ఇవాళ్టి రాజకీయం కేవల వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ఆరోపణలపైనే నడుస్తోంది. రాజకీయం చేయాలంటే… ప్రత్యర్ధి పార్టీలన్నీ ఆ పార్టీ నేతలను వ్యక్తిగతంగా ఆరోపిస్తేనే రాజకయాం చేసినట్టా? విధానాలపై మాట్లాడ్డం, అభివృద్ధిపై చర్చించడం, అవసరమైతే ఖండించడం పొలిటికల్ పాలసీలు, ఆర్ధిక విధానాలు ఇవేవీ పార్టీలకు, లీడర్లకు ప్రాధాన్యతాంశాలు కావు. కేవలం అవతలి పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టించాలి. కుటుంబాల్ని వీధికెక్కించి .. వాళ్లని అల్టరి చేయాలి. తద్వారా తాము రాజకీయ మనుగడ సాధించాలన్నదే ఇవాళ్టి రాజకీయ వ్యూహం. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
టీవీకే అద్యక్షుడు విజయ్ – నటి త్రిష వ్యవహారం అలాంటిదే . వాళ్లిద్దరు సహనటులు. ఇద్దరూ కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు. మంచి స్నేహితులు కూడా అయిండొచ్చు. కానీ.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. విజయ్ ని ఉద్దేశించి చేసిన అసభ్య ప్రేలాపన సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉంది. త్రిష బెడ్ రూమ్ లోంచి బయటకొచ్చి ప్రజల గురించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందన్న వ్యంగ్య ప్రేలాపన దిగజారిపోయిన రాజకీయాలకు మచ్చుతునక. ఆ తర్వాత ఈ కామెంట్ పై త్రిష అభ్యంతరం వ్యక్తం చేసి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగాక కానీ.. ఆ నేతకు కళ్లు తెరుచుకోలేదు. కానీ సారీ అనే చిన్న పదంతో అయిన డ్యామేజ్ పోతుందా అనేది కచ్చితంగా ఇలాంటి నేతలు ఆలోచించుకోవాలి.
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నాయకుల కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసి అసభ్యంగా, వికృతంగా ప్రచారం చేయడం అమానుషం. రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగానే ఎదుర్కొవాలి. వ్యక్తిగతంగా నిందలు మోపి రాజకీయం చేయాలనుకుంటే.. ప్రత్యర్థులు కూడా అలాగే తెగబడతారు. అప్పుడు ఇతరుల్ని తిట్టి సరదా తీర్చుకున్న నేతలే.. తర్వాత బాధపడాల్సి వస్తుంది. కానీ ఈ బూతు నేతలకు అలాంటి స్పృహ కూడా ఉండటం లేదు. మనల్ని తిడితే తర్వాత చూసుకుందాం.. ముందైతే వీలైనంత జుగుప్సాకరమైన భాషలో అవతలివారిపై నోరేసుకుని పడిపోదాం అనే బరితెగింపు ధోరణే రాజ్యమేలుతోంది.
ఉచితానుచితాలు మరిచిపోయారు. సిద్ధాంతాలు గాలికొదిలేశారు. బూతులు మాట్లాడటమే రాజకీయమని రెచ్చిపోతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు.. అదే ప్రజల పరువు తీస్తున్నారు. సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయాలు.. అదే సమాజం అసహ్యించుకునే స్థితికి చేరాయి. ఇందులో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. ఆ నేత.. ఈ నేత అనే భేదాల్లేవు. అందరూ ఆ తాను ముక్కలే.ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం.. రెండింటికీ సమాన ప్రాధాన్యత ఉంది. అధికారంలో ఉన్నంత మాత్రాన అధికార పక్షం ఎక్కువ కాదు. ప్రతిపక్షంలో ఉన్నంత మత్రాన ప్రతిపక్షం లోకువ కాదు. ఎప్పటికప్పుడు ఒకరిద్దరు నేతలు కట్టుదాటినా.. పార్టీల అధ్యక్షులు సరిచేయాల్సి ఉంటుంది. కానీ నేటి రాజకీయాల్లో ఏ నేతా బూతుల్ని దోషంగా ఎంచటం లేదు. ఎవరికి వారు.. నబూతో నభవిష్యత్ అనే ధోరణితో కనిపిస్తున్నారు. ఆ మాత్రం నోటి తీట లేకపోతే.. అవతలి పక్షం కంట్రోల్ కాదనే ఆలోచనతో ఉంటున్నారు. ఎక్కడైనా అడపాదడపా పాతతరం నేతలు అభ్యంతరం చెప్పినా.. మీకాలపు రాజకీయాలు ఇప్పుడు పనికిరావని చెప్పి వారి నోరు మూయిస్తున్నారు.
