NTV Telugu Site icon

Honey Moon Express Review: హెబ్బా పటేల్ హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ

Honeymoon Express Song

Honeymoon Express Song

Honey Moon Express Movie Review in Telugu: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా తెరకెక్కినది. అక్కినేని వారి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కు డీన్ గా పనిచేసిన బాల రాజశేఖరుని దర్శకత్వంలో సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా రివ్యూ చూడాల్సిందే.

కథ: సోనాలి(హెబ్బా పటేల్), ఈషాన్(చైతన్య రావు) తొలిచూపులోనే ప్రేమలో పడతారు. పెద్దలని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. ప్రేమలో పడి పెళ్లి అయితే చేసుకున్నారు కానీ వీరిద్దరిదీ భిన్న ధ్రువాల మనస్తత్వం. దీంతో వీరి మధ్య విభేదాలు వచ్చి రిలేషన్ షిప్ కౌన్సిలింగ్ ఇచ్చేవారిని కలుస్తారు. అయినా కాపురం సెట్ అవ్వదు కానీ అనుకోకుండా సీనియర్ జంట(తనికెళ్ళ భరణి, సుహాసిని) వీళ్ళని కలిసి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అని ఒక గేమ్ పేరుతో ఒక రిసార్ట్ కి పంపిస్తారు. అసలు ఆ వృద్ధ జంట ఎవరు? హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ గేమ్ ఏంటి? ఈ జంట మధ్య గొడవలు పరిష్కారం అయ్యాయా? తిరిగి ఈ జంట ఒక్కటయ్యారా.. ? ఈ వృద్ధ జంట ఎందుకు వారి జీవితాలను మార్చాలనుకున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: కధగా చెప్పాలంటే ఇది కొత్త కథేమీ కాదు. గతంలో వచ్చిన పెళ్ళైన కొత్తలో లాంటి సినిమాలు గుర్తుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు పరిస్థితి వేరు కానీ ఈ మధ్య ప్రేమించి లేదా పెద్దల కారణంగా పెళ్లి చేసుకున్న యువజంటలు చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా విడాకుల గురించి ఆలోచిస్తున్నారు. అయితే అది కరెక్ట్ కాదని ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవాలి అనేది మెయిన్ ప్లాట్ గా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు బాల రాజశేఖరుని. పెళ్లి తర్వాత పడుతున్న పాట్లు, పెళ్లి చేసుకున్న తర్వాత పాస్ట్ ను తవ్వితీసి కాపురాలను కూల్చుకుంటున్న క్రమంలో అలాంటి జంటలకు సందేశం ఇవ్వడం కోసం సినిమా చేశారు? అనే అనుమానం కలిగినా ఆశ్చర్యం లేదు. అయితే గేమ్ పేరుతో రిసార్ట్ లోకి వెళ్లేంతవరకు బాగానే అనిపించినా ఆ తర్వాత జరిగేది వారి కలా? లేక నిజమా అనే భ్రాంతిలో ప్రేక్షకులు పడేలా ఉన్న స్క్రీన్ ప్లే మైనస్ అయ్యే అవకాశం ఉంది. అయితే రొమాన్స్ మాత్రం హీరో -హీరోయిన్స్ మధ్య బాగానే పండించారు. ఈ టైప్ సినిమాల్లో క్లైమాక్స్ ముందే ఊహకు అందేస్తుంది కాబట్టి క్లైమాక్స్ విషయంలో పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదు. కథ అంతా రెండు క్యారెక్టర్స్ మధ్యే సాగడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అలాగే చిన్న చిన్న కారణాలకు సైతం విడిపోతున్న కుర్ర జంటలను ఈ సినిమా ఆలోచనలో పడేసే అవకాశం ఉంది.

నటీనటుల విషయానికి వస్తే చైతన్య రావు ఈ సినిమాలో రెండు వేరియేషన్స్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ మధ్య గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటున్న హెబ్బా పటేల్ ఒక పక్క నటనతో మరోపక్క కనుల విందైన అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, సుహాసిని జంట కనిపించింది కాసేపే అయినా నవ్వించారు. ఈ సినిమా కథ మొత్తం ఈ నలుగురి మధ్యే సాగుతుంది, ఆ నలుగురూ మెప్పించారు. ఇక సినిమా చూస్తే కనుక మొత్తం సినిమాను తక్కువ లొకేషన్స్ లో షూట్ చేశారని అర్ధం అయిపోతుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనేలా ఉన్నా కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు మాత్రం వినడానికి మాత్రమే కాదు విజువల్ గా కూడా బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఓకే.

ఫైనల్లీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మెసేజ్ విత్ రొమాంటిక్ టచ్.. కానీ అందరికీ చేరుతుందా? అనేది చూడాలి.