NTV Telugu Site icon

‘షేర్షా’ రివ్యూ

నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, శివ పండిట్
సాంకేతిక నిపుణులు: సంగీతం : జాన్ స్టేవార్ట్ ఎదూరి, సినిమాటోగ్రఫీ : కమల్‌జీత్ నేగి, ఎడిటింగ్: ఎ.
శ్రీకర్ ప్రసాద్, దర్శకత్వం: విష్ణువర్ధన్
నిర్మాతలు : కరన్ జోహర్, హిరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా,
హిమాన్షు గాంధీ
నిడివి: 2.15 నిమిషాలు
విడుదల: ఆగస్ట్ 12, 2021
అమెజాన్ ప్రైమ్ లో

గత కొంత కాలంగా బయోపిక్ లకు చక్కటి ఆదరణ లభిస్తూ వస్తోంది. ఆ కోవలో వచ్చిన మరో బయోపిక్ ‘షేర్షా’. కార్గిల్ యుద్ధంలో దేశానికి విజయం సాధించి పెట్టిన వారిలో కెప్టెన్ విక్రమ్ భాత్రా ఒకరు. పరమవీర చక్ర అవార్డీ అయిన విక్రమ్ భాత్రా జీవిత చరిత్రగా వచ్చిన ఈ సినిమా ఈ నెల 12న భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 గంటల 15 నిమిషాల ‘షేర్షా’ కథను కెప్టెన్ విక్రమ్ భాత్రా కవల సోదరుడు విశాల్ బత్రా మాటల ద్వారా యుద్ధరంగంలో తిలకించినప్పుడు గూస్ బంప్స్ రావటం ఖాయం.

కథలోకి వస్తే…. విక్రమ్ బాత్రా (సిద్ధార్థ్ మల్హోత్రా) హిమాచల్‌ప్రదేశ్‌లో చిన్న పట్టణం పాలంపూర్ లో స్కూల్ టీచర్ కుమారుడు. చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ కావాలన్నది అతని కల. చిన్ననాడే స్వాంతంత్ర్య, రిపబ్లిక్ డే వేడుకల్లో స్కూల్ లో ఆర్మీ యూనిఫామ్ ధరించేవాడు. టీవీలో మేజర్ సోమనాథ్ శర్మ ప్రోగ్రామ్ చూశాక ఆర్మీ ఆఫీసర్ కావాలనే కోరిక మరింత బలపడుతుంది. యుక్తవయసులో డింపుల్ చీమ (కైరా అద్వానీ) ప్రేమలో పడి ఆర్మీ నుంచి నేవీ వైపు వెళ్లాలని ఊగినా చివరకు మనసుకు నచ్చిన విధంగా ఆర్మీవైపే అడుగులు వేస్తాడు. అక్కడ నుంచి 1999లో కార్గిల్ యుద్ధం వరకూ విక్రమ్ బృందం వీరోచితమైన చర్యలు ఆకట్టుకుంటూ సాగుతాయి. మరి విక్రమ్ భాత్రా కార్గిల్ యుద్ధంలో సాధించింది ఏమిటి? విజేతగా ఎలా నిలిచాడు అనేది ‘షేర్షా ‘ కథ.

వాస్తవికతకు దర్శకుడు సినిమాటిక్ జోడించినా ఎక్కడా అతి లేకుండా సాఫీగా సాగుతుంది. విక్రమ్ భాత్రా నిజజీవితంలో వాడిన పదాలు… డాక్యుమెంటరీ నుంచి సంగ్రహించిన విషయాలను ఈ సినిమాలో చక్కగా ఉపయోగించుకున్నారు. విక్రమ్, డింపుల్ లవ్ ట్రాక్ సైతం సినిమాకు ఎలాంటి బ్రేక్ వేయకుండా సమయానుకూలంగా పిక్చరైజ్ చేశారు. ఇద్దరి కెమిష్ట్రీ కూడా చక్కగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ చక్కగా డిజైన్ చేయటంతో చాలా నేచులర్ గా వచ్చాయి. ప్రత్యేకించి చివరి అరగంట ఉత్కంఠతతో సాగుతుంది. పాటలు సందర్భానుసారంగా ఎమోషనల్ గా ఉన్నాయి. కాశ్మీర్ అందాల మీద దృష్టి పెట్టకుండా వాస్తవ గృహాలను, అక్కడి బంకర్లు, అలాగే ప్రమాదకరమైన పర్వత శిఖరాలు, రియలిస్టిక్ కాల్పులు, యుద్ధ సన్నివేశాలను చూపించటం ఆకట్టుకుంటుంది.

ఇక విక్రమ్ భాత్రా జీవితంలోని చివరి క్షణాలలో సైనికులు పాయింట్‌ను స్వాధీనం చేసుకుని, పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం… కెప్టెన్ భాత్రా మృతదేహాన్ని అతని పట్టణానికి తెచ్చి తుపాకీ వందనం చేసినప్పుడు అతని ప్రేయసి డింపుల్ కన్నీళ్లు పెట్టుకోవడం వంటి దృశ్యాలు కంట తడి పెట్టించక మానవు. ఇటీవల కాలంలో వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలతో నిస్సందేహంగా ‘షేర్షా’ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్ వచ్చు. 1999 కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారికి’షేర్షా’ సినిమా యుద్ధ సమయంలో ఏమి జరిగింది… భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎలా విజయం సాధించిందో తెలుసుకోవచ్చు. ‘షేర్షా’ మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. మీలో దేశభక్తిని రేకెత్తిస్తుంది. భారతీయ సైన్యం గొప్పదనం చూసి గర్వపడేలా చేస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే ఇది నిస్సందేహంగా ఇది సిద్ధార్థ్ మల్హోత్రా గేమ్ ఛేంజర్ మూవీ. ఇందులో విక్రమ్ భాత్రాగా, అతని ట్విన్ బ్రదర్ విశాల్ గా ద్విపాత్రాభినయం చేశాడు సిద్ధార్థ్. విక్రమ్ ప్రేయసిగా కైరా అద్వాని సైతం చక్కటి భావోద్వేగాలు పలికించింది. అయితే వీరిద్దరు తప్ప మిగిలిన తారాగణంలో అంతగా పేరున్న వారు లేక పోవడం మైనస్ అయినప్పటికీ వారు వారి పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. 2019లో చిత్రీకరణ మొదలై జూలై 3, 2020లో విడుదల కావలసి ఈ సినిమా కరోనా పాండమిక్ వల్ల 75వ స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఓటీటీ లో విడుదలైంది. తెలుగువారికి ‘పంజా’ సినిమాతో సుపరిచితుడైన దర్శకుడు విష్ణువర్థన్ ‘షేర్షా’ను పవర్ ప్యాక్డ్ మూవీగా తీర్చిదిద్దాడు.
శ్రీవాత్సవ స్క్రీప్ట్ ఆయనకు చక్కగా తోడ్పడింది. జాన్ స్టీవార్ట్ సంగీతం, కమల్ జీత్ నేగి కెమెరా
పనితనం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ‘షేర్షా’ను ముందువరుసలో నిలపటానికి కృషి చేశాయి.

ప్లస్ పాయింట్స్
విష్ణువర్థన్ దర్శకత్వం
సిద్ధార్థ్ మల్హోత్రా నటన
వార్ సీన్స్
కెమెరా పనితనం

మైనస్ పాయింట్స్
అక్కడక్కడా ల్యాగ్
కొత్త నటీనటులు

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: గ్రిప్పింగ్ వార్ డ్రామా