NTV Telugu Site icon

James Review: జేమ్స్

విడుదల తేదీ: 17-3-2022
తారాగణం: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, అను ప్రభాకర్, శ్రీకాంత్, శరత్ కుమార్, హరీశ్ పెరాడీ, తిలక్ శేఖర్, ముకేశ్ రుషి, ఆదిత్య మీనన్, అవినాశ్, సాధు కోకిల, చిక్కన్న, సుచేంద్ర ప్రసాద్, వజ్రగిరి
నిర్మాణం: కిశోర్ పత్తికొండ
సంగీతం: చరణ్‌ రాజ్
సినిమాటోగ్రఫి: స్వామి జె.గౌడ
రచన, దర్శకత్వం: చేతన్ కుమార్

కన్నడ నాట పవర్ స్టార్ గా జేజేలు అందుకున్న పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే రోజున ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదల కావడం అభిమానులకు కొండంత ఊరట ఇచ్చిందనే చెప్పాలి. పునీత్ ఇమేజ్ కి అనుగుణంగా మాస్ మసాలాలు దట్టించి మరీ దర్శకుడు చేతన్ కుమార్ ‘జేమ్స్’ను తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ అనువాదమైంది. గురువారం జనం ముందు ‘జేమ్స్’గా నిలచిన పునీత్ రాజ్ కుమార్ కు అభిమానులు జై కొడుతున్నారు.

కథ ఏమిటంటే.. పునీత్ సంతోష్ కుమార్ గా సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతుంటాడు. ఇక డ్రగ్ మాఫియాను లీడ్ చేస్తున్న వ్యక్తి చనిపోవడంతో వారి కుటుంబ రక్షణ కోసం నియమించబడతాడు. తన పనిలో భాగంగా నేర్పుగా ఉంటూ పలు మార్లు కుటుంబాన్ని, ఆ ఇంటి అమ్మాయిన అపదలనుంచి కాపాడతాడు. ఆ అమ్మాయి తనను ఇష్టాన్ని వ్యక్తం చేయగా తను వచ్చిందే ఆ ఇంటి వారిని చంపటానికి అని వెల్లడిస్తాడు. అసలు తను వారిపై పగపట్టవలసిన అవసరం ఏమిటి? సంతోష్ ఎవరు. తన పగను చల్లార్చుకున్నాడా? అన్నదే సినిమా.

పునీత్ అకాల మరణంతో ‘జేమ్స్’పై అంచనాలు చాలా రెట్లు పెరిగాయి, బిగ్ స్క్రీన్‌పై పునీత్ స్టైలిష్ గా ఉండి ఆకట్టుకున్నాడు. ప్రథమార్ధంలో యాక్షన్ తో ద్వితీయార్థంలో ఎమోషన్ తో అలరించే ప్రయత్నం చేశాడు. కన్నడ నాట అతనికి ఉన్న ఇమేజ్ కి సరైనా పాత్రను ఈ చిత్రంలో పోషించాడు పునీత్. ఆరంభలో వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌లో రచితా రామ్, ఆషికా రంగనాథ్, శ్రీలీల మెరవగా… పునీత్ సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ అతిథి పాత్రలు పోషించారు. హీరోయిన్ గా ప్రియాఆనంద్, విలన్లుగా శ్రీకాంత్, ముఖేశ్ రుషి, ఆదిత్యమీనన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. చరణ్‌ రాజ్ నేపథ్య సంగీతం, స్వామి.జె. గౌడ ఫోటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయనటంలో ఎలంటి అతిశయోక్తి లేదు. దర్శకుడు చేతన్ కుమార్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం విఫలం అయ్యాడనే చెప్పాలి. పునీత్ ఆఖరి సినిమాగా కలకాలం నిలిచిపోవలసిన ‘జేమ్స్’కి యాక్షన్ మూవీ గుర్తింపు మాత్రమే దక్కుతుంది. ఎనీవే మరోసారి ‘జేమ్స్’తో పునీత్ అందరికీ గుర్తుకు వస్తాడు.

రేటింగ్: 3/5

ప్లస్ పాయింట్స్ :
పునీత్ చివరి చిత్రం కావడం
పునీత్ అభినయం
నిర్మాణ విలువలు
ఫోటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :
ఓవర్ డోస్ యాక్షన్
కథ, కథనం

ట్యాగ్ లైన్ : పునీత్ కోసమే..