సమాజంలో రాజకీయ పార్టీలకు చాలా బాధ్యత ఉంది. భావి భారత భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పార్టీలే. ఇక చట్టసభల్లో ఉండే సభ్యులకైతే అంతకు మించిన బాధ్యత. జాతిని నడిపించే శాసనాలు, చట్టాలు చేయాల్సింది వాళ్లే. అలాంటి పవిత్ర బాధ్యతలో ఉన్నవాళ్లు.. ఉచితానుచితాలు వదిలేసి.. ప్రజలు ఏమనుకుంటారో అనే భావనే లేకుండా.. నోరు పారేసుకోవడం రాజకీయాల్లో పైత్యానికి పరాకాష్ట. ఓ నేత మరో నేతను తిడితే.. విషయం వారిద్దరికే పరిమితం కాదు. అది ఆయా పార్టీలకూ, అంతిమంగా రాజకీయాలకే చెడ్డపేరు వస్తోందని ఎవరూ గ్రహించడం లేదు. కొందరు గ్రహించినా.. లైట్ తీస్కుంటున్నారు.
సమాజంలో ఓ వ్యక్తి ఓ కుటుంబానికి బాధ్యత వహిస్తాడు. అదే విధంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు సమాజానికి, అంతిమంగా రాష్ట్రానికి బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధులు కచ్చితంగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఒకప్పుడు అలాగే ఉండేవాళ్లు. కానీ ఇటీవలి కాలంలో బజారు రౌడీలను మించిపోయే నేతలు తయారయ్యారు. అదేమంటే జనసామాన్యంలో వాడుకలో ఉన్న భాషే మాట్లాడుతున్నామని సమర్థించుకుంటున్నారు. మార్కెట్లో మాట్లాడే బూతులకు, అసెంబ్లీలో మాట్లాడే భాషకు తేడా ఉండొద్దా అంటే.. జనానికి అర్థం కానప్పుడు సంస్కారవంతంగా మాట్లాడి ఏం ఉపయోగం అని వెటకారాలు చేస్తున్నారు. ఇలాంటి నేతల్నా మనం ఎన్నుకుందని ప్రజలే తలకొట్టుకోవాల్సిన పరిస్థితి.
దేశంలో బంట్రోతు దగ్గర్నుంచి ఆఫీసర్ వరకు అన్ని ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ కావాలి. కానీ రాజకీయ నేత అవ్వడానికి ఎలాంటి అర్హతా అక్కర్లేదు. అంటే దేనికీ పనికిరానివాడు నేత కావచ్చనే అర్థం కాదు. ప్రజల్లోంచి ఎవరైనా నేతగా మారి.. తమ ప్రాంతాన్ని బాగుచేసుకోవచ్చనేది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. కానీ ఇప్పటి నేతల తీరు చూస్తే.. ఆ ఉద్దేశమే తప్పైపోయినట్టు కనిపిస్తోంది. ఎవరైనా నేత కావొచ్చు కదా అని.. బూతులు తిట్టేవాళ్లు.. బజారు భాష మాట్లాడేవాళ్లు.. సభ్యత, సంస్కారం లేనివాళ్లు కూడా నేతలైపోయి.. ప్రజాస్వామ్యంలో అధికారం చెలాయిస్తున్నారు. పైగా భాష అంటే ఇలాగే ఉండాలని ప్రజలకు కూడా బూతుల బోధ చేస్తున్నారు.
