జానర్: యాక్షన్ డ్రామా
నటవర్గం: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, రావు రమేశ్, బ్రహ్మానందం, మురళీ శర్మ, రఘుబాబు, తనికెళ్ల భరణి, కాదంబరి కిరణ్
దర్శకత్వం: సాగర్ కె.చంద్ర
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న జనం ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం వకీల్ సాబ్ అభిమానులను ఆకట్టుకున్నా, అందులో వారికి కావాల్సిన కిక్ లేదనే చెప్పాలి. దాంతో భీమ్లానాయక్‌పై మొదటి నుంచీ పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. సాధారణంగానే స్టార్ హీరోస్ మూవీస్ విడుదల దగ్గర పడే కొద్దీ వారిలో నెలకొన్న ఆసక్తి పెరుగుతూ వస్తుంది. పైగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలు సైతం సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్‌పై ఫ్యాన్స్ కు మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. మలయాళంలో 2020లో రూపొందిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఆధారంగా భీమ్లా నాయక్ తెరకెక్కింది.
భీమ్లా నాయక్ కథ విషయానికి వస్తే.. మిలిటరీ నుండి రిటైర్ అయిన డ్యానీ తనకు తిరుగులేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే ఊరికి సబ్ ఇన్ స్పెక్టర్ గా వచ్చిన భీమ్లా నాయక్ తో డ్యానీకి చిక్కులు మొదలవుతాయి. ఓ కేసు విషయంలో డ్యానీని భీమ్లా జైలుకు పంపుతాడు. తాను బెయిల్ పై వచ్చాక నీ కథ చూస్తా అన్నట్టుగా డ్యానీ, నాయక్ కు వార్నింగ్ ఇస్తాడు. వారిద్దరి మధ్య వైరం నెలకొంటుంది. డ్యానీ తండ్రి అతని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. అలాగే భీమ్లా భార్య సుగుణ కూడా భర్తను ఏ మాత్రం తగ్గొద్దంటూ ఎగదోస్తుంటుంది. తరువాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చివేయడం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. చివరకు బీమ్లా, డ్యానీ ఇద్దరూ ఒకరికిపై ఒకరు దాడికి దిగుతారు. ఒకరినొకరు చితక్కొట్టుకుంటారు. భీమ్లా చేతిలో డ్యానీ చావడం ఖాయమని తేలుతుంది. అదే సమయంలో డ్యానీ భార్య వచ్చి భీమ్లాను వేడుకుంటుంది. ఒకప్పుడు ఆమె చిన్నతనంలో భీమ్లా కాపాడి ఉంటాడు. అందువల్ల ఈ సారి కూడా ఆమె కోసం భీమ్లా, డ్యానీని వదిలేస్తాడు. ఆ పై భీమ్లా వేరే ఊరికి బదిలీ అవుతాడు. ఓ ఏడాది తరువాత భీమ్లా, డ్యానీ కలుసుకుంటారు. ఇద్దరూ కరచాలనం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
పవన్ కళ్యాణ్ కు పోలీస్ క్యారక్టర్లు అచ్చివస్తాయని చెప్పొచ్చు. ఇందులోనూ ఆయన ఖాకీ దుస్తుల్లో భలేగా ఆకట్టుకున్నారు. ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌లో బిజూ మీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ ధరించారు. బిజూ స్లో యాక్టింగ్‌కు, పవన్ పవర్ ఫుల్ యాక్టింగ్‌కు ఎంతో తేడా కనిపిస్తుంది. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ ధరించిన పాత్రను తెలుగులో రానా పోషించారు. నిజానికి ఒరిజినల్ లో పృథ్వీ పాత్ర చుట్టూ ఎక్కువ కథ తిరుగుతుంది. తెలుగులో బీమ్లా నాయక్ పాత్ర చుట్టూ కథ పరిభ్రమించడం విశేషం. నిజానికి అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం దాదాపు మూడు గంటల పాటు నడుస్తుంది. చాలా చోట్ల బోర్ కొట్టిస్తుంది. అయితే తెలుగులో కథలో కొన్ని మార్పులు చేసి, ఓ అరగంట కథ నిడివిని తగ్గించారు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్. దాంతో రెండున్నర గంటల పాటు సాగే భీమ్లా నాయక్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించదు. పవన్ తనదైన బాణీ పలికిస్తూ భీమ్లా పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. ఇక రానా డ్యానీ పాత్రలో జీవించారనే చెప్పాలి. నిత్యమీనన్, సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు సైతం పరిధికి మించకుండా నటించారు
ఒరిజినల్ తో పోలిస్తే భీమ్లా నాయక్‌ను మరింత రిచ్ గా చిత్రీకరించారనిపిస్తుంది. అందుకు నిర్మాత నాగవంశీ అభిరుచి కారణమని చెప్పవచ్చు. ఇక దర్శకుడు సాగర్ కె.చంద్ర సినిమాను తెలుగువారికి నప్పేలా తెరకెక్కించడంలో సఫలీకృతుడయ్యారనే చెప్పాలి. థమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నేపథ్యసంగీతంతో మురిపించారనే అనాలి. భీమ్లా నాయక్ ఎంట్రీ సీన్ ఫ్యాన్స్ ను అలరించేలా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది. పాటల్లో రామజోగయ్య రాసిన భీమ్లా నాయక్… టైటిల్ సాంగ్, అడవి తల్లి మాట.. పాట ఆకట్టుకుంటాయి.ఇక త్రివిక్రమ్ రాసిన లాలా భీమ్లా… సాంగ్ సైతం మురిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు అంత ఇష్టం ఏందయ్యా.. పాట జనాన్ని భలేగా ఊరించింది. అయితే సినిమాలో ఆ పాట చోటు చేసుకోకపోవడం నిరాశ కలిగించింది. బహుశా, కొన్ని రోజుల తరువాత ఆ పాటను సినిమాలో కలుపుతారేమో! మొత్తానికి భీమ్లా నాయక్ ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియుమ్ కంటే బాగుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒరిజినల్ అంత నిడివి లేకపోవడం, అది చూసిన వారిని సైతం మెప్పించేలా తెలుగు సినిమా రూపొందడం విశేషం!
ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్ , రానా అభినయం
నిత్య మీనన్ కొత్తగా కనిపించడం
ఆకట్టుకొనే పతాక సన్నివేశాలు
సెకండాఫ్ లోని పోరాట సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
ప్రథమార్ధం నత్తనడకగా సాగడం
అంత ఇష్టమేందయ్యా.. పాట సినిమాలో కనిపించక పోవడం
రేటింగ్: 3/5
ట్యాగ్‌లైన్: ‘భీమ్లా’ నాయకుడే..!!