NTV Telugu Site icon

రివ్యూ : మోసం చేసిన ‘కపటధారి’!

కొన్ని రీమేక్స్ జోలికి పోకపోతే మంచింది. పైగా కన్నడ రీమేక్స్ ను టేకప్ చేయడం అంత రిస్క్ మరొకటి ఉండదు. అక్కడ విజయం సాధించిన చాలా చిత్రాల తెలుగు రీమేక్స్ లో పరాజయాల శాతమే ఎక్కువ. దానికి బోలెడు ఉదాహరణలున్నాయి. ఇక తాజాగా ‘కావలదారి’ కన్నడ చిత్రం రీమేక్ గా తెలుగులో ‘కపటధారి’గా రీమేక్ అయ్యింది. ఎలా ఉందో తెలుసుకుందాం.

1977వ సంవత్సరం వరంగల్ సమీపంలో జరిపిన తవ్వకాలలో ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారికి కాకతీయుల కాలం నాటి నగలు కొన్ని దొరుకుతాయి. వాటి విలువ దాదాపు రూ. 70, 80 లక్షల వరకూ ఉంటుంది. పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆ నగలను హైదరాబాద్ తరలించకుండా అక్కడి కార్యాలయంలోనే భద్రపరుస్తారు. అదే సమయంలో ఆ డిపార్ట్ మెంట్ కే చెందిన ఓ వ్యక్తి హత్యకు గురికాగా మరో వ్యక్తి కనిపించకుండా పోతాడు. అలానే కాకతీయుల కాలం నటి నగలూ మాయమౌతాయి. కొంత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత, సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసును పోలీసులు క్లోజ్ చేస్తారు. ఇక ప్రస్తుతానికి వస్తే… సుమంత్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్. అతను డ్యూటీ చేస్తున్న ప్రదేశానికి దగ్గరలో మెట్రో రైల్ పిల్లర్ల కోసం తీసిన గోతిలో కొన్ని అస్తి పంజరాలు కనిపిస్తాయి. తన పరిధిలో లేకపోయినా ఈ క్రైమ్ కేసు మీద సుమంత్ ఆసక్తి  చూపి, ఎలా దీనిని సాల్వ్ చేశాడన్నది ‘కపటధారి’ కథ.

కన్నడంలో 2019లో విడుదలైన ‘కావలదారి’ సినిమా అక్కడ విజయం సాధించింది. దాంతో తమిళ  నిర్మాత ధనుంజయన్ దీనిని తెలుగులో సుమంత్ తో, తమిళంలో సత్యరాజ్ తనయుడు సిబితో రీమేక్ చేశారు. తమిళ వర్షన్ జనవరి 28న విడుదల కాగా తెలుగు వర్షన్ ఫిబ్రవరి 19న జనం ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ చాలా చాలా స్లోగా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. తనకు సంబంధంలేని కేసును హీరో టేకప్ చేయడానికి చూపించే పాయింట్ అసలు బలంగా లేకపోవడం  ప్రధాన కారణం. అలానే దర్శకుడు తాను రాసుకున్న కథను సీన్స్ వారిగా చూపుతూ వెళ్ళాడు తప్పితే ఎక్కడా ఊహించని ట్విస్టులు కానీ ఆసక్తి కలిగించే అంశాలు కానీ ఇందులో మనకు కనిపించవు. నలభై యేళ్ళ నాటి కేసును హీరో తిరగతోడి, అప్పటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సాయం కోరడం, అందుకోసం ఆయన ఇంటి గోడలు దూకి వెళ్ళడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాజకీయ నేతల జీవితాల్లోని చీకటి కోణాలను చూపిస్తూ,  క్లయిమాక్స్ లో పోలీస్ మార్క్ పరిష్కారంతో దీనిని దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ముగించాడు. ఇలాంటి పతాక సన్నివేశాలూ తెలుగు వారికి కొత్త కాదు.

నటీనటుల విషయానికి వస్తే… సుమంత్ గతంలో ఇలాంటి పాత్ర చేయలేదు. అందువల్ల తనవంతు ప్రయత్నంగా కష్టపడ్డాడు. అతనికి, హీరోయిన్ పాత్రధారి నందిత శ్వేతకు మధ్య ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటీ లేదు. అలానే లాకప్ న్యూస్ ఎడిటర్ కమ్ పబ్లిషర్ గా నటించిన జయప్రకాశ్ కు చెప్పిన డబ్బింగ్ మరీ ఎబ్బెట్టుగా ఉంది. నాజర్ పాత్రను సైతం దర్శకుడు సరిగా డిజైన్ చేయలేదు. అతను భార్యను, కూతురును ఎలా కోల్పోయాడో ఎక్కడా చూపించే ప్రయత్నం చేయలేదు. నటీనటుల్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా రెండు భాషల్లోనూ నటించారు. అయితే మూవీ స్టార్ గా నటించిన సుమన్ రంగనాథ్, అలానే సీఎం గా నటించిన సంపత్ మాత్రం మూడు భాషల్లో అవే పాత్రలు పోషించారు. చిత్ర నిర్మాత ధనుంజయ్, దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి సైతం గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. సినిమా మొత్తంలో ఆకట్టుకునేది సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం ఒక్కటే.

ఏవో అంచనాలు పెట్టుకుని ‘కపటధారి’కి వెళితే మాత్రం నిరాశకు గురవుతారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎలా ఉన్నా చూడాలనుకునే వారికైతే ఓకే!

ప్లస్ పాయింట్

సైమన్ కింగ్ సంగీతం

మైనస్ పాయింట్

పెద్ద జాబితానే ఉంది!

రేటింగ్ 
2 / 5

ట్యాగ్ లైన్
మోసం చేసిన ‘కపటధారి’!