మనం సమాజంలో బతుకున్నాం. సమాజంలో కొన్ని కట్టుబాట్లున్నాయి. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నేతలు బాధ్యతగా ఉంటేనే.. సమాజం ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిదే నేతలే వీధిరౌడీలను మించిపోయి రోడ్డునపడి తిట్టుకుంటుంటే.. వాళ్లే శాంతిభద్రతల సమస్యకు భంగం కలిగేలా చేస్తుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. నోటికొచ్చిన బూతులు తిడితే పెద్ద నేతలైపోతారా. ఎక్కువ తిట్లు తిట్టినవారిని ప్రజలేమైనా ఆదరిస్తారనే గ్యారెంటీ ఉందా.. అలా ఏమీ లేదు. అయినా సరే నేతలకు బూతుల తీట మాత్రం తీరడం లేదు. బూతే మంత్రమూ అని పాటలు పాడుకుంటూ కనీస సభ్యత లేకుండా తిరిగేస్తున్నారు.
రాజకీయాలంటే ప్రజాసేవ అనే రోజులు పోయాయి. మీకు బూతులు మాట్లాడటం వచ్చా.. ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో స్పెషలైజేషన్ చేశారా..? చాలు అంతకుమించిన రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి అర్హతా అక్కర్లేదు. రాజకీయాల్లోకి రావాలంటే రౌడీలు, గూండాలు, రియల్ ఎస్టేట్ మాఫియా అనే అర్హతలుండాలని నేటి రాజకీయం నిరూపిస్తోంది. ఈ రాజకీయాన్ని చూసి.. చదువుకున్నవాళ్లు కూడా పాలిటిక్స్ అంటే భయపడుతున్నారు. అధినేతల చల్లని చూపు కోసం ఛోటామోటా నేతలు బరితెగిస్తున్నారు. ఎవర్నిఅయినా వ్యక్తిగతంగా విమర్శించడానికి, ఏ స్థాయి నేత కుటుంబాన్ని అయినా బజారుకు లాగడానికి ఉత్సాహ పడుతున్నారు. ఇక సోషల్ మీడియా ట్రోలింగుల సంగతి సరేసరి. గతంలో షర్మిల సోషల్ మీడియా ట్రోలింగుల గోల పడలేక.. సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అసలు ఇదేం సంస్కృతి..? ఇదేం రాజకీయం..? విధానాలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాల్సిన లీడర్లు.. కుటుంబాల్లోకి చొచ్చుకెళ్లిపోయి.. మహిళల్ని నడిరోడ్డుకి లాగుతున్నారంటే.. పైత్యం ఏ స్థాయిలో ప్రకోపిస్తోందో తెలుస్తోంది. అన్ని పార్టీలు సోషల్ మీడియా వింగుల్ని పెంచి పోషిస్తున్నాయి. దొంగ దారుల్లో డబ్బులిచ్చి.. ప్రత్యర్థులపై విష ప్రచారం చేయించడంలో అన్ని పార్టీలూ ఆరితేరాయి.
యువత రాజకీయాలవైపు రాకపోవడానికి ప్రధాన కారణం నేటి రాజకీయ సంస్కృతే అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లోకి వస్తే తమను వ్యక్తిగతంగా భ్రష్టుపట్టిస్తారని, కుటుంబాల్ని రోడ్డుకీడుస్తారని, అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి తమను తాము తక్కువ చేసుకోవాలన్న భావేనలో ఉన్నారు యువత. రాజకీయాలంటే బూతులు మాట్లాడేవారు, అసభ్య ప్రేలాపనలు, సోషల్ మీడియలో డామేజ్ చేసేవారికి మాత్రమే సంబంధించిన వ్యవహారంగా యువత భావిస్తోంది. రాజకీయాల్లోకొచ్చి స్థాయిలేనివారితో తిట్టించుకోవడం కంటే… వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవచ్చన్న ఉద్దేశంలో ఉన్నారు నేటి యువత. ఈ సంస్కృతికి అలవాటు పడిపోయిన రాజకీయనాయకుల పిల్లలు, వారసులు తప్ప…. తటస్థులు వచ్చి భ్రష్టు పట్టిపోవాలని అనుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత నిందలే.
