కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘వలిమై’. గతంలో ఈ ఇద్దరితో హిందీ ‘పింక్’ను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసిన బోనీ కపూర్ ఇప్పుడీ సినిమా నిర్మించారు. తెలుగువాడైన కార్తికేయ విలన్ గా నటించడంతో మనవారికీ ఈ మూవీ మీద కాస్తంత ఆసక్తి పెరిగింది. అయితే… అజిత్, హెచ్. వినోద్, బోనీకపూర్ కాంబోలో వచ్చిన ఈ సెకండ్ మూవీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
విశాఖ నగరంలో ఓ బైక్స్ గ్యాంగ్ విపరీతంగా చైన్ స్నాచింగ్స్ చేస్తుంటుంది. అంతేకాదు… ఆ గ్యాంగ్ కు డ్రగ్స్ స్లపయ్ లోనూ ప్రమేయం ఉంటుంది. కుర్రాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకుని సైతాన్ స్లేవ్స్ లీడర్ (కార్తికేయ) ఈ వ్యవహారాన్ని నడుపుతుంటాడు. అతని ఆగడాలకు కొత్తగా ఆ ఊరు వచ్చిన ఏసీపీ అర్జున్ కుమార్ (అజిత్) ఎలా చెక్ చెప్పాడన్నదే ‘వలిమై’ కథ. నిజానికి ఇదో సింపుల్ స్టోరీ. దానికి మోతాదుకు మించిన యాక్షన్, సెంటిమెంట్ ను మిక్స్ చేసి ఏదో చేయబోయి, దర్శకుడు వినోద్ మరేదో చేశాడు.
నగరంలో జరిగే చైన్ స్నాచింగ్స్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారని పోలీసులపై ప్రజలు ఆగ్రహంతో ఉంటారు. అదే టైమ్ లో సిటీలోకి డ్రగ్స్ కూడా విపరీతంగా వస్తున్న విషయం పోలీసులకు తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే బాధ్యత ఏసీపీ అర్జున్ కు సిటీ కమీషనర్ అప్పగిస్తాడు. అతనికి సహాయంగా సోఫియా (హుమా ఖరేషీ) ఉంటుంది. వీరిద్దరూ సైతాన్ స్లేవ్స్ లీడర్ ఎవరనేది మొత్తానికి పసిగడతారు. అయితే అతను అప్పటికే అర్జున్ తమ్ముడిని తన ఆటలో పావుగా మార్చుకుంటాడు. ఓ పక్క తమ్ముడిని కాపాడుకోవాలనే కోరిక, మరో పక్క వృత్తిపరమైన బాధ్యత… ఈ వ్యవహారంలో అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తమ్ముడిని ప్రాణాలతో తీసుకొస్తానని తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? లేదా? ఏసీపీ నుండి ఇన్ స్పెక్టర్ గా డిమోషన్ అయినా అతను ఎలాంటి అంకిత భావంతో పనిచేశాడు? అనేది మిగతా కథ.
