NTV Telugu Site icon

రివ్యూ: చతుర్ ముఖం (మలయాళ డబ్బింగ్)

మల్లూవుడ్ లో సీనియర్ హీరోయిన్ మంజు వారియర్. ప్రముఖ నటుడు దిలీప్ ను పెళ్ళిచేసుకుని, 1998లో నటనకు దూరమైన మంజు వారియర్, అతని నుండి విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి ‘హౌ ఓల్డ్ ఆర్ యు’తో 2014లో రీఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ చిత్రం ‘లూసిఫర్’ మాతృకలో మంజు వారియర్ కీలక పాత్ర పోషించింది. అలానే ఇటీవల వచ్చిన వెంకటేశ్ ‘నారప్ప’ తమిళ మాతృక ‘అసురన్’లో ధనుష్ భార్యగా నటించి మెప్పించింది. ఆ మధ్య ఆహాలో వచ్చిన మమ్ముట్టి ‘ది ప్రీస్ట్’లోనూ మంజు వారియర్ కీలకపాత్ర పోషించింది. విశేషం ఏమంటే… మంజు వారియన్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన చిత్రం ‘చతుర్ ముఖం’. ఈ సినిమా ఈ యేడాది ఏప్రిల్ 8న కేరళలో విడుదలైంది. దురదృష్టం కొద్ది ఆ తర్వాత వారానికే కరోనా కేసులు పెరగడంతో అక్కడ థియేటర్లు మూసేశారు. మూడు నెలల తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమైన ఈ మలయాళ చిత్రాన్ని ‘చతుర్ ముఖం’ పేరుతోనే తాజాగా ఆహా సంస్థ తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. సౌత్ లో వచ్చిన ఫస్ట్ టెక్నో హారర్ మూవీగా దీన్ని నిర్మాతలు చెప్పుకుంటున్నారు. ఈ మూవీని రంజిత్ కమల శంకర్, సలీల్ మీనన్ డైరెక్ట్ చేశారు.

తేజస్విని (మంజు వారియర్) ఓ సాధారణ మధ్య తరగతి మహిళ. తల్లిదండ్రులు చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకోమని కోరినా, కాదని చెప్పి మిత్రుడు ఆంటోని ( సన్నీ వేన్)తో కలిసి సీసీటీవీ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభిస్తుంది. నిత్యం స్మార్ట్ ఫోన్ లోనే మునిగితేలే తేజస్విని ఫోన్ ఒకసారి ఓ ఊహించని సంఘటనతో ఊరిలోని చెరువులో పడిపోతుంది. దాంతో మరో స్మార్ట్ ఫోన్ కొనే డబ్బులులేక టెంపరరీగా ఓ లోకల్ కంపెనీ నుండి ఎసెంబుల్డ్ ఫోన్ ఒకటి ఆన్ లైన్ లో తెప్పించుకుంటుంది. అది ఆమె చేతిలోకి వచ్చిన దగ్గర నుండి ఊహించని అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఫోన్ లో ఏదో ఆత్మ ఉందనే భావన తేజస్వినికి కలుగుతుంది. తన బిజినెస్ పార్టనర్ ఆంటోనీతో కలిసి, సైన్స్ లో మంచి పరిజ్ఞానం ఉన్న క్లెమెంట్ ( అలెన్సియర్ లే లోపేజ్)ను కలిసి, ఈ మిస్టరీ ఛేదించమని కోరుతుంది. మానవాతీత శక్తులను విశ్వసించని క్లెమెంట్ ఆ ఫోన్ లోని రహస్యాన్ని ఎలా ఛేదించాడు? నిజంగానే తేజు అనుకుంటున్నట్టు అందులో ఏదైనా ఆత్మ ఉందా? అది అందులో ఎందుకు, ఎలా చేరింది? దాన్ని ఎలా బయటకు తీశారు? అనేది మిగతా కథ.