రాజకీయాలు అంటరానివని, అనవసరమని యువత ఫీలౌతున్నారు. నెలకు ఓ లక్ష రూపాయలు జీతం, చిన్న కారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు. అదే జీవితం అనుకుంటున్నారు. అంతకు మించి ఆలోచించటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో రాజకీయాలు వంశపారంపర్యం అయిపోయాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో యూత్ ను వెతుక్కోవాల్సిందే కానీ.. సాధారణ యువత మాత్రం రాజకీయాలంటే అదో డర్టీ ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. రాజకీయాల్లో ఎదుగదల ఉన్నా.. లేకున్నా.. బూతులు తిట్టించుకోక తప్పదనే నిర్ధారణకు వచ్చిన యువత.. పాలిటిక్స్ అంటేనే మాకొద్దు బాబోయ్ అంటున్నారు.
రాజకీయాలపై నేటి యువతలో సదభిప్రాయం లేదనే అంశంలో రెండో మాటకు తావు లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆ పోకడ 2,3 దశాబ్దాలు కొనసాగింది. దీంతో అప్పుడెప్పుడూ రాజకీయాల్లో యువత లేరనే భావనే కలగలేదు. కానీ సరళీకరణల తర్వాత రాజకీయాల్లో యువత ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. నేతల గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితిలో ఉన్న యువత.. నాయకత్వ స్థానాలకు మాత్రం ఎదగలేకపోతోంది. రాజకీయాలపై అనాసక్తే దీనికి ప్రధాన కారణం. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్లు, రౌడీలు, కబ్జాకోరులే రాజకీయం చేయగలరనే భావన యువతను ముందే కట్టడి చేస్తోంది. ఇప్పటికీ యువత రిస్క్ చేస్తే రాజకీయాల్లో ఓ స్థాయి వరకూ ఎదగొచ్చు. కానీ అంతకుమించి ఎదగటం సాధ్యం కాదు. ఎందుకంటే నేతలు అలా ఎదగనివ్వరు. ఇతర రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితులుండగా.. రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి పరిస్థితులతో రాజీపడాల్సిన కర్మేంటని యువతరం ప్రశ్నించుకుంటోంది. దీంతో రాజకీయాలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది.
యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. రాజకీయాలు బాగా ఖరీదుగా మారిపోయాయి. ఎవరి సహకారం లేకుండా ఎదగలేమనే అభిప్రాయం ఉంది. రాజకీయం ఒక ఆటవిక కార్యక్రమం అయిపోయింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ జీతం తెచ్చుకునే ఉద్యోగులను మాత్రమే తయారు చేస్తోంది. రాజకీయాలంటే సమాజంలో గౌరవం లేకుండా పోవడంతో.. యువత విముఖత పెంచుకుంటున్నారు. పాలిటిక్స్ లో ఎదగటానికి తక్కువ అవకాశం ఉంటుందనే భావన కూడా బలంగా పాతుకుపోయింది. మంచి వ్యక్తిత్వం ఉన్న తెలివైన యువకులలో చాలామంది రాజకీయాలు తమకు సరిపోవని భావిస్తారు. ఉద్యోగం సంపాదించడం , మంచి ఆదాయంతో తమ భవిష్యత్తును నిర్ధారించుకోవడం వారి ప్రధాన లక్ష్యం. దీనికి తోడు మన పార్టీలు, నేతలు కూడా యువతను ఓటుబ్యాంకుగానే చూస్తున్నారు తప్ప.. వారికి రాజకీయాల్లో రెడ్ కార్పెట్ వేద్దామనే ఆలోచన చేయడం లేదు. ఓటర్లుగానే అంచనాలకు అందని విధంగా ఆలోచించే యువత నిజంగా రాజకీయాల్ని సీరియస్ ప్రొఫెషన్‌గా తీసుకుంటే.. తమ పప్పులు ఉడకబోవనే భయం కూడా నయా నేతలకు ఉందనడంలో సందేహం లేదు. అందుకే రాజకీయాన్ని అంటరానిదిగా మార్చేస్తే.. తరతరాల పాటు తామే అధికారం అనుభవించొచ్చనే దురాలోచనతో నేతలు బరితెగిస్తున్నారు. ఈ కారణంగానే రాజకీయాల్లోకి ఉన్న విష సంస్కృతులు చాలవన్నట్టుగా.. ఎప్పటికప్పుడు సరికొత్త చెడు పోకడలకు ఆహ్వానం పలుకుతున్నారు.
