NTV Telugu Site icon

రివ్యూ : హంగామా -2 (హిందీ)

Hungama-2 Movie Telugu Review

పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి 14 సంవత్సరాల తర్వాత, ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఎనిమిదేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘హంగామా -2’. గతంలో మలయాళంలో వచ్చిన ‘మిన్నారం’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రమిది. గతంలో వచ్చిన ‘హంగామా’కు దీనికి పేరులో తప్పితే మరే రకమైన పోలిక లేదని విడుదలకు ముందే ప్రియదర్శన్ స్పష్టం చేశారు. జూలై 23 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే రిటైర్డ్ జైలర్ కపూర్ (అశుతోష్ రాణా) ఇంటికి ఓ రోజున చంటి పాపను తీసుకుని వాణి కపూర్ (ప్రణీత్ సుభాష్‌) అనే యువతి వస్తుంది. ఆ పాపకు తండ్రి కపూర్ రెండో కొడుకు ఆకాశ్ (మీజాన్ జఫ్రీ) అని చెబుతుంది. మొదట్లో వాణి ఎవరో తనకు తెలియదని బుకాయించిన ఆకాశ్, ఆ తర్వాత కాలేజీలో ఆమెతో కలిసి చదువుకున్నానని, అయితే ఆ లవ్ బ్రేకప్ అయ్యిందని చెబుతాడు. వాణి తీసుకొచ్చిన బిడ్డకు మాత్రం తాను తండ్రిని కాదని స్పష్టం చేస్తాడు. అందుకు తగిన ఆధారాలు సేకరించడానికి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంజలి (శిల్పాశెట్టి) సాయం కోరతాడు ఆకాశ్. ఈ సందర్భంగా ఆకాశ్, అంజలి కాస్తంత చనువుతో వ్యవహరించడం చూసి అంజలి భర్త, లాయర్ రాధేశ్యామ్ తివారి (పరేశ్ రావెల్) భార్యను అనుమానిస్తాడు. ఇదే సమయంలో ఆకాశ్ కు బజాజ్ (మనోజ్ జోషి) కూతురుతో పెళ్ళి నిశ్చయమౌతుంది. మరి వాణి కపూర్ తీసుకొచ్చిన బిడ్డకు తండ్రి ఎవరు? ఆకాశ్ కపూర్ పెళ్ళి మనోజ్ జోషి కూతురుతో అయ్యిందా? అనవసరంగా భార్య అంజలిని అనుమానించి తివారి తన తప్పు తెలుసుకున్నాడా? అనేది మిగతా కథ.

ప్రియదర్శన్ గతంలో మలయాళంలోనే కాదు… హిందీలోనూ సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో తెరకెక్కించారు. ఆయన నుండి… అదీ ఎనిమిదేళ్ళ విరామం తర్వాత సినిమా వస్తోందంటే అభిమానులంతా గొప్పగా ఉంటుందని ఆశపడటంలో అర్థం ఉంది. అలానే ‘అప్నే’ సినిమా తర్వాత 14 యేళ్ళకు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకు శిల్పాశెట్టి వస్తోందంటే ఆమె ఫ్యాన్స్ కూడా ఏవేవో ఊహించుకుంటారు. ఈ విషయంలో ప్రియదర్శన్ పూర్తిగా నిరాశకు గురిచేస్తే, శిల్పాశెట్టి కొంతలో కొంత ఓదార్చింది. ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో రాజీ పడని కారణంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ బాగుంది. పైగా ‘చురాకే దిల్ మేరా…’ సాంగ్ లో హుషారుగా స్టెప్పులేసి అలరించింది. కాకపోతే… శిల్పాశెట్టిని పరేశ్ రావెల్ భార్యగా ఊహించుకోవడమే ఆమె ఫ్యాన్స్ మనసుకు కాస్తంత కష్టం కలిగిస్తుంది. అయితే… దర్శకుడు ప్రియదర్శన్ కథానుగుణంగా ఈ జంటను సెట్ చేశాడని సమాధానపడాలి.

హీరోగా నటించిన జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్ నటించాలని తపించాడు కానీ పెద్దంత ఫలితం కనిపించలేదు. కన్నడ భామ, పలు తెలుగు చిత్రాలలో నటించిన ప్రణీత సుభాష్‌ కు ఇది మొదటి హిందీ సినిమా. తొలి చిత్రంలోనే ప్రాధాన్యమున్న పాత్రను ప్రణీత పోషించడం విశేషం. ఇక ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన పరేశ్ రావెల్ ఇందులో అనుమానపు భర్తగా నటించాడు కానీ పెద్దంతగా మెప్పించలేక పోయాడు. ఇతర ప్రధాన పాత్రలను మనోజ్ జోషి, జానీ లివర్, రాజ్ పాల్ యాదవ్, టికు తల్సానియా తదితరులు పోషించారు. ఎవరి స్థాయిలో వారు వినోదాన్ని పండించడానికి ప్రయత్నించారు. కానీ అది సఫలం కాలేదు. ఇక ప్రేక్షకులకు సర్ ప్రైజ్ అంటే అక్షయ్ ఖన్నా నుండి లభిస్తుంది. అతని ఎంట్రీతో సినిమాలో ఏదో ఊహించని ట్విస్ట్ ఉంటుందని వీక్షకులు భావిస్తారు. కానీ అదేం లేకుండానే మూవీ క్లయిమాక్స్ కు చేరిపోతుంది. నిజం చెప్పాలంటే తండ్రి ఎవరో తెలియకుండా ఓ కుటుంబంలోకి ఓ మహిళ ప్రవేశించే సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఆమెను బయటకు పంపలేక, ఇంటిలో ఉంచుకోలేక సతమతమయ్యే కుటుంబాల కథలు మనకు కొత్తకాదు. ఇదీ అదే కోవకు చెందింది. పైగా చాలా సన్నివేశాలలో కామెడీ కూడా అవుట్ డేటెడ్ ది! దాంతో ఎప్పుడో పది పన్నెండేళ్ళ నాటి సినిమాను ఇప్పుడు చూస్తున్నామనే భావన కలుగుతుంది.

సాంకేతిక నిపుణులలో ఎన్.కె. ఏకాంబరం సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ అందాలను ఆయన తన కెమెరాలో చక్కగా బంధించారు. అనుమాలిక్ బాణీలు, రూనీ రాఫెల్ నేపథ్య సంగీతం ఏమంత గొప్పగా లేవు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే స్టోరీ పర్మిట్ చేసింది కదాని హద్దులు మీరకుండా ఈ కథను నడిపిన ప్రియదర్శన్ ను అభినందించాలి. బట్… ఆయన రీ-ఎంట్రీ మూవీ ‘హంగామా -2’ పేరుకు తగ్గట్టుగా లేదన్నది వాస్తవం.

రేటింగ్: 2.25 /5

ప్లస్ పాయింట్స్
శిల్పాశెట్టి రీ-ఎంట్రీ
ప్రొడక్షన్ వాల్యూస్
ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
బోర్ కొట్టించే కథనం

ట్యాగ్ లైన్: పేరుకు తగ్గట్టుగా లేదు!

Show comments