125 డాలర్ల నుంచి 101 డాలర్లకు దిగొచ్చిన బ్యారెల్ క్రూడాయిల్ ధర
క్రూడాయిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. మార్చి నెలలో 125 డాలర్లు పలికిన ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఇప్పుడు 101 డాలర్లకు పడిపోయింది. ఈ పరిణామం అందరికీ ప్రయోజనకరమని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణానికి బదులు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టేందుకు దోహపడుతుంది. ప్రజల జీవన వ్యయం తగ్గుతుంది. కంపెనీలపై ప్రాథమిక ఆర్థిక ఒత్తిళ్లు తొలిగిపోతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నిండుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటికే నిఫ్టీ 8 శాతానికి పైగా ఎగబాకింది.
ఈ నెలలోనే ఆకాశ ఎయిర్ లైన్స్ సేవల ప్రారంభానికి ముమ్మర ప్రయత్నాలు
ఈ నెలలోనే ఆకాశ ఎయిర్ లైన్స్ సేవలను ప్రారంభించేందుకు సంస్థ యజమాని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎయిర్ లైన్స్ ఇప్పటికే డీజీసీఏ నుంచి ఈ మేరకు అనుమతి పొందింది. వచ్చే ఐదేళ్లలో 72 విమానాలు కొనేందుకు ఆర్డర్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే.
వివో-ఇండియా రూ.62,476 కోట్ల మోసాన్ని గుర్తించిన ఈడీ
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో-ఇండియా 62 వేల 4 వందల 76 కోట్ల రూపాయలను స్వదేశానికి పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఇండియాలో ట్యాక్సులు కట్టకుండా తప్పించుకోవటంతోపాటు నష్టాలొచ్చినట్లుగా చూపటం కోసమే ఈ పని చేసిందని చెప్పింది. టర్నోవర్‌లో 50 శాతాన్ని చైనాకు తరలించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 119 బ్యాంకుల్లో ఆ సంస్థకు చెందిన 4 వందల 65 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు వెల్లడించింది.
చమురు సంస్థలకు రూ.44,000 కోట్లు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చమురు సంస్థలకు కేంద్రం 44 వేల కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఎల్‌పీజీ సబ్సిడీల వల్ల నమోదవుతున్న నష్టాలకు పరిహారంగా ఈ నిధులు కేటాయించనుంది. ఇంటి అవసరాల కోసం వాడుకునే వంట గ్యాస్‌ను ఆయా సంస్థలు మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే ఇస్తుండటంతో నష్టాలు వస్తున్నాయి.
బ్రిటన్ సంస్థ నుంచి 250 మిలియన్ డాలర్లు సమీకరించనున్న మహింద్రా ఈవీ
మహింద్రా విద్యుత్ వాహనాల విభాగం 2 వందల 50 మిలియన్ డాలర్లను సమీకరించనుంది. కంపెనీ మార్కెట్ విలువను 9 పాయింట్ 1 బిలియన్ డాలర్లు పెంచటం ద్వారా ఈ నిధులను రాబట్టుకోనుంది. బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అనే సంస్థ నుంచి ఫండ్స్ సేకరించనుంది. ఈ నేపథ్యంలో మహింద్రా కంపెనీ షేర్ల విలువ ఇవాళ రికార్డు స్థాయిలో 5 పాయింట్ 4 శాతం పెరగటం విశేషం.
ఇండియా లోకల్ ఫండింగ్ పైనే ఎంజీ మోటర్స్ ఫోకస్
ఎంజీ మోటర్స్ సంస్థ ఇండియాలో అనుసరిస్తున్న విస్తరణ ప్రణాళికలను మార్చేసింది. ఇక మీదట లోకల్‌గానే ఫండింగ్ చేసుకోవటంపై ఫోకస్ పెట్టనుంది. స్థానిక పెట్టుబడిదారుల వద్దే 300 నుంచి 600 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించటం కోసం చర్చలు జరుపుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) కోసం ఈ సంస్థ చేసిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉండటంతో ఎంజీ మోటర్స్ కొత్త వ్యూహం పన్నింది. ఎంజీ మోటర్స్‌కి మాతృ సంస్థ చైనాలోని గ్రేట్ వాల్ మోటర్ గ్రూప్ అనే సంగతి తెలిసిందే.
ఫిజిక్స్‌వాలా అరుదైన ఘనత
ఎడ్యుకేషన్ టెక్నాలజీ యూనికార్న్ అయిన ఫిజిక్స్‌వాలా అరుదైన ఘనత సాధించింది. లాభాల్లో నిలిచిన తొలి ఎడ్‌టెక్ స్టార్టప్‌గా గుర్తింపు పొందింది. మన దేశంలో ఈ ఫీట్‌ను సొంతం చేసుకున్న మొదటి సంస్థగా నిలిచింది. ఫిజిక్స్‌వాలా తాజాగా 100 మిలియన్ డాలర్లను సమీకరించింది. వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్‌వీ వెంచర్స్ నుంచి ఈ ఫండ్స్‌ను పొందింది. మార్కెట్ విలువను 1.1 బిలియన్ డాలర్లకు పెంచటం ద్వారా ఫిజిక్స్‌వాలా అదనపు పెట్టుబడిని రాబట్టుకోగలిగింది. ఈ నిధులను తక్షణమే సద్వినియోగం చేసుకోనుంది. వ్యాపార విస్తరణ, బ్రాండింగ్, మరిన్ని లెర్నింగ్ సెంటర్ల ఏర్పాటుకు కేటాయించనుంది.
వేదాంత చేతికి ఛత్తీస్‌గఢ్ పవర్ ప్లాంట్
మైనింగ్‌లో దిగ్గజ సంస్థ వేదాంత.. ఛత్తీస్‌గఢ్ పవర్ ప్లాంట్‌ను కొనుగోలుచేయనుంది. అథెనా ఛత్తీస్‌గఢ్ పవర్ లిమిటెడ్ అనే సంస్థను రూ.564 కోట్లు చెల్లించి సొంతం చేసుకోనుంది. ఈ పవర్ ప్లాంట్ సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇది ప్రస్తుతం దివాళా ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. అథెనా లిక్విడేషన్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇప్పటికే అనుమతించింది. ఈ కొనుగోలు ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తికానుందని వేదాంత వర్గాలు వెల్లడించాయి.