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయాలు.. నేతల పుణ్యమా అని భ్రష్టుపట్టిపోతున్నాయి. రాజకీయమంటే సిద్ధాంతాల మధ్య వైరుధ్యం ఉండాలి. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షం ఎండగట్టాలి. ప్రతిపక్షంలో లోపాలుంటే అధికార పక్షం ఎత్తిచూపాలి. అంతవరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. అంతే కానీ సీఎంను వ్యక్తిగతంగా దూషించడం, ప్రతిపక్ష నేతను నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం.. రాజకీయం ఎలా అవుతుందో నేటి నేతలే చెప్పాలి. సమాజంలో రెగ్యులర్ గా బూతులు తిట్టుకునేవాళ్లు కూడా.. నేతల భాష వినలేకపోతున్న దుస్థితి నెలకొంది.
సమాజానికి దారిచూపేవాడు నాయకుడు. అంధకారంలో ఉన్న సమాజాన్ని మేల్కొలిపేవాడు నాయకుడు. చీకట్లో మగ్గిపోతున్న ప్రజలకు వెలుగుచూపే వాడు నాయకుడు. ఇలా నాయకుడు అనే పదానికి ఎన్నో ఉదాత్తమైన నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఈరోజుల్లో నాయకుడంటే అర్థాలే వేరు. బూతులు మాట్లాడేవాడే నాయకుడు. తిట్ల పురాణం లంకించుకునేవాడే నాయకుడు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడితేనే నాయకుడు. ఇలా తయారైంది నేటి రాజకీయం. కాదు కాదు పార్టీలే అలా తయారుచేశాయి. ఓ నేత నోరు జారితే.. వెంటనే పార్టీ రియాక్టైతే.. మరో నేత అలాంటి మాటలు మాట్లాడటానికి ఆలోచిస్తాడు. కానీ నోరుజారిన నేతను కట్టడి చేయకపోగా.. అలాంటి నేతలకు మద్దతుగా పార్టీలు నిలబడటమే.. రాజకీయాన్ని బజార్నపడేస్తోంది.
రాజకీయమైనా, యుద్ధమైనా, పోరాటమైనా రెండు రకాలుగా చేయొచ్చు. తమ బలాన్ని పదర్శించి, తమకు ఉన్న మంచి ఆలోచనలు ప్రజలకు చెప్పి.. తమ అధినేతల ప్రత్యేకతలేంటో వివరించే పద్ధతి.. ఎప్పుడూ ఉత్తమం. కానీ ఆ రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లింది. ఒకప్పుడు కేవలం సిద్ధాంతాల ప్రాతిపదికనే రాజకీయాలు నడిచేవి. తరచుగా అఖిలపక్ష సమావేశాలు జరిగేవి. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా.. తమ పదవి బాధ్యత అనుకునేవాళ్లు. అంతే కానీ తామేదో రాజులమని ఫీలయ్యేవాళ్లు కాదు. ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడానికి, వారిచ్చిన సూచనలు అమలుచేయడానికి చిన్నతనంగా భావించేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అధికారం అంటే ఏదో సామ్రాజ్యాన్ని ప్రజలు ధారాదత్తం చేసినట్టు ఫీలైపోతున్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టమని అడగడమే పాపమైపోతోంది. ప్రతిపక్షాలకు ఏమీ తెలియదు.. అంతా మాకే తెలుసు అన్నట్టుగా ఫీలైపోతున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా అలాగే ఉన్నాయి. అధికార పక్షం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. మంచి పనిని కూడా మంచి అని చెప్పడానికి మనసు రావడం లేదు. పైగా నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. ఇలా రాజకీయాలు విద్వేషపూరితంగా తయారయ్యాయి. దీంతో నాయకుల మధ్య ఒకప్పుడు ఉన్న సుహృద్భావ సంబంధాలు మట్టిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి వచ్చేసింది. చేతిలో కత్తి లేదు కానీ.. ఉంటే ఖండఖండాలుగా నరికేస్తాం అనే నేతలు తయారయ్యారు. అలాంటి వారికే పార్టీలు ఊతమిస్తున్నాయి. అందలం ఎక్కిస్తున్నాయి. ఎలాంటి అర్హత లేకపోయినా.. బూతులే అర్హతగా పదవులు అందుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి నేతల్ని చూసి, కార్యకర్తలు కూడా ఎదగడానికి బూతుల్ని మించిన అడ్డదారి లేదు అనుకుంటే.. రాజకీయాలు మరింతగా దిగజారిపోతాయి. ఈ రాజకీయ రొచ్చు చూసిన యువత.. పాలిటిక్స్‌లో ఎంట్రీ గురించిన ఆలోచన తర్వాత. కనీసం ఓటేయటానికి కూడా సుముఖత చూపించటం లేదు.
