‘హృదయ కాలేయం’తో తెలుగువారి ముందుకు బర్నింగ్ స్టార్ గా వచ్చాడు సంపూర్ణేశ్ బాబు. ఆ తర్వాత ‘కొబ్బరి మట్ట’లో ఏకంగా మూడు పాత్రలు పోషించి మెప్పించాడు. అయితే ఈ రెండు సినిమాలు స్పూఫ్ కామెడీతో తెరకెక్కాయి. ఆ తర్వాత ఆ తరహా చిత్రాలు కొన్ని చేసినా ఇప్పుడు మాత్రం సీరియస్ యాక్షన్ మూవీగా ‘బజార్ రౌడీ’తో శుక్రవారం జనం ముందుకు వచ్చాడు. మరి ఈ ‘బజార్ రౌడీ’ ప్రేక్షకులను మెప్పించాడో లేదో చూద్దాం.
చంద్రశేఖర్ (నాగినీడు) చాలా స్ట్రిక్ట్ ఫాదర్. కొడుకు కాళి (సంపూర్ణేశ్ బాబు) పుట్టిన తర్వాత అతనికి బాగా కలిసి వస్తుంది. అయితే పిల్లాడు ఎక్కడ అదుపు తప్పి పోతాడో అని కొట్టి మరీ భయపెడుతుంటాడు. తండ్రి చర్యలకు భయపడిపోయిన కాళి… ఓ చిన్న సంఘటనతో ఇల్లు వదిలి పారిపోతాడు. పదిహేనేళ్ళ పాటు ఓ బస్తీలో పెరుగుతాడు. అయితే… తండ్రి ఆస్తిని సొంత బంధువులే కాజేయాలని చూసినప్పుడు కాళి… చంద్రశేఖర్ కొడుకుగా ఆ ఇంటికి వెళతాడు… తన ఇంటిలోనే తాను డూప్ గా ప్రవర్తిస్తాడు. చివరకు కాళి బంధువులకు ఎలా బుద్ధి చెప్పాడు? తనను నమ్ముకున్న బస్తీ వాసులకు ఎలాంటి న్యాయం చేశాడు? అనేది ఈ చిత్ర కథ.
తొలి చిత్రంతోనే చక్కని హాస్యనటుడి ఇమేజ్ ను సంపూ సంపాదించుకోవడం గొప్ప వరం. దానికి భిన్నమైన ఇమేజ్ ను ఇప్పుడు పొందాలనుకుంటే… అది అంత తేలికగా వచ్చేయదు. ఈ సినిమా విషయంలో అదే పొరపాటు జరిగింది. స్పూఫ్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన సంపూ, అందుకు భిన్నమైన సీరియస్ పాత్రను చేస్తే వాళ్ళు మెచ్చరు. దానికి బలమైన కథ, ఆసక్తికరమైన కథనం అవసరం. కానీ ‘బజార్ రౌడీ’లో ఆ రెండూ మిస్ అయ్యాయి. దానికి తోడు ఇరవై ముప్పై యేళ్ళ క్రితం సినిమానే ఇప్పుడు చూపిస్తున్నారేమిటనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రథమార్థం అంతా సంపూర్ణేశ్ బాబును ఎలివేట్ చేసే సీన్స్ తో సాగిపోయింది. ద్వితీయార్థంలోనే కాస్తంత కథ మనకు కనిపిస్తుంది. కానీ పతాక సన్నివేశాలు గొప్పగా ఏమీ లేవు.
అయితే… సంపూర్ణేశ్ బాబు తనకిచ్చిన పాత్రకు న్యాయం చేయడానికి తీవ్రంగా కృషి చేశాడు. కాసేపు ఎస్వీఆర్ ను ఇమిటేట్ చేసిన సంపూ, మరికాసేపు ఎన్టీయార్ నూ అనుకరిస్తూ నటించడం ఒక వర్గాన్ని ఆకట్టుకునేలా చేసింది. ఇక హీరోయిన్ మహేశ్వరిది పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర కాదు. నాగినీడు, షాయాజీ షిండే, 30 ఇయర్స్ పృథ్వీ, కత్తి మహేశ్, సమీర్, షఫీ, కరాటే కళ్యాణీ, జయలలిత తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. టెక్నికల్ గానూ సినిమా ఏమీ గొప్పగా లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ సో..సో.. గా ఉన్నాయి. మరుధూరి రాజా తన కలం బలాన్ని హీరోని ఎలివేట్ చేయడానికే ఉపయోగించారు. ఎడిటర్ గౌతంరాజు సీనియారిటీ ఎక్కడ మనకు కనిపించదు. పోరాట సన్నివేశాలలో సంపూర్ణేశ్ బాబు బాగా కష్టపడ్డాడు. చిత్రం ఏమంటే.. అలా ఒక సందర్భంలో గాయాల పాలు కావడంతో ఈ సినిమా మీద అతని అభిమానులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల జరిగిన ఓ వేడుకలో తన కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని సంపూ చెప్పడం, దర్శకుడు వసంత నాగేశ్వరరావు కో-డైరెక్టర్ గా తనకున్న అనుభవాన్ని ఈ ఫిల్మ్ మేకింగ్ లో చూపించానని అనడంతో ఆ అంచనాలు పెరిగాయి. కానీ తెర మీద ఆ ఖర్చు, ఆ అనుభవం ఏదీ కనిపించలేదు. సంపూ అభిమానులు, వినోదాన్ని కోరుకునే వారికి ‘బజార్ రౌడీ’ కొంత మేరకు నచ్చవచ్చేమో కానీ… ఈ అవుట్ డేటెడ్ కామెడీని తట్టుకోవడం మామూలు ప్రేక్షకులకు కష్టమే.
ప్లస్ పాయింట్స్
- సంపూ నటన
- కొన్ని సంభాషణలు
- యాక్షన్ సీన్స్
మైనెస్ పాయింట్స్
- పాత కథ, కథనం
- మెప్పించని సంగీతం
రేటింగ్ : 2.25 / 5
ట్యాగ్ లైన్ : బజార్ కే పరిమితం!