వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్ స్టాక్ మారెట్లపై పడింది.. సెన్సెక్స్ భారీగా కుప్పకూలింది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. ఇక, భారత స్టాక్ మార్కెట్లపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా పడింది.. దీంతో, ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఇక, రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది.
కరోనా విజృంభణ కారణంగా చాలా కాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు ఉన్నట్టుండి పెంచేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక, ఆర్బీఐ వడ్డీరేట్లు ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లోకి వెళ్లాయి.. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఆఫ్-సైకిల్ సమావేశంలో చర్చించిన తర్వాత పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మరియు వృద్ధికి మద్దతు ఇవ్వడానికి పాలసీ రేట్లను పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఆర్బీఐ గవర్నర్.. రేట్లు పెరిగినప్పటికీ, ఆర్బీఐ తన అనుకూల వైఖరిని కొనసాగిస్తుందని మరియు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇక, పెంచిన పాలసీ రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. పర్యవసానంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటు 4.15 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు మరియు బ్యాంక్ రేటు 4.65 శాతానికి సర్దుబాటు చేయబడుతుంది.. వృద్ధికి మద్దతు ఇస్తూనే, ద్రవ్యోల్బణం లక్ష్యంలోపే ఉండేలా చూసేందుకు, వసతిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తూనే, ఎంపీసీ అనుకూలతను కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో.. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.