ఒక నాయకుడు మరో నాయకుడ్ని వ్యక్తిగతంగా నిందిస్తే.. ఆ మాట పడ్డవాడు మాత్రం ఊరుకుంటాడా . వాడు కూడా అదను చూసుకుని ప్రత్యర్థిపై వ్యక్తిగత నిందనే వేస్తాడు. ఈ కనీస జ్ఞానం లేనివారే.. రాజకీయాల కోసం ప్రత్యర్థులపై వ్యక్తిగత నిందులు, ఆరోపణలతో దాడులు చేస్తున్నారు. అందుకే జనం రాజకీయాల్ని అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అనేది ఒక చిల్లర వ్యవహారంగా చూస్తున్నాడు. రాజకీయం చేడయం కన్నా ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడం…సొసైటీలో గౌరవం ఇస్తుందని భావిస్తున్నారు. కొంతమంది న్యాయకులు…. వ్యక్తిగత నిందలపైనే రాజకీయం చేస్తున్నారు. రాజకీయ అంటే కుటుంబాల్ని రోడ్లపైకి లాగాలి… నిందించాలేమో అనుకుంటున్నారు. ఈ వికృతాలన్నీ రాజకీయాలనుంచి పోనంత వరకు తటస్థ యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టదు.. ప్రజల్లో ఆ అపొహా పోదు.
ప్రజలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేది సమస్యల పరిష్కారం కోసం. అంతేకానీ బూతులు మాట్లాడటానికి కాదు. ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు. అసలు విషయాన్ని వదిలేసి.. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలు తవ్వితీయడం, వారి వ్యక్తిగత అలవాట్లపై నోరు పారేసుకోవడం నయా రాజకీయంగా మారింది. వ్యక్తిగత జీవితం వేరు.. రాజకీయం వేరు అనే విభజన రేఖ కూడా చెరిపేస్తున్నారు నేతలు. కొందరు నేతలైతే.. కేవలం ప్రత్యర్థుల్ని తిట్టడంతో ఆగడం లేదు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా బజారుకి లాగుతున్నారు. కుటుంబాలు, వంశాల్ని కూడా చేర్చి మరీ బూతులు తిడుతున్నారు. చనిపోయిన నేతల్ని కూడా ఈ రొంపి లోకి లాగుతున్నారు. ఎలాంటి వాడైనా చనిపోయాక చెడు మాట్లాడకూడదనే సంస్కృతిని కూడా గాలికొదిలేశారు. సందర్భం రావాల్సిన పనేం లేదు. ఎవరేమనుకుంటారనే లెక్కేం లేదు. నోటికొచ్చిన తిట్లు తిట్టడం, తర్వాత గట్టిగా సమర్థించుకోవడంలో నేతలు ఆరితేరిపోయారు.
ఎక్కడైనా ప్రజలు అదుపుతప్పితే.. నాయకుడు అదుపులో పెట్టాలి. కానీ ఇప్పుడు నేతలే అదుపుతప్పుతున్నారు. వీరిని ఎలా అదుపులో పెట్టాలో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. ఎన్నికల సమయంలో నేతలు మాట్లాడే భాషకు, గెలిచాక మాట్లాడుతున్న భాషకు.. నక్కకూ, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నికలప్పుడు వంగి వంగి ఓటర్లకు దండాలు పెట్టి.. అత్యంత గౌరవంగా సంబోధించినవాళ్లే.. ఎన్నికలు పూర్తవగానే.. నోటికొచ్చిన బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. అసలు తమ నేతకు ఇన్ని బూతులొచ్చా అని ఓటర్లు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి.
