ఇప్పటికే పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్ వినియోగదారులపైనా భారం పడనుంది. డిసెంబర్ 1 నుంచి డీటీహెచ్ ఛార్జీలు పెరగనున్నాయి. జీ, స్టార్, సోనీ, వయాకామ్ 18 వంటి పలు సంస్థలు కొన్ని పాపులర్ టీవీ ఛానళ్లను డిసెంబర్ 1 నుంచి తమ బొక్వెట్ నుంచి తొలగించనున్నాయి. దీంతో ఆయా ఛానళ్లను వీక్షించాలంటే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
బొక్వెట్‌లో అందించే ఛానళ్ల ఛార్జీలు సగటున నెలకు రూ.15 నుంచి రూ.25 వరకు ఉంటాయని తెలుస్తోంది. అయితే నెట్‌వర్క్ కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో టీవీ ప్రేక్షకులు 30 నుంచి 50 శాతం వరకు అదనంగా చెల్లింపులు చేయాలి. 2020లో ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త టారిఫ్ ఆర్డర్‌తో వినియోగదారులు తమకు నచ్చిన ఛానళ్లకే డబ్బులు చెల్లించి చూడవచ్చు. అయితే ఇందులో కనీస ఛార్జీ రూ.12గా ఉండటంతో తమపై ప్రతికూల ప్రభావం పడుతోందని నెట్‌వర్క్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.