక్కడ దాదాపు యాభై మంది పిల్లలు ఇంటర్ ట్యూషన్ చెప్పించుకుంటూ ఉంటారు. ఆ ట్యుటోరియల్స్ ను శంకర్, అతని భార్య (రమణ భార్గవ్, బిందు చంద్రమౌళి) నిర్వహిస్తుంటారు. వాళ్ల అబ్బాయే కృష్ణ (హర్షిత్ రెడ్డి). చెఫ్ కావాలన్నది కృష్ణ కోరికైతే, తండ్రికి మాత్రం అతన్ని ఇంజనీర్ చేయాలని ఉంటుంది. అయితే తండ్రి ట్యుటోరియల్ లో చదవడానికి ఇష్టపడని కృష్ణ… ఆ వూరికి దుబాయ్ నుండి కొత్తగా వచ్చిన జాస్మిన్ (పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయి అందులోనే చేరడంతో తానూ చేరిపోతాడు. కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ రవి.
అతనికి అదే ట్యూషన్ లో చదువుకునే బిందు (స్నేహల్) అంటే ఇష్టం. కృష్ణ, జాస్మిన్; రవి, బిందు… ఈ నలుగురి చుట్టూనే కథ సాగుతుంది. బిందు తనని ప్రేమించడం లేదని భ్రమపడే రవి, అతన్ని డామినేట్ చేయాలని ప్రయత్నించే బిందు… జాస్మిన్ కు ఎలాగైనా దగ్గర కావాలని తాపత్రయపడే కృష్ణ… వారి ప్రేమకు అడ్డుగా నిలిచే అర్జున్… చివరకు వీరి మధ్య ఏర్పడిన అపార్థాలు ఎలా దూరమైపోయి… స్నేహితులుగా మారిపోయారన్నదే ఈ వెబ్ సీరిస్. ప్రేమ లోతుల్లోకి పోకుండా, కెరీర్ కు ప్రాధాన్యమిచ్చి ఎవరికి వారు స్నేహితులుగా మిగిలిపోవాలను కోవడంతో ఫస్ట్ సీజన్ ముగుస్తుంది.
నిజానికి ఈ వెబ్ సీరిస్ మొత్తం చాలా సాదా సీదాగా సాగుతుంది. ఇందులోని సన్నివేశాలు గతంలో చాలా సినిమాలలో, వెబ్ సీరిస్ లలో చూసినవే. కానీ ఓ ప్లెజెంట్ నెస్ తో వాటిని తెరకెక్కించడం, నేపథ్య సంగీతం హృదయానికి హత్తుకునేలా ఉండటంతో ఎక్కడా బోర్ కొట్టదు. పైగా ప్రతి ఎపిసోడ్ ఇరవై – ఇరవైఐదు నిమిషాల మించి ఉండదు. దాంతో ఇలా మొదలై… అలా పూర్తయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సరదాగా చూసేసిన అనుభూతి కలుగుతుంది. స్నేహితులు, ప్రేమికుల మధ్య ఏర్పడే చిన్నపాటి అపార్థాలు, ఇగో కారణంగా వాటిని వెంటనే పరిష్కరించుకోకుండా బాధ పడటాలు మనకు ఇందులో కనిపిస్తాయి. అదే సమయంలో కుర్రాళ్ళ జీవితంలో చదువుకు ఉండాల్సిన ప్రాధాన్యత, పిల్లల మీద తల్లిదండ్రులు పెట్టుకునే ఆశలను కూడా చూపించారు.
నటీనటుల విషయానికి వస్తే… ఈ యేడాది ప్రారంభంలో విడుదలైన ‘మెయిల్’ వెబ్ మూవీలో నటించిన హర్షిత్ రెడ్డి ఇందులో కృష్ణగా నటించాడు. అతని స్నేహితుడిగా, ఇప్పటికే పలు చిత్రాలలో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల చేశాడు. దుబాయ్ నుండి ఇండియా వచ్చిన అమ్మాయిగా పాయల్ నటించింది. ఇప్పటికే పలు వెబ్ సీరిస్ లలో నటించిన అనుభవం పాయల్ కు ఉండటంతో భావోద్వేగాలను బాగానే పండించింది. రవి స్నేహితురాలుగా స్నేహల్ నటించింది. కృష్ణ తల్లిదండ్రులుగా బిందు చంద్రమౌళి, రమణ భార్గవ్ సహజ నటన ప్రదర్శించారు. ఇతర పాత్రలలో వాసు ఇంటూరి, జయవాణి, సుజాత, స్వపిక నటించారు.
ఈ వెబ్ సీరిస్ కు మోనిష్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ, నరేశ్ ఆర్.కె. సిద్ధార్థ్ సంగీతం హైలైట్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో నేపథ్య సంగీతంగా పాత సినిమా పాటలను వాడటం బాగుంది. కిట్టు విస్సాప్రగడ డైలాగ్స్ బాగున్నాయి. ‘లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్, ఈ అమ్మాయిలకేదీ సూటిగా చెప్పడం చేతకాదా!’ వంటివి ఫన్నీగా ఉన్నాయి. కొన్ని చోట్ల సందర్భానికి తగ్గట్టుగా లోతైన సంభాషణలూ రాశారు. అర్నాబ్ కుమార్ నిర్మించిన ‘తరగతి గది దాటి’ మూవీని ‘పెళ్ళి గోల’ ఫేమ్ మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ రొమాంటిక్ ఫీల్ గుడ్ వెబ్ సీరిస్ ను చూస్తే నచ్చేస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటుల సహజ నటన
సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేకపోవడం
ట్యాగ్ లైన్ : ‘క్లాస్’ రూమ్ రొమాన్స్!
రేటింగ్ : 3 / 5