NTV Telugu Site icon

రివ్యూ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

most eligible bachelor review

most eligible bachelor review

కాలిజోడు సరైనది దొరక్కపోతేనే నానా ఇబ్బందులు పడతాం! అలాంటిది జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సిన లైఫ్ పార్ట్నర్ సరైన వ్యక్తి కాకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం!! కానీ ఒకసారి పెళ్ళై పోయిన తర్వాత చాలామంది సర్దుకుపోతుంటారు, ఇంకొంతమంది కటీఫ్ చెప్పేసి మూవ్ ఆన్ అవుతారు. ఆ సమస్యలు ఎదురు కాకుండా, ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటో డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో చూపించాడు. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ దసరా కానుకగా 15వ తేదీ జనం ముందుకొచ్చింది.

ఎన్నారై హర్ష (అఖిల్)కు పెద్ద కుటుంబమే ఉంటుంది. పెళ్ళీడుకు వచ్చిన హర్ష కోసం ఓ పాతిక సంబంధాలు చూసి, అతనికి నచ్చిన ఏదో ఒక అమ్మాయితో పెళ్ళి జరిపించేసి, తిరిగి అమెరికా పంపించాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే చిత్రంగా జాతకాలు కలవలేదని రిజెక్ట్ చేసిన విభా (పూజా హెగ్డే) తోనే హర్ష ప్రేమలో పడతాడు. హర్ష – విభా మధ్య సాగే దాగుడు మూతల దండాకోర్ ఆట చివరకు ఎలా సుఖాంతమైందన్నదే ఈ చిత్ర కథ.

పెళ్ళి చేసుకోబోయే ముందు ఓ మంచి అబ్బాయి, తన జీవితంలోకి రాబోతున్న అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలని కలలు కంటాడో ఈ సినిమాలో చూపించారు. అలానే తాను పెళ్ళాడబోయే అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ఓ అమ్మాయి కోరుకుంటుందో కూడా చూపించారు. చిత్రం ఏమంటే… ఈ రెండు వైస్ వెర్సా! అలాంటి అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయి దారిలోకి ఎలా వెళ్ళాడు? పెళ్ళి గురించి అమ్మాయిలో ఏర్పడి కొత్త భయాలను ఎలా పోగొట్టాడు? అనేదే ఈ సినిమా! ప్రథమార్ధంలో హర్ష ఆలోచనా విధానంలో మెచ్యూరిటీ తెచ్చే ప్రయత్నం విభా చేస్తే, ద్వితీయార్థంలో విభాను వెన్నంటి ఉండి హర్ష ఆమెను తన దారిలోకి తెచ్చుకుంటాడు. సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో భాగస్వామి ‘పక్కన’ ఉండటానికి, ‘దగ్గర’ ఉండటానికి మధ్య తేడాను దర్శకుడు భాస్కర్ చక్కగా విడమర్చి చెప్పాడు.

ఫస్ట్ హాఫ్ అంతా హీరో తనను తాను అన్వేషించుకోవడంలో సాగిపోతుంది. జీవితం పట్ల ఓ స్పష్టత ఉన్న విభా అతన్ని డామినేట్ చేయడం కనిపిస్తుంది. అందులోంచి దర్శకుడు బోలెడంత ఫన్ జనరేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో చిక్కు ముడులను విడదీసే క్రమంలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోష్ ను కాస్తంత మిస్ అవుతాం. దానికి తోడు, విభా కారణంగా తనను తాను తెలుసుకుని, క్లిష్టమైన సమస్యలను సైతం తనకు అనువుగా మార్చుకోగలిగే నేర్పు సంపాదించిన హర్ష – మరో సంబంధాన్ని తమ ఇంట్లో వాళ్ళు సెట్ చేశామని చెప్పగానే యాక్సెప్ట్ చేయడమనేది అర్థం లేనిది. ఆ రకంగా చూసినప్పుడు విభా క్యారెక్టరైజేషన్ కు ఇచ్చిన జెస్టిఫికేషన్ హర్ష పాత్రకు డైరెక్టర్ ఇవ్వలేదనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ను స్టాండప్ కామెడిన్ పాత్రకు ఎంపిక చేయడం నిజానికి ఓ రిస్క్ ఫ్యాక్టర్. అయినా ఎక్కడా కొత్తగానూ అనిపించకుండా, బోర్ కొట్టించకుండా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఆ పాత్రను చక్కగా మలిచాడు. అందుకు హాట్సాఫ్ చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే అఖిల్ నటనలో చక్కని మెచ్యూరిటీ కనిపించింది. పూజా హెగ్డే ను – విభా పాత్రను వేర్వేరుగా చూడలేం! ఆమె కాకుండా ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం కూడా!! అంతగా అందులో ఇమిడిపోయింది. ఆమె తల్లిదండ్రులుగా ప్రగతి, మురళీశర్మ; అఖిల్ అమ్మనాన్న గా ఆమని, జయప్రకాశ్ నటించారు. హీరో స్నేహితులుగా సుడిగాలి సుధీర్, ‘వెన్నెల’ కిశోర్ చక్కని వినోదాన్ని పంచారు. ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, మణిచందన, సత్య, అజయ్, అమిత్ తివారి, పోసాని, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, చైతన్య కృష్ణ, అభయ్ తదితరులు నటించారు. నిజ జీవితంలోనూ భార్యాభర్తలైన నటుడు రాహుల్ రవీంద్రన్; గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తెర మీద కూడా అవే పాత్రలు పోషించడం బాగుంది. ఇషా రెబ్బా, ఫరీదా అబ్దుల్లా, గిరిబాబు అతిథి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక నిపుణులంతా వారి వారి బెస్ట్ ఇచ్చారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. హైదరాబాద్ ను కూడా అమెరికా అంత అందంగా చూపించారు. గోపీసుందర్ ఇచ్చిన బాణీలలో ‘లెహరాయీ’ సాంగ్ థియేటర్ నుండి బయటకు వచ్చినా మన చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఓకే. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా పనితనం కూడా తెర మీద ప్రత్యేకంగా కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఫస్ట్ క్లాస్! సంభాషణలు సూపర్బ్!! ఇక కోర్టు సీన్ అయితే, థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తోంది. మొత్తం మీద దసరా పండగ రోజున కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను మలిచారు. కొంత రొమాన్స్ ఉన్నా… అది ఎక్కడా హద్దులు దాటకపోవడం విశేషం.

ప్లస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించే కథ, కథనం
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల ప్రతిభ
నవ్వుల జల్లు కురిపించే కోర్ట్ సీన్

మైనెస్ పాయింట్స్
ద్వితీయార్థంలో తగ్గిన జోష్
సినిమాటిక్ క్లయిమాక్స్

రేటింగ్: 3 / 5

ట్యాగ్ లైన్: రొమాంటిక్ బ్యాచిలర్!