స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ సీఈఓ పదవికి అమితేశ్ కుమార్ ఝా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మింత్రా మాజీ సీఈఓ నందితా సిన్హాను నూతన అధిపతిగా స్విగ్గీ నియమించింది. ఆగస్టు 3 నుండి ఆమె ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. భారతదేశంలో క్విక్ కామర్స్ రంగంలో బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ వంటి సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న కీలక సమయంలో ఈ నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 14 ఏళ్లపాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన అమితేశ్ కుమార్ ఝా, 2024 సెప్టెంబర్‌లో స్విగ్గీలో చేరారు. ఇన్‌స్టామార్ట్ వ్యాపారాన్ని వేగంగా విస్తరించడానికి ఆయనను తీసుకొచ్చినప్పటికీ, తక్కువ సమయంలోనే ఆయన తప్పుకోవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఇన్‌స్టామార్ట్‌లో పలువురు ఉన్నతాధికారులు నిష్క్రమించారు. సంస్థ సీఓఓ అంకిత్ జైన్, సీబీఓ హరి కుమార్ కూడా ఇటీవల రాజీనామా చేయడంతో నాయకత్వ స్థాయిలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి.
నూతన సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న నందితా సిన్హాకు ఈ-కామర్స్ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో మింత్రా సీఈఓగా వ్యవహరించిన ఆమె, ఫ్లిప్‌కార్ట్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి ప్రముఖ సంస్థలలో కూడా పనిచేశారు. డిజిటల్ రిటైల్, వినియోగదారుల ప్రవర్తనపై ఆమెకున్న లోతైన అవగాహన ఇన్‌స్టామార్ట్ వ్యూహాలకు తీవ్ర పోటీలో కొత్త దిశను చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
స్విగ్గీ తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి కొద్ది రోజుల ముందు ఈ మార్పు జరిగింది. డార్క్ స్టోర్ల విస్తరణ, వేగవంతమైన డెలివరీలు, మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం ద్వారా పోటీ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తుండటంతో ఇన్‌స్టామార్ట్‌పై పనితీరు పెంచుకోవాలని తీవ్ర ఒత్తిడి ఉంది. దాదాపు 11.5 బిలియన్ డాలర్ల విలువైన భారత క్విక్ కామర్స్ మార్కెట్‌లో ఇన్‌స్టామార్ట్‌ను ముందంజలో నిలపడం, ఇతర పోటీ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడమే నందితా సిన్హా ముందున్న ప్రధాన సవాలు. అయితే నేడు స్వీగ్గీ షేర్లు 5 శాతం వరకు పెరగడం గమనార్హం.

