Site icon NTV Telugu

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ భారీ ఆశలు.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిసిందే. ఈ ఉత్కంఠ బరిత సన్నివేశం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశంపై సైతం చర్చలు జరుగుతున్నాయి. 2025లో భారత్ రియల్ ఎస్టేట్ రంగం మరింత బలంగా ముందుకు సాగింది. దేశ ఆర్థిక వృద్ధికి ఇది ఒక కీలక స్థంభంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఈ రంగంలో పారదర్శకత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. పనులు వేగంగా పూర్తయ్యే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు డిజిటల్ కావడం, నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం రావడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి ఒకే డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయడం, నిబంధనలను సులభం చేయడం వంటి చర్యలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయని నొక్కి చెప్పారు. ఆలస్యాలు తగ్గాయని.. బాధ్యతలు పెరిగాయంటున్నారు. పెద్ద సంస్థలు సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెబుతున్నారు.

READ MORE: Gold & Silver Prices: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే..

గతి శక్తి పథకం, జాతీయ లాజిస్టిక్స్ విధానం, డేటా సెంటర్లకు ఇచ్చిన ప్రోత్సాహకాలు వంటి విధానాలు సంప్రదాయేతర రియల్ ఎస్టేట్ విభాగాల ఎదుగుదలకు తోడ్పడ్డాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం దేశ జీడీపీలో సుమారు 8 శాతం వాటా కలిగి ఉంది. 2047 నాటికి, “వికసిత భారత్” లక్ష్యానికి అనుగుణంగా ఈ వాటా 15 నుంచి 16 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయాణంలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల విషయంలో ప్రభుత్వం నుంచి మరింత మద్దతు అవసరమని పరిశ్రమ భావిస్తోంది. ఇప్పుడు రాబోయే బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందరికీ ఇల్లు అనే ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తక్కువ ధరల ఇళ్ల గృహాల కోసం మళ్లీ పన్ను మినహాయింపులు తీసుకురావాలని కోరుతోంది. అయితే ఈసారి ఇంటి ధర ఆధారంగా కాకుండా, ఇంటి పరిమాణాన్ని బట్టి చౌక గృహంగా గుర్తించాలని సూచిస్తోంది.

READ MORE: Gold & Silver Prices: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే..

ఇంటి రుణంపై ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల వడ్డీ మినహాయింపును కనీసం రూ.5 లక్షలకు పెంచాలని, కొత్త పన్ను విధానంలో కూడా ఇంటి ఆస్తి నష్టాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని పరిశ్రమ కోరుతోంది. అలాగే 2022లో ముగిసిన అదనపు వడ్డీ మినహాయింపును కొన్ని రకాల ఇళ్లకు మళ్లీ తీసుకురావాలని అభిప్రాయపడుతోంది. భూమి యజమానులు, నిర్మాణదారుల మధ్య జరిగే సంయుక్త అభివృద్ధి ఒప్పందాల్లో పన్ను ఎప్పుడు చెల్లించాలి అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలకు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ, కార్పొరేట్ భూమి యజమానులకు ఏ విధంగా పన్ను విధించాలి అనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముందే పన్ను కట్టాలా, నిర్మాణం పూర్తయిన తర్వాత కట్టాలా అనే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని రంగం కోరుతోంది.

READ MORE: Ajit pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన అమిత్ షా, రాష్ట్ర మంత్రులు

షేర్ల విలువ లెక్కించేటప్పుడు భూమి విలువను స్టాంప్ డ్యూటీ ధరతో పోల్చే నిబంధన ఉంది. అయితే ఇది లీజ్ హక్కులు లేదా అభివృద్ధి హక్కులకు వర్తించాలా వద్దా అనే విషయంలో స్పష్టత లేదు. ఇవి పూర్తిగా భూమి యాజమాన్యానికి భిన్నమైనవి కాబట్టి, ఈ నిబంధన వర్తించదని స్పష్టంగా చెప్పాలని పరిశ్రమ అభ్యర్థిస్తోంది. పర్యాటకం దేశవ్యాప్తంగా ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, హోటళ్లు, టూరిజం ప్రాజెక్టులలో పెట్టుబడులకు ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలని సూచిస్తోంది. అలాగే 2022లో ముగిసిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను పీఎంఏవై అర్బన్ 2.0లో మళ్లీ తీసుకువచ్చినా, పాత స్కీమ్‌తో పోలిస్తే ఇది అంతగా ఉపయోగకరంగా లేదని అభిప్రాయం. మరింత సబ్సిడీ ఇవ్వడం, పరిమితులు పెంచడం ద్వారా తక్కువ ఆదాయం, మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లు కొనుగోలు చేయడానికి లేదా ఇళ్లను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ చెబుతోంది.

READ MORE: Arijit Singh : ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అర్జిత్..!

అద్దె గృహాల రంగాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడి విభాగంగా గుర్తించి, పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతోంది. దీని వల్ల తక్కువ ఖర్చుతో ఇళ్ల అద్దెలు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ రేట్లు తగ్గించడం మంచి నిర్ణయమే అయినా, ఇంకా కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని రియల్ ఎస్టేట్ రంగం అంటోంది. ముఖ్యంగా అద్దెకు ఇచ్చే వాణిజ్య భవనాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభించకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, పెద్ద ఆఫీస్ ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతోంది. ఇది విదేశీ పెట్టుబడిదారుల నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతోంది. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో వాణిజ్య భవనాలను అద్దెకు ఇచ్చినప్పుడు ఐటీసీకి అనుమతి ఉంది. భారత్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే పన్నుల్లో సమానత్వం వస్తుందని పరిశ్రమ అభిప్రాయం వ్యక్త మవుతోంది. అవసరమైతే ఐటీసీని నాలుగు లేదా ఐదు సంవత్సరాల్లో విడతలుగా ఇవ్వవచ్చని, భవనం అమ్మినప్పుడు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానం పెట్టవచ్చని సూచిస్తోంది.

Exit mobile version