NTV Telugu Site icon

రివ్యూ: ” నెట్ ” ఓటీటీ మూవీ

రివ్యూ: నెట్
విడుదల: సెప్టెంబర్ 10, 2021, జీ5
నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అవికా గోర్, ప్రణీత పట్నాయక్, విశ్వదేవ్, విష్ణు
నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్రా
సంగీతం: నరేశ్ కుమరన్
కెమెరా: అభిరాజ్ నాయర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం: భార్గవ్ మాచర్ల

ఇటీవల కాలంలో ప్రతి మనిషి కదలికలపై మూడో కన్ను నిఘా ఎక్కువ అయింది. దీనికంతటికీ కారణం ‘నెట్’. ఈ నెట్ అతి చవకగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా కుటుంబాలపై నిఘా పెరిగితే ఏమవుతుందన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘నెట్’. రీసెంట్ గా హాస్యనటునిగా తనకంటూ పెద్ద గుర్తింపు సంపాదించిన రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారి. ఇక వరుసగా సంచలన విజయాలతో దూసుకువచ్చి ఆపై పరాజయాలు పలకరించటంతో టాలీవుడ్ కి దూరమై మళ్ళీ ‘నెట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. తమడ మీడియా నిర్మించిన ఈ ‘నెట్’ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వినాయకచవితి కానుకగా 10వ తేదీన విడుదల చేసింది.

కథ విషయానికి వస్తే ఒక చిన్న పట్టణంలో మొబైల్ స్టోర్ యజమాని లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ).
తండ్రి బలవంతం మీద పల్లెటూరి అమ్మాయి సుచిత్ర (ప్రణీతా పట్నాయక్)ను పెళ్ళి చేసుకుని ఇష్టం లేని కాపురం చేస్తుంటాడు. జీవితంపై అసంతృప్తితో ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత స్పైయింగ్ వెబ్ సైట్ ని ఫాలో అవుతుంటాడు. ఆ స్పైయింగ్ వెబ్ లో ప్రియ(అవికాగోర్)ను చూసి ఫాలో అవడం ప్రారంభిస్తాడు. ప్రియా అపార్ట్‌మెంట్ హిడెన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. అది ఆమె ఆమె ప్రియుడు రంజిత్‌ (విశ్వదేవ్) వ్యక్తిగత జీవితాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుంది. ప్రియాను రంజిత్ చీటింగ్ చేస్తున్నాడని, ప్రియకు సహాయం చేయాలని ప్రయత్నిస్తాడు. లక్ష్మణ్ అమాయక వ్యామోహం అతడి జీవితాన్ని ఒడిదుడుకుల్లోకి నెట్టడమే కాకుండా అనైతిక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అలా ప్రతి ఒక్కరూ ‘నెట్’లో చిక్కుకుంటారు.

మరి చివరికి వారు ‘నెట్’ నుండి బయటపడతారా? లేదా? అన్నదే ‘నెట్’ సినిమా. నటీనటుల విషయానికి వస్తే రాహుల్ రామకృష్ణ తను పోషించిన లక్ష్మణ్ పాత్రలో జీవించాడనే చెప్పాలి. అలాగే అతడి భార్యగా నటించిన ప్రణీతా పట్నాయక్ తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ ఫేస్ లో జీవం లేదు. అతిగా సన్నబడటం వల్లనో ఏమో కానీ స్ర్కీన్ మీద డల్ గా కనిపించింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే అంతగా చెప్పుకునేది ఏమీ లేదనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకుడు భార్గవ్ మాచర్లనే. ఎంచుకున్న కథను తెరపై చూపించటంలో ఇతగాడు తడబడ్డాడు. చెప్పదలచుకున్న అంశాన్ని చెప్పలేకపోయాడు.

‘నెట్’ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో జనరలైజ్ చేసి చెప్పలేక పోయాడు. కేవలం రెండు కుటుంబాలకే పరిమితం చేశాడు. లక్ష్మణ్ పాత్రను స్త్రీలోలుడుగా చూపిస్తూ ఓ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నించినట్లు ముగించారు. అయితే ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడేమో అనేలా చిత్రీకరణ ఉంది తప్ప ఆ పాత్రలో పరివర్తన అనేది ఆడియన్స్ కి ఎక్కడా కనపడదు. ఇది దర్శకుడి వైఫల్యమే. ఇక కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తూ వేరే అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నించాను అని చెప్పించటం హాస్యాస్పదంగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తీయటంలో నేర్పున్న తమడ మీడియా ఈ స్ర్కిప్ట్ ను ఎలా ఒప్పుకుందో అర్థం కాలేదు. ప్రియ ప్రియుడి మోసం నుంచి బయట పడినట్లు చూపించారే తప్ప స్పైయింగ్ కెమెరాస్ పెట్టింది ఎవరు? అలా ఎంత మంది మోసపోయారు? వారికి ఎలాంటి న్యాయం జరిగిందనే విషయాలను పట్టించుకోనేలేదు. ‘నెట్’కి సంబంధించి అతి పెద్ద బ్లండర్ ఇదే.

రేటింగ్
2.25

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
బలహీనమైన కథనం
దర్శకత్వ లోపం
అసభ్యమైన సంభాషణలు

ట్యాగ్ లైన్
కనెక్ట్ కాని ‘నెట్’

Show comments