Bank Licence Cancelled: ఆ బ్యాంక్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?

Rbi New Rules 2026

Rbi New Rules 2026

మహారాష్ట్రకు చెందిన ‘ది యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ బ్యాంక్ నడపడానికి తగినంత మూలధనం (డబ్బు) లేదని, అలాగే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకింగ్ నిబంధనలను ఈ బ్యాంక్ సరిగ్గా పాటించలేకపోయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులందరికీ పూర్తి డబ్బులు తిరిగి ఇచ్చే శక్తి ఈ బ్యాంక్‌కు లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బ్యాంకును ఇంకా కొనసాగించడం వల్ల ప్రజల సొమ్ముకే ప్రమాదమని భావించిన ఆర్‌బీఐ.. మే 19, 2026 (మంగళవారం) సాయంత్రం నుంచి బ్యాంక్ వ్యాపార లావాదేవీలను పూర్తిగా నిలిపివేసింది.

ఖాతాదారుల డబ్బు పరిస్థితి ఏమిటి?
బ్యాంక్ మూతపడినప్పటికీ ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నియమం ప్రకారం.. ప్రతి ఖాతాదారునికి వారి డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు బీమా (ఇన్సూరెన్స్) లభిస్తుంది. ఈ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దాదాపు 99.02 శాతం మంది ఖాతాదారులకు వారి పూర్తి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 20, 2026 నాటికే బీమా సంస్థ (DICGC) ఖాతాదారులకు రూ. 106.96 కోట్లను చెల్లించింది. మిగిలిన వారికి కూడా నిబంధనల ప్రకారం డబ్బు అందుతుంది.

బ్యాంకును పూర్తిగా మూసివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మహారాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్‌ను ఆర్‌బీఐ కోరింది. ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లను తీసుకోలేదు.. అలాగే ఎవరికీ డబ్బులు చెల్లించలేదు.