US Credit Card Debt: బిల్లులు ఎగ్గొడుతున్న అమెరికన్లు.. పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం!

Us Credit Card Debt

Us Credit Card Debt

US Credit Card Debt: ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు వింత పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ ఖర్చులకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేసిన అక్కడి ప్రజలు.. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. కొనుగోళ్ల జోరుతో మొదలైన ‘స్వైపింగ్ కల్చర్’ చివరకు తీవ్రమైన చెల్లింపుల ఎగవేతలకు దారితీస్తోంది. గడువు ముగిసినా నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు అప్పుల ఊబిలోకి జారుకుంటోందని తాజాగా విడుదలైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో అమెరికన్లు భారీగా ఫెయిల్ అవుతున్నారు. న్యూయార్క్ ఫెడ్ తాజా నివేదిక ప్రకారం.. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఏకంగా 10.3 శాతం కార్డు బకాయిలు 90 రోజులకు పైగా పెండింగ్‌లో పడిపోయాయి. ధనిక ప్రాంతాలతో పోలిస్తే పేద ప్రాంతాల్లో బిల్లుల డిఫాల్ట్ రేటు రెండింతలకు పైగా పెరగడం గమనార్హం. బిల్లులు కట్టకపోవడంతో అపరాధ రుసుములు, అధిక వడ్డీలు తోడై ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. మరోవైపు యువత కూడా ఈ ఎగవేత జాబితాలో ముందుంటోంది. 30 ఏళ్ల లోపు వయసున్న యువతలోనే క్రెడిట్ కార్డు బిల్లులు 90 రోజులకు పైగా చెల్లించకుండా డిఫాల్ట్ అవుతున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సగటున ఒక్కో కార్డుదారుడిపై సుమారు 6,678 డాలర్ల (దాదాపు రూ.6.28 లక్షలు) బకాయి పేరుకుపోవడంతో, కెరీర్‌ స్టార్టింగ్‌లోనే యువత అప్పుల వలలో చిక్కుకుంటోంది.

ప్రజల ఎగవేత ధోరణి, పెరిగిన జీవన వ్యయాల ఫలితంగా అమెరికాలో మొత్తం క్రెడిట్ కార్డుల బకాయిలు ఆల్-టైమ్ రికార్డు స్థాయి అయిన 1.29 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.121.3 లక్షల కోట్లు) చేరాయి. ఒక్క మూడో త్రైమాసికంలోనే ఈ బకాయిలు 22 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇక క్రెడిట్ కార్డులతో పాటు హోమ్ లోన్లు, కార్ లోన్లు, విద్యార్థుల రుణాలన్నీ కలిపితే అమెరికన్ కుటుంబాల మొత్తం అప్పు రికార్డు స్థాయిలో 19.1 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,795.4 లక్షల కోట్లు) చేరింది. కరోనా మహమ్మారి కంటే ముందున్న స్థాయితో పోలిస్తే ఇది ఏకంగా 5 ట్రిలియన్ డాలర్లు ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కార్డులతో విలాసాలు చేసిన జనం.. ఇప్పుడు నెలవారీ వడ్డీలు కూడా కట్టలేక దివాళా తీసే దుస్థితికి చేరుకుంటున్నారు.