NTV Telugu Site icon

రివ్యూ : ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’

Bhuj The Pride of India Movie Review

ఈ మధ్య కాలంలో వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ -పాక్ వార్ నేపథ్యంలో ‘ఘాజీ’ లాంటి పాన్ ఇండియా మూవీని తెలుగువాళ్ళు తీయడం విశేషం. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాల మధ్య 1971లో జరిగిన వార్ నేపథ్యంలో ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ రూపుదిద్దుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

సినిమా ప్రారంభంలోనే ‘భుజ్’ ఓ కల్పిత కథ అంటూ క్లారిటీ ఇచ్చేశారు ఫిల్మ్ మేకర్స్! అయితే, సినిమాకి ఆధారం మాత్రం నిజంగా జరిగిన చారిత్రక సంఘటనలే!! 1971 ఇండియా, పాకిస్తాన్ వార్ లో భాగంగా ‘భుజ్’ ప్రాంతంలోని ఒక ఎయిర్ బేస్ ను పాకిస్తానీలు ధ్వంసం చేస్తారు. అయితే, అక్కడ మన ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు దిగటానికి ఎయిర్ బేస్ పునర్ నిర్మాణం అవసరం అవుతుంది. అక్కడి స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ (అజయ్ దేవ్ గణ్)కు అధికారులు ఆ బాధ్యతను అప్పగిస్తారు. సమీపంలోని గ్రామ వాసులతో కలిసి ఆ ఎయిర్ బేస్ ను విజయ్ పునర్ నిర్మిస్తాడు. దాంతో మన విమానాలు భుజ్ లో లాండ్ అవుతాయి. పాక్ ను మనవాళ్ళు ఓడిస్తారు. ఈ ఘటనతో 1971 యుద్ధమే గొప్ప మలుపు తిరుగుతుంది. దాయాది దేశం ఓడిపోయి, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్భవిస్తుంది. ఈ యుద్థంలో అత్యంత కీలకమైన భుజ్ ఎయిర్ బేస్ పునర్ నిర్మాణంలో విజయ్ కార్నిక్ తో పాటు విక్రమ్ సింగ్ (అమ్రి వ్రిక్), ఆర్. కె. నాయర్ (శరద్ ఖేల్కర్), రంచోర్ దాస్ పాగి (సంజయ్ దత్), గుజరాతీ మహిళ సుందర్ బెన్ (సోనాక్షి సిన్హా) పాత్ర ఏమిటీ? అనేది ఈ చిత్ర కథ.

కథగా చెప్పుకుంటే ఎంతో స్కోప్ ఉన్న సినిమాని తెరపైకి ఎక్కించటంలో దర్శకుడు అభిషేక్ దుదియా విఫలమయ్యాడు. ఎక్కడా నటీనటుల నుండి సరైన నటన రాబట్టుకోలేకపోయాడు. టెక్నికల్ గా కూడా మూవీ గొప్పగా లేదు. ఎడిటింగ్ మరీ దారుణం. నిజానికి ఇలాంటి సినిమాలలో భావోద్వేగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని చోట్ల సంభాషణలు ఆకట్టుకున్నాయి తప్పితే సన్నివేశాలు ఉండాల్సింత ఎమోషనల్ గా లేవు. అజయ్, సోనాక్షినే కాక సంజయ్ దత్, నోరా ఫతేహి లాంటి వారు కూడా ‘భుజ్’ సినిమాని నిలబెట్టలేకపోయారు. ఈ మధ్యే విడుదలైన ‘హంగామా -2’లో నటించిన ప్రణీత సుభాష్‌ ఇందులో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. ఆమె బాలీవుడ్ లో చేసిన రెండు చిత్రాలూ ఓటీటీలో విడుదలై, పొందాల్సినంత ఆదరణను మాత్రం పొందలేకపోయాయి. నిజానికి ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నా, ఓటీటీలో విడుదల చేయడంతో వాటిలో కోత పెట్టారు. అసీమ్ బజాజ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. వార్ సీన్స్ ను బాగానే తెరకెక్కించారు. మూవీలో కాస్తంత ఆసక్తిని కలిగించే సన్నివేశం అంటే నోరా ఫతేహీ పాక్ అధికారిని చంపే దృశ్యమే! ఈ మూవీ ట్రైలర్ తో ఏర్పడిన భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కేవలం మరో వార్ డ్రామాగానే మిగిలిపోయింది. ఆ జోనర్ చిత్రాలను ఇష్టపడే వారు ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్:
వార్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం
పేరున్న నటీనటులు ఉండటం

మైనెస్ పాయింట్స్:
ఆసక్తి కలిగించని కథనం
ఉద్వేగం కలిగించని సన్నివేశాలు
టెక్నికల్ వాల్యూస్ పూర్ గా ఉండటం

ట్యాగ్ లైన్: బజ్జో పెట్టేసేంత బోర్!