NTV Telugu Site icon

Clap Movie Review : సిన్సియర్ అటెమ్ట్!

Clap

ఈ మధ్యకాలంలో తెలుగులోనూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కోవకు చెందిందే ‘క్లాప్’. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘క్లాప్’ మూవీతో పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘గుడ్ లక్ సఖీ’ తర్వాత ఆది పినిశెట్టి నటించిన మరో క్రీడా నేపథ్య చిత్రమిది. జవ్వాజి రామాంజనేయులు, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చి 11 నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

విష్ణు (ఆది పినిశెట్టి)కు చిన్నప్పటి నుండి అథ్లెట్ కావాలని కోరిక. ఇండియా తరఫున నేషనల్స్ కు వెళ్ళాలనుకుంటాడు. అతని తండ్రి (ప్రకాశ్‌రాజ్) ప్రోత్సాహంతో నేషనల్స్ కు సెలెక్ట్ అవుతాడు. కానీ అదే సమయంలో జరిగిన యాక్సిడెంట్ లో అతని కాలు పోతుంది. తండ్రి చనిపోతాడు. దాంతో విష్ణు జీవితం తల్లకిందులవుతుంది. అయితే విష్ణును మొదటి నుండి ప్రేమిస్తూ వచ్చిన మరో క్రీడాకారిణి మిత్ర (ఆకాంక్ష సింగ్‌) అతను కాదన్నా పట్టుబట్టి పెళ్ళి చేసుకుంటుంది. ఆరేళ్ళుగా ఇద్దరూ ఒక ఇంటిలో ఉంటారు తప్పితే కలిసి కాపురం మాత్రం చేయరు. కాలు లేదనే మానసిక వ్యథ విష్ణును ప్రతి నిత్యం కృంగతీస్తూ ఉంటుంది. అలాంటి అతనికి ఖమ్మంలో భాగ్యలక్ష్మీ అనే ఓ మంచి అథ్లెట్ ఉందని, తండ్రి మరణంతో పరుగును మధ్యలో ఆపేసిందని తెలుస్తుంది. ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి మంచి కోచింగ్ ఇప్పించి, నేషనల్ ఛాంపియన్ చేయాలని విష్ణు భావిస్తాడు. కానీ ఆరేళ్ళ క్రితం విష్ణు జీవితాన్ని శాసించిన ఎస్.ఐ.ఎ. ప్రెసిడెంట్ వెంకట్రావ్ (నాజర్) ఇప్పుడు కూడా అతని ప్రయత్నాలకు అడ్డునిలుస్తాడు. ఆయన ఎత్తులు, జిత్తుల నుండి విష్ణు… భాగ్యలక్ష్మిని ఎలా కాపాడాడు? నేషనల్ అధ్లెట్ గా ఎలా నిలిపాడన్నదే మిగతా కథ.

‘క్లాప్’ పేరుతో రెండున్నర యేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఆది పినిశెట్టి నటించిన మరో క్రీడా చిత్రం ‘గుడ్ లక్ సఖీ’ ఈ లోగా విడుదలై పరాజయం పాలైంది. అందులో కీర్తి సురేశ్‌ ది కీలక పాత్ర కాగా, ఆది ఓ కీ-రోల్ పోషించాడు. కానీ ఇందులో అతనే హీరో. తప్పనిసరి పరిస్థితితో కోచ్ గా మారిన అధ్లెట్ గా నటించాడు. సినిమా ప్రారంభంలోనే ఆదికి యాక్సిడెంట్ జరుగుతుంది. నెక్ట్స్ సీన్ లో ఒంటి కాలుతో ఉన్న ఆదిని చూసి జనం షాక్ కు గురి అవుతారు. అయితే అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. భార్యతో ముభావంగా ఉండే ఆది, ఓ అమ్మాయిని పిక్ చేసి, అధ్లెట్ గా ఎలా మార్చాడనేది చాలా ఆసక్తికరంగా సాగింది. బట్… స్పోర్ట్ అధారిటీస్ లోని పాలిటిక్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా చాలా సినిమాలు వచ్చాయి. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే ఆటగాళ్ళు లేదా కోచ్ ల కథలతోనే అనేక సినిమా తెరకెక్కాయి. ఆ రెండు మూడు పాయింట్స్ ను దాటి మనవాళ్ళు కొత్త కథలను తయారు చేయడం లేదు. ఇది కూడా అదే తరహా కథ. ఎస్.ఐ.ఎ. ప్రెసిడెంట్ తన కొడుకు కోసం ఆరేళ్ళ క్రితం ఎలా తప్పుదారి పట్టాడు, ఇప్పుడు మరోసారి తన కూతురు కోసం తన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా. దాంతో హీరో చేసే పోరాటం కేవలం ఓ వ్యక్తి మీద, ఓ అసోసియేషన్ మీద అన్నట్టుగా అయిపోయింది. పట్టుదల ఉంటే అట్టడుగు వర్గానికి చెందిన మహిళ అయినా క్రీడా మైదానంలో విజయపతాకాన్ని ఎగరేయగలదు అనే ప్రధానాంశాన్ని మరింతగా స్పష్టంగా, గట్టిగా చెప్పి ఉండాల్సింది.

చాలా రోజుల తర్వాత ఆది పినిశెట్టికి మంచి పాత్ర లభించింది. అతని నటనలో మరో కోణాన్ని చూసే ఆస్కారం కలిగింది. స్టయిలిస్ట్ హీరోగానూ, విలన్ గానూ కాకుండా ఏ పాత్రకైనా తాను న్యాయం చేయగలనని మరోసారి ఆది నిరూపించుకున్నాడు. హాఫ్ లెగ్ తో ఆది కనిపించే సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. అలానే ప్రతి సన్నివేశంలోనూ ఆ పాత్ర తాలూకు పెయిన్ ను స్పష్టంగా ఆది ప్రెజెంట్ చేశాడు. మిత్రగా ఆకాంక్ష సింగ్ ఓకే. పరిమితిమేరకు చక్కగానే నటించింది. నిజానికి ఆమె పాత్రను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రధాన భూమిక పోషించింది కృష్ణ కురుప్! ఇదే ఆమె మొదటి తెలుగు సినిమా. యంగ్ అధ్లెట్ గా కళ్ళతోనే చక్కని అభినయాన్ని ప్రదర్శించి మెప్పించింది. ప్రతినాయకుడిగా నాజర్, ఆయన అడుగులకు మడుగులొత్తే వ్యక్తిగా బ్రహ్మాజీ, హీరో తండ్రి గా ప్రకాశ్‌ రాజ్ తో పాటు ఇతర ప్రధాన పాత్రలను ‘ముండాసుపట్టి’ రాందాసు, మైమ్ గోపీ పోషించారు. దర్శకుడు ఎక్కడా హంగు ఆర్భాటాలకు పోకుండా వీలైనంత సహజత్వంతో ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించాడు. సంభాషణలూ బాగున్నాయి. ‘చిన్న మాట పైకి రాదా ఎవరికోసం వారేనా…’ పాట అర్థవంతంగా ఉంది. ఇళయరాజా సంగీతం సినిమాకు హైలైట్. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా. క్రీడా నేపథ్య చిత్రాలను, మోటివేషనల్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘క్లాప్’ నచ్చుతుంది.

రేటింగ్ : 2.5/5

ప్లస్ పాయింట్స్
ఆది పినిశెట్టి నటన
ఇళయరాజా సంగీతం
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
ఎలివేట్ కాని సెంటిమెంట్ సీన్స్

ట్యాగ్ లైన్: సిన్సియర్ అటెమ్ట్!