సమాజంలో ఏ హోదాలో ఉన్న వ్యక్తి అయినా.. సమయం, సందర్భాన్ని బట్టి మాట్లాడే భాష మారుతుంది. ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు మాట్లాడే భాష వేరు. పెద్దవాళ్ల ముందు వ్యక్తీకరించే భాష వేరు. చిన్నపిల్లల దగ్గర వాడే భాష వేరు. బంధుమిత్రుల దగ్గర, ఫంక్షన్లలో ఉపయోగించే మాటతీరు వేరు. ఓ బహిరంగ సభలో వాడే భాష వేరు. ఓ వ్యక్తే సందర్భాన్ని బట్టి ఇన్నిరకాలుగా భాష ఉపయోగిస్తుంటే.. వ్యక్తుల సమూహానికి ప్రతినిధులైన నేతలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా బహిరంగ సభల్లోనే ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా బూతులు తిడుతున్నారు. నాలుగు ఈలల కోసం పాకులాడుతున్నారే కానీ.. ఎంతమంది తమ భాష కారణంగా పాడైపోతున్నారనే సంగతి గుర్తించడం లేదు.
మనం సమాజంలో బతుకున్నాం. సమాజంలో కొన్ని కట్టుబాట్లున్నాయి. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నేతలు బాధ్యతగా ఉంటేనే.. సమాజం ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిదే నేతలే వీధిరౌడీలను మించిపోయి రోడ్డునపడి తిట్టుకుంటుంటే.. వాళ్లే శాంతిభద్రతల సమస్యకు భంగం కలిగేలా చేస్తుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. నోటికొచ్చిన బూతులు తిడితే పెద్ద నేతలైపోతారా. ఎక్కువ తిట్లు తిట్టినవారిని ప్రజలేమైనా ఆదరిస్తారనే గ్యారెంటీ ఉందా.. అలా ఏమీ లేదు. అయినా సరే నేతలకు బూతుల తీట మాత్రం తీరడం లేదు. బూతే మంత్రమూ అని పాటలు పాడుకుంటూ కనీస సభ్యత లేకుండా తిరిగేస్తున్నారు.
ప్రజలకు తామేం చేస్తామో చెప్పి అధికారంలోకి రావాలి కానీ.. ప్రత్యర్థుల్ని బూతులు తిడితే అధికారం వస్తుందనుకోవడం ఏంటో అర్థం కాదు. నేతలు మాట్లాడే భాష వారి స్థాయిని మరింతగా దిగజారేలా చేస్తోంది. ఒక్కోసారి నేతలు మాట్లాడే భాష చూసి.. కార్యకర్తలు కూడా సిగ్గుపడే పరిస్థితి. నేతల భాష ఈ స్థాయిలో ఉందేంటని ప్రజలు అడిగితే.. వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కసార నేతల భాష బూతు స్థాయిని కూడా మించిపోయి.. అందరూ చెవులు మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఏకంగా చట్టసభల్లో ప్రసంగాల్ని కూడా వినలేని పరిస్థితి ఉందంటే.. నేతలు రాజకీయాల్ని ఏ స్థాయికి దిగజార్చారో తెలుస్తోంది.
ప్రజాభిమానానికి కూడా ఇప్పటి నేతలు కొత్త అర్థం చెబుతున్నారు. నాలుగు మంచి పనులు చేస్తే మంచి పేరొస్తుందనుకునే రోజులు పోయాయి. నాలుగు ఘాటైన బూతులు వదిలితే.. ఇన్ స్టంట్ ఫేమ్ వచ్చేస్తుందనే సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నారు. అది నిజం కాదని తెలిసినా.. అదే భ్రాంతిలో బతికేస్తున్నారు. ఎవరికి వారూ బూతు ప్రపంచంలో తలమునకలైపోతున్నారు. బూతు లేకుండా మాటలే రాని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఏ అంశం ఎత్తుకున్నా.. కొద్ది క్షణాల్లోనే బూతుపురాణంలోకి జారిపోతున్నారు. ఎవరేమనుకున్నా.. మాకేం పోతుందనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బాధ్యతగా మసలుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. నేటి నేతలు వెలగబెడుతున్న పైత్యం.. మొత్తం రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్టగా నిలుస్తోంది.
