Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?

Sabir Bhatia

Sabir Bhatia

Sabir Bhatia: భారత్‌లో సొంతిల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల. మనకు ఇష్టమైన ఇంటి నిర్మాణం వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఆందోళనలతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం ఉంటుంది. నిర్మాణంలో జాప్యాలు, చట్టపరమైన వివాదాలు, అనుమతుల్లో ఆలస్యం వల్ల ఎంతో మంది కొనుగోలుదారులు తమ కలల గృహాల కోసం ఏళ్లకు ఏళ్లు నిరీక్షిస్తూనే ఉంటారు ఉన్నారు కూడా. ఈ క్రమంలో హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు, భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త సబీర్ భాటియా పంచుకున్న అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బాధితుల ఆవేదనకు అద్దం పడుతోంది. భారత్‌కు వచ్చినప్పుడు బస చేయడానికి ఓ విలాసవంతమైన నివాసం ఉండాలనే ఆశతో సబీర్ భాటియా 2012లో ఒక అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్టు అనేక వివాదాలు, నాటకీయ పరిణామాల నడుమ చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆయనకు ఆ అపార్ట్‌మెంట్ హక్కులు 2032లో లభిస్తాయని తెలిసింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. “యువకుడిగా ఉన్నప్పుడు సొంత దేశంలో ఒక అందమైన ఇల్లు ఉండాలని బుక్ చేసుకున్నాను, కానీ చేతికి తాళాలు వచ్చేసరికి నాకు వృద్ధాప్యం వచ్చేలా ఉంది. ఏకంగా 20 ఏళ్ల పాటు వేచి చూడటం నిజంగా అర్థరహితం కాదా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారి, వేలాది మంది భావోద్వేగాలను తట్టిలేపింది.

భాటియా ఆవేదనపై స్పందించిన నెటిజన్లు భారత్‌లో రియల్ ఎస్టేట్ వ్యవస్థలోని చేదు నిజాలను ఎత్తిచూపారు. కనీసం భాటియాకు 2032 నాటికైనా ఇల్లు వస్తుందనే స్పష్టత ఉందంటే ఆయన అదృష్టవంతుడేనని, దేశంలో లక్షలాది మంది సామాన్యులు తమ జీవితకాల సంపాదనను నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో పెట్టి, అసలు ఇల్లు వస్తుందో లేదో తెలియక నిరంతరం నరకం అనుభవిస్తున్నారని చాలామంది వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి సృష్టిస్తున్న ఆర్థిక భారం, మానసిక వేదన తలచుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఒకవైపు ఇల్లు ఇంకా పూర్తికాకపోయినా ప్రతి నెల ఈఎమ్‌ఐలు (EMIs) చెల్లిస్తూ, మరోవైపు ఉండటానికి అద్దె ఇళ్లకు డబ్బులు కడుతూ సామాన్యులు నలిగిపోతున్నారు. 2014లో అఫోర్డబుల్ హౌసింగ్ కింద ఫ్లాట్ బుక్ చేసుకుంటే, బిల్డర్ రూపాయి పని కూడా చేయకుండా వివాదాల్లోకి నెట్టేశాడని, ఇప్పుడు బాధితులే కోర్టు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఓ నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కారు. మరికొందరైతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నమ్మి అసలు డబ్బులు పెట్టకూడదని, పూర్తయిన వాటిలోనూ ఒకే ఫ్లాట్‌ను ఇద్దరికి అమ్మడం, లీజు భూముల వివాదాలు వంటి మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిల్డర్లపై కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగానికి ఇంకా బలమైన సంస్కరణలు, డెవలపర్లలో జవాబుదారీతనం, వేగవంతమైన న్యాయ పరిష్కారాలు అత్యవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఓ ప్రముఖ శతకోటీశ్వరుడికే 20 ఏళ్ల నిరీక్షణ తప్పనప్పుడు, సామాన్య హోమ్‌బయ్యర్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.