NTV Telugu Site icon

Review : భామా కలాపం (ఆహా)

BHamakalapam

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు బి నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

అనుపమ (ప్రియమణి) ఓ మధ్య తరగతి మహిళ. కుకింగ్ వీడియోస్ చేసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. అయితే ఆమెకు ఆ వీడియోలు చేయడం కంటే తమ అపార్ట్ మెంట్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తే ఎక్కువ. దాంతో తన ఇంటి కిటికీ నుండి మొత్తం అన్ని ఫ్లాట్స్ మీద ఓ కన్నేసి ఉంచుతుంది. ఆమెకు తగ్గదే ఇంటి పనిమనిషి శిల్ప (శరణ్య ప్రదీప్‌). ఆ ఇంటి విషయాలూ ఈ ఇంటి విషయాలూ అనుపమ చెవిలో వేస్తుంటుంది. అలాంటి అనపమ ఒకసారి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వెనుక రహస్యం ఛేదించాలనుకుని ఓ ఫ్లాట్ లోకి వెళ్ళి బుక్ అయిపోతుంది. అందులో నివాసముండే అప్పటికే ఫిరోజ్ హత్యకు గురి కాగా, తనపై దాడి చేసిన మణి అనే వ్యక్తిని అనుపమ పొరపాటును పొడిచి, చంపేస్తుంది. ఎలాగో తంటాలు పడి మణి శవాన్ని తన ఇంటికి తీసుకొచ్చి తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న టైమ్ లో నాయర్ (జాన్ విజయ్) అనే వ్యక్తి ఫోన్ చేసి… రెండు వందల కోట్ల విలువ చేసే కోడుగుడ్డు గురించి అనుపమను హెరాస్ చేయడం మొదలెడతాడు. అసలు ఆ కోడి గుడ్డు వెనుక ఉన్న కథేంటీ? తనకు తెలియకుండానే ఈ వివాదంలో చిక్కుకున్న అనుపమ అందులోంచి ఎలా బయట పడింది? ప్లాట్స్ లోని వారి కష్టాలను విని వారికి పరిష్కారం చెప్పే డేనియల్ బాబు (కిశోర్ కుమార్) హస్తం ఇందులో ఏమేరకు ఉంది? అనుపమపై ఓ కన్నేసి ఉంచిన ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్ పల్లవి (శాంతి రావ్‌) ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతం అయ్యింది? అనేదే ‘భామా కలాపం’ కథ.

తెలుగులో మర్డర్ మిస్టరీలు చాలా వచ్చినా, ఈ తరహా చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు. కథ ప్రారంభమే కోల్ కత్తాలోని ఓ యాంటిక్స్ ఎగ్ దొంగతనంతో మొదలవుతుంది. అత్యంత విలువైన ఆ ఎగ్ కోసం నాయర్ అనే వ్యక్తి పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. కానీ చివరి క్షణంలో అది చేజారిపోతుంది. దానిని తిరిగి పొందటానికి అతను చేసే ప్రయత్నమే ఈ చిత్రం. ఎగ్ చుట్టూ సాగే ఈ కథలో రకరకాల పాత్రలు వచ్చి వెళుతుంటాయి. ఎగ్ ను ఛేజ్ చేసే సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ఎగ్ పలువురి చేతులు మారడంతో అది నాయర్ కు చేరుతుందా లేదా అనేది ఉత్కంఠను కలిగిస్తుంది. కానీ దర్శకుడు క్లయిమాక్స్ లో ఊహకందని ముగింపునిచ్చి వీక్షకులను ఉలిక్కి పడేట్టు చేస్తాడు.

ప్రియమణి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పాత్రకు చక్కగా సెట్ అయ్యింది. ఒకరకంగా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ లోని పాత్ర ఛాయలే ఇందులో కనిపించినా, ఆ చొరవతో పాటు ఇందులో కాస్తంత గడుసుదనం గుప్పించారు. ఇతరుల విషయాల పట్ల ఆసక్తి చూపించే మహిళగా ప్రియమణి బాగా నటించింది. పనిమనిషిగా శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ యాసలో సాగిన ఆమె సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఏడు నెలల గర్భిణిగా శాంతి రావు చక్కని నటన కనబరిచింది. ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా నేచురల్ గా ఉంది. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించిన వ్యక్తులు ఇద్దరు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డేనియల్ బాబు గా నటించిన కిశోర్ కుమార్ పొలిమేర గురించి. శిలువ ఎక్కిన ప్రభువు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాడని నమ్మడం, ఆ నమ్మకాన్ని చుట్టూ ఉన్న వారి బుర్రలోకి ఇంజెక్ట్ చేయడం, ప్రభువు రాకడ కోసం ఎంతకైనా తెగించడం… ఈ పాత్ర నైజం ను అర్థం చేసుకుని, ఓ రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళి నటించినట్టుగా చేశాడు. ఇక నాయర్ పాత్రలో విలనిజానికి సరికొత్త బాష్యం చెప్పాడు తమిళ నటుడు జాన్ విజయ్. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారికి ఆయన సుపరిచితుడే. అప్పుడెప్పుడో నారా రోహిత్ ‘శంకర్’లో ఓ కీలక పాత్ర పోషించాడు జాన్ విజయ్. ఇందులో భిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. ప్రధాన పాత్రధారులే కాకుండా చిన్న చిన్న పాత్రలు చేసిన వారి నుండి కూడా చక్కని నటనను దర్శకుడు అభిమన్యు రాబట్టుకున్నాడు.

దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నాడని నమ్మడంలో తప్పు లేదు. అయితే… ఆ నమ్మకం పరాకాష్టకు చేరిపోయి మనిషిలోని పశు ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చినప్పుడే సమస్య వస్తుంది. యేసు రాకడను నమ్మడం తప్పు కాదు, కానీ ఆ పిచ్చిలో అరాచకం సృష్టించడం, ఉన్మాదిగా మారిపోవడం సమాజానికి కీడును చేస్తుంది. ఈ కథ మిస్ అయిన రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే యాంటిక్స్ ఎగ్ గురించే అయినా, దర్శకుడు మాత్రం దేవుడి పిచ్చిలో పడి ఉన్మాదులుగా మారొద్దని, స్వస్థత కూటములతో సమాజాన్ని తప్పుదారి పట్టించే వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండమని హితవు పలికాడు. మనిషిలోనే దేవుడిని చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చెప్పాడు. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. అలానే ప్రముఖ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు, సుధీర్ ఈదరతో కలిసి ఈ సినిమాను నిర్మించాడు. జస్టిన్ ప్రభాకర్ స్వరాలు ఏమంత గొప్పగా లేవు కానీ మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అలానే దీపక్ సినిమాటోగ్రఫీ బాగుంది. విప్లవ్ నైషధం ఎడిటింగ్ స్మూత్ గా ఉంది. జై కృష్ణ రాసిన సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. తొలి చిత్రంతోనే అభిమన్యు దర్శకుడిగా చక్కని ప్రతిభను కనబరిచాడు. మలయాళ చిత్రాలు చూసి, ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో రావేంటి? అని ప్రశ్నించే వారికి ‘భామా కలాపం’ చక్కని జవాబు. చక్కని సందేశం ఉన్న ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదిస్తే బాగుంటుంది.

రేటింగ్: 3.25 / 5

ప్లస్ పాయింట్స్
ఆసక్తి కలిగించే కథ, కథనం
నటీనటుల నటన
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
అక్కడక్కడా టెంపో డ్రాప్ కావడం
నిరాశ పరిచే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: డెలీషియస్ డిష్!