Site icon NTV Telugu

Zoho CEO : ‘ఆ కాల్ కలవరపరిచింది’… విదేశీ డిగ్రీలపై శ్రీధర్ వెంబు హెచ్చరిక..!

Zoho Ceo Sridhar Vembu

Zoho Ceo Sridhar Vembu

చాలా మంది విద్యార్థుల కలల దేశం అమెరికా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే చాలా మంది విద్యార్థులకు అసలైన విషయం బోధపడి.. కలల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి పరిస్థితులను అర్థంచేసుకోడానికి సమయం తీసుకుందామనుకునే సరికి చేసిన అప్పులకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అలాంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక విజ్ఞప్తి చేశారు.

విదేశీ డిగ్రీల కోసం రుణాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక సూచన చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో అమెరికాలో అవస్థలు పడుతున్న ఓ భారతీయ ఐటీ విద్యార్థి పరిస్థితిని తెలియజేశారు. ‘ఇటీవల ఓ విద్యార్థి నాకు కాల్ చేసి అమెరికాలో చదువుల కోసం 12 శాతం వడ్డీకి సుమారు రూ.70 లక్షలు రుణం తీసుకున్నట్లు చెప్పారు. ఆ విద్యార్థి అక్కడో చిన్న కాలేజీలో మాస్టర్ డిగ్రీ చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడ విదేశీ విద్యార్థులకు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఆ రుణానికి ఈఎంఐ కూడా స్టార్ట్ కానుందని చెప్పిన ఆ ఫోన్ కాల్ తనను కలవరపరిచిందని తెలిపారు. ఈక్రమంలో ఆయన అగ్రరాజ్య కలల కోసం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ డిగ్రీల కోసం భారీగా రుణాలు తీసుకునే అంశంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువభారతాన్ని చదువుల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చూడాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత ఏఐ యుగంలో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియడం కష్టమన్నారు. ఆయన పోస్ట్‌ను పలువురు సమర్థించారు. కలలను సాకారం చేసుకోడానికి అగ్రరాజ్యానికి అప్పులు చేసి మరి వెళ్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒకసారి కౌన్సిలింగ్ నిర్వహించాలని పలువురు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

Exit mobile version