మూవీ పోస్టర్స్ లో పెట్టినట్టుగా ఇది నిజంగానే టెక్నో హారర్ ఫిల్మ్. మొదట కొంత సేపటి వరకూ థ్రిల్లర్ మూవీని తలపించేలా తీసినా, కథ ముందుకు సాగుతుంటే… అసలు విషయాలు ఒక్కొక్కటీ రివీల్ అవుతుంటాయి. సైన్స్ ను నమ్మే కొందరు… నాణానికి రెండో వైపు కూడా ఉందని విశ్వసిస్తారు. అలాంటి వారి వల్ల కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంటుంది. ఇందులో క్లెమెంట్ పాత్ర ద్వారా అదే చూపించారు. ఆత్మలను వదిలించుకోవడంలోనూ సైన్స్ ను ఉపయోగించడం ఇందులోని కొత్తదనం. అయితే… ఇలాంటి హారర్ మూవీస్ కు నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ ‘చతుర్ ముఖం’ ఏకంగా రెండు గంటల 13 నిమిషాల పాటు సాగుతుంది. అదే వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కథలో పెద్దంత కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు సైతం రొటీన్ గా ఉండటంతో చూసే వారికి బోర్ కొడుతుంది. ఫోన్ కారణంగా సంభవిస్తున్న సంఘటనలకు సరైన రీజన్ కూడా దర్శకులు చూపించలేకపోయారు! కొన్ని ఊహాజనితం అని కొట్టిపారేసినా, అత్యధిక రేడియేషన్ కారణంగా, నెగెటివ్ ఎనర్జీ జనరేట్ అవ్వడం వల్లే ఆ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పడం, అలా కొన్ని ఊహకందని, ఊహించని పరిణామాలను చూపించడం అసంబద్ధంగా ఉంది.

నటీనటుల్లో తేజస్వినిగా మంజు వారియర్, క్లెమెంట్ గా అలెన్సియర్ సహజంగా నటించారు. మిగిలిన పాత్రలను సన్ని వేన్, నిరంజన అనూప్, బాబు అన్నూర్, శ్యామ్ ప్రసాద్, రోనీ డేవిడ్, శ్రీకాంత్ మురళీ, షాజూ శ్రీధర్, కళాభవన్ ప్రజోద్ తదితరులు పోషించారు. అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ, డాన్ విన్సెంట్ సంగీతం మూవీకి హైలైట్. అయితే ఎడిటర్ మనోజ్ కొన్ని సన్నివేశాలను నిర్మొహమాటంగా తొలగించి ఉంటే, సినిమా వేగంగా సాగేది. ముఖ్యంగా ఊరిలో జాతర సన్నివేశాలను పరిహరించి ఉండాల్సింది. డాక్టర్ – తేజు మధ్య ఫోన్ కారణంగా ఏర్పడే కాన్ ఫ్లిక్ట్ కు రీజన్ కూడా దర్శకులు చూపించలేదు. ఇలాంటి లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి. అయితే సగటు ప్రేక్షకుడు హారర్ స్టోరీల నుండి థ్రిల్ ను ఆశిస్తాడు తప్పితే, లాజిక్స్ గురించి పట్టించుకోడు. బహుశా ఆ ధైర్యంతోనే దర్శక నిర్మాతలు కావలసినంత స్వేచ్ఛను తీసుకున్నారేమో! ఓవర్ ఆల్ గా హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడేవారి ‘చతుర్ ముఖం’ నచ్చే ఆస్కారం ఉంది. పైగా ఇది ఓటీటీలో ఉంది కాబట్టి… బోర్ కొట్టిన సందర్భాలలో రిమోట్ చేతిలోకి తీసుకుని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా… జరిగే నష్టం ఏమీ ఉండదు, టైమ్ సేవ్ కావడం తప్పితే.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల సహజ నటన
టెక్నో హారర్ మూవీ కావడం
సాంకేతిక నిపుణుల పనితనం

మైనెస్ పాయింట్
మూవీ రన్ టైమ్
ఆకట్టుకోని కథనం

ట్యాగ్ లైన్: స్మార్ట్ ఫోన్ లో ఆత్మ!

Show comments