లేస్తే ఆదర్శాలు మాట్లాడతారు. నీతిసూక్తులు వల్లిస్తారు. మమ్మల్ని మించిన సహనశీలురు లేరంటారు. కానీ నోరు తెరిస్తే మాత్రం ఎక్కడ బీప్ వేయాలో కూడా అర్థం కాని స్థాయిలో బూతులతో చెలరేగుతున్నారు నేతలు. సమాజంలో మెజార్టీ ప్రజల కంటే అన్నిరకాలుగా మంచి జీవితం గడుపుతున్న నేతలు.. ప్రతి చిన్న విషయానికీ సహనం కోల్పోయి.. అసహన రాజకీయానికి తెరతీస్తున్నారు. ఎక్కడో ఒకచోట మొదలైన బూతు సిరీస్ ను అన్ని పార్టీల నేతలూ కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామంటూనే.. అంతకుమించిన బూతులతో.. చెలరేగిపోతున్నారు. యాక్షన్ ను బట్టే రియాక్షన్ ఉంటుందని న్యూటన్ సిద్ధాంతానికే కొత్త భాష్యం చెబుతున్నారు.
ఎవరికైనా భాషే సమాజంలో మర్యాద ఇచ్చేలా చేస్తోంది. ఈ విషయం రాజకీయ నేతలకు ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. ఇలాంటి దిగజారుడు భాష మాట్లాడి.. ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో కూడా నేతలు ఆలోచించడం లేదు. పబ్లిగ్గా ప్రజల ముందే ఏది పడితే అది మాట్లాడటం, ఎవరేమన్నా నోరేసుకుని పడిపోవడమే రాజకీయమని కొత్త కల్చర్ తీసుకొచ్చారు. తెలుగు కల్చర్ ఇలాగే ఉంటుందా అని ఇతర రాష్ట్రాల వాళ్లు కథలు కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన రాజకీయం జరగడం లేదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడటం ఏంటనే కనీస స్పృహ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు.
రాజకీయంలో చర్చోపచర్చలు ఉండాల్సిందే. వాదోపవాదాలు జరగాల్సిందే. అంతేకానీ బూతుపురాణం ఉండాలని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కానీ నేటి నేతలు రాజకీయాలంటేనే ఛీ.. పాడు అనుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే యువత రాజకీయాల్లోకి రావాలంటే విముఖత చూపుతోంది. ఇక ఈ స్థాయిలో నేతల బూతులు చూస్తే.. మరింత దూరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు రాజకీయాలంటే గౌరవప్రదమైన ప్రొఫెషన్ అని సమాజానికి చాటాల్సిన బాధ్యత నేతలదే. అలాంటి నేతలే రోడ్డునపడ్డి తిట్టుకుంటుంటే.. కనీస సోయి లేకుండా బూతులు మాట్లాడుతుంటే.. కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే భాష ఫాలో అయిపోతే.. సమాజం ఏమైపోతుందని ఎవ్వరూ ఆలోచించడం లేదు.
వ్యక్తిని శక్తిగా మార్చే సత్తా రాజకీయానికి ఉంది. లక్షలాది మంది ప్రజల్ని కదిలించే సత్తా రాజకీయానికి ఉంది. వ్యవస్థను సమూలంగా మార్చే అవకాశం రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే ఉంది. నేతలు ప్రజల్లోంచి వస్తారనే ఉద్దేశంతో.. ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కూడా అత్యున్నతమైన అధికారాలు ఇచ్చింది. ఇదంతా రాజకీయం అత్యంత బాధ్యత చేయాలనే సందేశం ఇచ్చినట్టే. కానీ మన నేతలు మాత్రం మన రాజ్యాంగాన్నే కాదు.. తమను ఎన్నుకున్న ప్రజల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రజలు ఏమైపోయినా పర్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతిమంగా రాజకీయ నేతలుగా ప్రజలకు అందుబాటులో ఉండకపోగా.. మొత్తంగా రాజకీయాన్నే సామాన్యులకు దూరం చేసేసి.. అదేదో అంటరానిదనే ముద్ర వేయటంలో నేటి నేతలు కృతకృత్యులయ్యారని చెప్పటానికి సందేహించాల్సిన పనేం లేదు. ఇదీ ఈవారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.
