ఈ వారం ‘ఆహా’లో తమిళ డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. ఒకే రోజు ఇటు ‘ఎల్.కె.జి.’, అటు ‘జీవి’ చిత్రాలను ఆ సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. వెట్రి, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం ‘జీవి’ని వి.జె. గోపీనాథ్ డైరెక్ట్ చేశాడు. 2019 జూన్ లో తమిళనాట విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యింది. మరి ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (వెట్రి) పల్లెటూరి నుండి ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. యేడాది పాటు రకరకాల పనులు చేసి చివరకు జ్యూస్ షాప్ లో జాబ్ సంపాదిస్తాడు. అందులోని టీ మాస్టర్ మణి (కరుణాకరన్)తో కలిసి ఒకే రూమ్ లో ఉంటాడు. వాళ్ళ దుకాణం ఎదురుగా సెల్ ఫోన్ షాప్ లో పనిచేసే ఆనంది (మోనిక)తో ప్రేమలో పడతాడు శ్రీనివాస్. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ స్కూల్ టీచర్ అయిన మేనమామతో పెళ్ళి నిశ్చయం కావడంతో శ్రీనివాస్ కు ఆనంది బ్రేక్ అప్ చెప్పేస్తుంది. ప్రేమలో ఎదురుదెబ్బ తగిలిన శ్రీనివాస్… ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే నిర్ణయానికి వస్తాడు. తన హౌస్ ఓనర్ లక్ష్మీ (రోహిణి) ఇంట్లోని నగలను దొంగిలించాలని స్నేహితుడితో కలిసి పథక రచన చేస్తాడు. అదే సమయంలో శ్రీనివాస్ తండ్రి పల్లెటూరిలో కన్నుమూస్తాడు. అతని అక్కయ్య ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. చిత్రం ఏమంటే… ఇప్పుడు శ్రీనివాస్ జీవితంలో జరుగుతున్న సంఘటనలే పాతికేళ్ళ క్రితం అతని ఇంటి ఓనర్ లక్ష్మీ జీవితంలోనూ జరిగి ఉంటాయి… అక్కడ నుండి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. థ్రిల్లర్ అనే పదానికి నిర్వచనంగా ఈ ‘జీవి’ చిత్రం సాగుతుంది.
సారూప్య సంఘటనలు గురించి కొందరు విని ఉంటారు. ఒకే రకమైన సంఘటనలు వేర్వేరు కుటుంబాలలో, వేర్వేరు తరాలలో జరగడం కూడా కొందరు తమ దృష్టికి వచ్చిందని చెబుతుంటారు. ఈ సినిమాలోని ప్రధానాంశం ఇదే. అలాంటి సారూప్య సంఘటనను బేస్ చేసుకుని బాబు తమిళ్ ఈ కథను తయారు చేశాడు. అయితే ప్రధమార్థం మొత్తం చాలా బోరింగ్ గా సాగుతుంది. శ్రీనివాస్ నేపథ్యం, అతను హైదరాబాద్ కు వచ్చి ఉద్యోగం చేయడం, ప్రేమ విఫలం కావడం… ఈ సన్నివేశాల్లో ఎలాంటి ఉత్సుకత వీక్షకులకు కలగదు. అతను ఇంటి ఓనర్ హౌస్ లో దొంగతనం చేసిన దగ్గర నుండి కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. తర్వాత ఏ జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలిగిస్తుంది. విశేషం ఏమంటే… ఈ సినిమా కథానాయకుడికి కూడా మొదటి నుండి క్యూరియాసిటీ ఎక్కువే. చదువుకుంది ఎనిమిదో తరగతి అయినా… కొత్త విషయాలను తెలుసుకోవాలన్న అత్యుత్సాహమే అతన్ని ఇలాంటి దొంగతనానికి పురికొల్పుతుంది. అలానే సారూప్య సిద్ధాంతం గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకునేలా చేస్తుంది. ఆ చట్రాన్ని అతను ఎలా బ్రేక్ చేశాడనే ఆసక్తి వీక్షకులలో కలిగేలా దర్శకుడు గోపీనాథ్ చేశాడు. కానీ అది మాత్రమే సరిపోదు. మరింత పకడ్బందీగా కథను క్లయిమాక్స్ కు తీసుకెళ్ళాల్సింది. అది జరగలేదు.
ఇందులోని నటీనటుల్లో ఒక్క రోహిణి తప్పితే మిగిలిన వారెవరూ తెలుగు వారికి సుపరిచితులు కాదు. దాంతో డబ్బింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఇది మన సినిమా కాదనే భావన దీనిని చూస్తున్నంత సేపు కలుగుతుంది. కె. ఎస్. సుందర మూర్తి సంగీతం, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. వేణు రాసిన ‘మనిషికి రాకూడని వ్యాధి – విరక్తి’ వంటి మాటలు ఆకట్టుకుంటాయి. ఏదేమైనా థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడే వారికే మాత్రమే నచ్చే సినిమా ‘జీవి’ అని చెప్పొచ్చు.
రేటింగ్ : 2.25 / 5
ప్లస్ పాయింట్స్
కథలోని కొత్తదనం
నటీనటుల సహజ నటన
థ్రిల్లర్ జానర్ కావడం
మైనెస్ పాయింట్
నత్తనడకలా సాగే కథనం
పరిచయం లేని నటీనటులు
అలరించని పాటలు
ట్యాగ్ లైన్: ఉత్సుకత కలిగించని ‘జీవి’