భారత ప్రభుత్వం జూలై 1, 2026 నుండి ప్రారంభమయ్యే త్రైమాసికానికి గాను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా ఈ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు) వర్తించే వడ్డీ రేట్లు, అంతకుముందు త్రైమాసికంలో ఉన్న రేట్ల ప్రకారమే కొనసాగుతాయి. ప్రభుత్వం చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కొన్ని పథకాల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.
వివిధ పథకాల ప్రస్తుత వడ్డీ రేట్ల వివరాలిలా..
ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ ప్రజాదరణ పొందిన సుకున్య సమృద్ధి పథకంలో డిపాజిట్లపై అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకంపై వడ్డీ రేటు 7.7 శాతంగానే స్థిరంగా ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఈ పథకంలో పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద నెలవారీ ఆదాయాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు ఈ రెండో త్రైమాసికంలో కూడా 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఉద్యోగులు, సాధారణ పెట్టుబడిదారులకు ఎంతో ఉపయోగపడే పీపీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటు 7.1 శాతంగానే కొనసాగుతుంది. మూడేళ్ల కాలపరిమితి గల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండగా.. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటు 4 శాతంగానే ఉంచబడింది.
ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా నిర్వహించబడే ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల, మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సురక్షితమైన రాబడిని ఆశించే మధ్యతరగతి ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది.

