NTV Telugu Site icon

రివ్యూ: నీడ (మలయాళ డబ్బింగ్)

Nayanthara's Needa Movie Telugu Review

బేసికల్ గా మలయాళ నటి అయిన నయనతార తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తోంది. అయితే అడపా దడపా మలయాళ చిత్రాల్లో నటించడం మానలేదు. అలా ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘నిళల్’. ఈ యేడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘నీడ’ పేరుతో డబ్ చేసి, శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మిస్టరీ మూవీ కథేమిటో తెలుసుకుందాం.

జాన్ బేబీ (కుంచాకో బొబన్) జిల్లా మెజిస్ట్రేట్. ఓ రోజు జరిగిన కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడతాడు. ఆ దెబ్బల నుండి కోలుకున్నా, మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంటాడు. ఆ జబ్బుకు పోస్ట్ ట్రెమాటిక్ ట్రెస్ డిజార్డర్ అనే పేరు పెడతాడు డాక్టర్! ఇదిలా ఉంటే సింగిల్ మదర్ షర్మిల (నయనతార) తన కొడుకు నితిన్ (ఇజన్ హష్)తో కలిసి ఉద్యోగ రీత్యా బెంగళూరు నుండి వైజాగ్ వస్తుంది. నితిన్ స్కూల్లో తన తోటి పిల్లలకు కొన్ని క్రైమ్ స్టోరీలను చెబుతుంటాడు. అతని కేసు చైల్డ్ స్పెషలిస్ట్ షాలినీ (దివ్య ప్రభ) దృషికి వెళుతుంది. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన జాన్ బేబీకి నితిన్ వింత ప్రవర్తన గురించి చెబుతుంది షాలినీ. యాక్సిడెంట్ తర్వాత తన మానసిక స్థితికి, నితిన్ ప్రవర్తనకు ఏమైనా సంబంధం ఉందేమోననే అనుమానం జాన్ బేబీకి కలుగుతుంది. దాంతో ఓ న్యాయమూర్తిగా తన పరిచయాలతో ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. నితిన్ చెప్పే క్రైమ్ స్టోరీస్ సోర్స్ ను జాన్ బేబీ తెలుసుకోగలిగాడా? మూడు దశాబ్దాల నాటి హత్యలు ఇప్పుడు ఎందుకు పడ్డాయి? అన్నది మిగతా కథ.

నిజానికి ఇది మిస్టరీ థ్రిల్లర్. కానీ ఒకానొక సమయంలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయేమోననే ఆలోచన ప్రేక్షకులకు కలిగేలా చేశాడు దర్శకుడు అప్పు ఎన్ భట్టతిరి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ చాలా స్మూత్ గా సాగిపోతుంది. ఎక్కడా విసుగు అనిపించదు. అయితే… హీరో జాన్ బేబీ జీవితంలోని సంఘటనలకు, నితిన్ ప్రవర్తనకు ఎలాంటి లింక్ లేకపోవడం, షర్మిల ఊహాగానాలు సైతం అవాస్తవాలు కావడంతో ప్రేక్షకులు కాస్తంత నిరాశకు గురవుతారు. కథలో తారసపడే రకరకాల వ్యక్తుల మీద అనుమానం కలించిన దర్శకుడు చివరకు ఊహకందని విధంగా ముగింపు పలకడం విశేషం. విశేషం ఏమంటే… ఇందులోని క్రైమ్ వెనుక ఉన్న కారణం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో రాజకీయ హత్యలు కొత్త కాదు. ఎన్నికలు, తదనంతరం కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పొలిటికల్ పార్టీలు హత్యలు చేయించడం అనే సంస్కృతి మనకి పెద్దగా లేదు. అది కేరళలో చాలా కామన్. పార్టీ తరఫున హత్యలు చేసే కార్యకర్తలు చాలా మందే ఉంటారు. ఈ సినిమాలో దాన్నే ప్రధానాంశంగా చూపించారు.

నటీనటుల విషయానికి వస్తే జిల్లా మెజిస్ట్రేట్ గా కుంచాకో బొబన్ హుందాగా నటించాడు. సినిమా మొదలైన తర్వాత దాదాపు అరగంట పాటు అతన్ని బ్యాట్ మ్యాన్ మాస్క్ లో చూపించడం సరదాగా ఉంది. దాని నుండి కూడా దర్శకుడు వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. ఇక షర్మిలగా నయనతార ఆ పాత్రకు న్యాయం చేకూర్చింది. ఎక్కడా అతి అనేది లేదు. నయనతార లాంటి సూపర్ స్టార్ మూవీ అంటే ఇంకేదో ఉంటుందని ఊహించుకునే వారికి, ఆమె పాత్ర చిత్రీకరణ సాదాసీదాగా ఉండటం కాస్తంత నిరాశకు గురిచేస్తుంది. ఈ మాత్రం దానికి నయనతారను ఎందుకు ఎంచుకోవడం అనే ప్రశ్న కూడా కొందరిలో ఉదయించ మానదు. ఇతర ప్రధాన పాత్రలను దివ్యప్రభ, రోనీ డేవిడ్ రాజ్, లాల్, గోవింద ఎస్ కురుప్ సమర్థవంతంగా పోషించారు. సూరజ్ ఎస్ కురుప్ సంగీతం, దీపక్ మెమన్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సంభాషణలను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చిన వేణు బాబును అభినందించాలి. ‘వకీల్ గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుండి ఈ రెండు రోజుల్లో చెప్పినన్ని అబద్ధాలు ఎప్పుడూ చెప్పలేదు’ అంటూ మెజిస్ట్రేట్ తో చెప్పించడం ఆ ప్రొఫెషన్ పై పెద్ద చురక. ఇలాంటి సంభాషణలు సినిమాలో అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి.

123 నిమిషాల నిడివి ఉన్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘నీడ’ను ఈ వీకెండ్ లో ఏ మాత్రం సమయం చిక్కినా హాయిగా ‘ఆహా’లో చూసేయొచ్చు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను, సూపర్ డూపర్ ట్విస్టులను మాత్రం ఆశించకండి!

రేటింగ్ : 2.5 /5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
నటీనటుల నటన
నేపథ్య సంగీతం
సినిమా నిడివి

మైనెస్ పాయింట్స్
సాదాసీదా కథనం
ఉత్సుకత కల్గించని సన్నివేశాలు

ట్యాగ్ లైన్: వీడని ‘నీడ’

Show comments