Smartphone Prices Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్‌లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..

Smartphone Prices

Smartphone Prices

Smartphone Prices Hike: దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు రోజురోజుకి పెరిగిపోతుండటం అటు యూజర్స్‌కు, ఇటు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాబోయే దసరా, దీపావళి వంటి పండగ సీజన్లలో (జులై నుంచి డిసెంబర్ మధ్య) సగానికి పైగా ప్రజలు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనను వాయిదా వేసుకునే ప్రమాదం ఉందని ఓ తాజా నివేదిక హెచ్చరించింది. మరికొందరు కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్ (పాత) ఫోన్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రముఖ టెక్ ప్లాట్‌ఫారమ్స్ ‘ట్రాకిన్ టెక్’, ‘టెక్ ఆర్క్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

54 శాతం మంది డిమాండ్‌కు బ్రేక్
ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారిలో దాదాపు 54 శాతం మంది డిమాండ్ ప్రమాదంలో పడింది. పెరిగిన ధరల వల్ల సుమారు 48 శాతం మంది కస్టమర్లు ధరలు తగ్గే వరకు వేచి చూడాలని భావిస్తుండగా.. మరో 6 శాతం మంది మాత్రం కంపెనీలు రీపేర్ చేసినవి లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ధరల భారం ఇలాగే కొనసాగితే, ఈ ఏడాది భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండవని ఈ నివేదిక అంచనా వేసింది. సాధారణంగా మార్కెట్లో 13.6 కోట్ల నుంచి 13.8 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరగాల్సి ఉండగా.. అది కాస్తా 11.5 కోట్ల నుంచి 12 కోట్ల యూనిట్లకు పడిపోయే ప్రమాదం ఉంది. కొత్త ఫోన్ల అమ్మకాలు తగ్గితే ఆ ప్రభావం సెకండ్ హ్యాండ్, రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై సానుకూలంగా పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది పాత ఫోన్ల మార్కెట్ 2.3 కోట్ల యూనిట్ల నుంచి ఏకంగా 3 కోట్ల నుంచి 3.2 కోట్ల యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

×
×
Ad

అసలు ఫోన్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి
జనవరి 2025 నుంచి మే 2026 మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ పలు మోడళ్ల ధరలను భారీగా పెంచాయి. దీనికి ప్రధాన కారణాలు ఫోన్ స్టోరేజ్, మెమొరీకి అత్యంత కీలకమైన ‘NAND Flash’, ‘DRAM’ మెమొరీ చిప్స్ ధరలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగడం అని చెబుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపెనీల నుంచి ఈ మెమొరీ చిప్స్‌కు డిమాండ్ పెరగడంతో వీటి ధరలు ఆకాశాన్నంటాయి. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం, కంపెనీలు లాభాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని వివరిస్తున్నారు.

రూ.20 వేల లోపు ఫోన్లపైనే ఎక్కువ దెబ్బ
ఈ ధరల పెరుగుదల ప్రభావం మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే రూ.20,000 లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపైనే తీవ్రంగా పడింది. ఈ సెగ్మెంట్‌లో ఫోన్ల ధరలు సగటున 8% నుంచి 12% వరకు పెరిగాయి. ఈ సందర్భంగా ట్రాకిన్ టెక్ ఫౌండర్ అరుణ్ ప్రభుదేసాయి మాట్లాడుతూ.. భారతీయ కస్టమర్లు ఎల్లప్పుడూ మెరుగైన ఫీచర్లు ఉన్న ఫోన్లను కోరుకుంటారు, కానీ బడ్జెట్ దాటి పెట్టడానికి ఇష్టపడరు. కంపెనీలు ధరలను అదుపులో ఉంచకపోతే, కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం లేదా పాత ఫోన్ల వైపు వెళ్లడం ఖాయం అని వివరించారు.