ఓ సూపర్ హీరోను తలపించేలా ఇందులో అజిత్ పాత్రను రూపొందించారు. అతని ఎంట్రీ సీన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ వెంటనే వచ్చే యాక్షన్ సీన్స్ మెప్పించినా, ఆ పైన వచ్చిన పాట, దానికి అజిత్ వేసిన స్టెప్పులూ వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. బాడీ సహకరించక పోయినా… ఏదో వేయాలి కాబట్టి స్టెప్పులు వేసినట్టు అర్థమైపోతోంది. ఓ యువకుడి ఆత్మహత్య నుండి అజిత్ కేసులోని చిక్కుముడులను ఒక్కొక్కటిగా క్షణాలలో విప్పుతుంటే.. ఇంత సలువుగానూ పనులు జరిగిపోతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది. విలన్ ను బైక్ మీద ఛేజ్ చేసే సన్నివేశాలు కాస్తంత ఉత్సుకతను కలిగిస్తాయి. అయితే ఆ తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్లే టైమ్ లో జరిగే ఛేజింగ్ సీన్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఎన్ని సినిమాలలో ఇలాంటి సీన్స్ చూడలేదు అనిపిస్తుంది. దానికి ముందు మదర్, బ్రదర్ సెంటిమెంట్ ను దర్శకుడు చొప్పించిన తీరుచూసి, యాక్షన్ మూవీ అని థియేటర్ కు వస్తే ఈ సెంటిమెంట్ సీన్స్ తో దర్శకుడు పులిహోర కలిపుతున్నాడేమిటనే సందేహం వస్తుంది. పోనీ ఆ సెంటిమెంట్ అయినా హృదయానికి హత్తుకునేలా ఉందా? అంటే అదీ లేదు! ‘ఎందుకురా… నువ్వు దారి తప్పావ్?’ అని తల్లి ప్రశ్నిస్తే… ‘నా చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు, ప్రతి ఒక్కరూ జాబ్ ఏం చేస్తున్నావ్? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్? అని అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్ లో ఈ దారి ఎంచుకున్నాను’ అని సమాధానం చెబుతాడు. ఇంతకంటే బలమైన రీజన్ ఏదీ దర్శకుడికి తట్టినట్టు లేదు పాపం. కొడుకు తప్పు చేసినా క్షమించమని కోరే తల్లి, వాడు తన కళ్ళకు కనిపిస్తే కానీ పచ్చి మంచినీళ్ళు తాగనంటూ ఆమె చేసే శపథం… ఇవన్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సన్నివేశాలే.
నటీనటుల విషయానికి వస్తే.. అజిత్ కు ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండే. అలానే చేశాడు. ఇక రేసర్ గా తనకు ఉన్న అనుభవాన్ని తెర మీద చూపించే ఆస్కారం ఈ సినిమాలో అతనికి కలిగింది. అయితే అందులో సగం క్రెడిట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ కు, వీఎఫ్ఎక్స్ బృందానికే చెందుతుంది. ‘కాలా’ సినిమాలో కీలక పాత్ర చేసిన హుమా ఖురేషీ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా లీడ్ క్యారెక్టర్ చేసి మెప్పించింది. కార్తికేయకు కోలీవుడ్ ఎంట్రీ ఇలాంటి ఓ స్టార్ హీరో మూవీతో కలగడం గొప్ప విషయమే. అతని పాత్రను బాగా ఎలివేట్ చేశారు. సీనియర్ నటీమణి సుమిత్ర తల్లి పాత్రను చేశారు. సుమిత్ర యంగ్ క్యారెక్టర్ ను ఆమె కుమార్తె ఉమాశంకరి చేయడం విశేషం. గతంలో ఉమ తెలుగులోనూ రెండు మూడు చిత్రాలలో నటించింది. ఇతర ప్రధాన పాత్రలను అచ్చుత్ కుమార్, రాజ్ అయ్యప్పన్, జి.కె. కుమార్ తో పాటు ఇద్దరు, ముగ్గురు తెలుగు వాళ్ళు పోషించారు. కానీ ఏం లాభం బలహీనమైన సన్నివేశాలు.. వీరందరి ప్రతిభను మసకబరిచాయి.
యువన్ శంకర్ రాజా స్వరపరిచిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఏమంత గొప్పగా లేవు. అయితే జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగానే ఉంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఓకే! ‘శతురంగ వేట్టై’, ‘ఖాకీ’ వంటి సినిమాలను తీసిన హెచ్. వినోద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడా అనే అనుమానం కలుగుతుంది. ‘నేర్కొండ పార్వై’ రీమేక్ కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూసుకుంటే… అజిత్ కు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఈ సినిమాకు తమిళనాట ఓపెనింగ్స్ రావొచ్చేమో కానీ మూవీ చూసిన ప్రేక్షకులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.
ప్లస్ పాయింట్స్:
ఆకట్టుకునే యాక్షన్ సీన్స్
జిబ్రాన్ నేపథ్య సంగీతం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ
మెప్పించని సెంటిమెంట్
మూవీ రన్ టైమ్
రేటింగ్: 2.25 / 5
ట్యాగ్ లైన్: సహనానికి పరీక్ష!