Site icon NTV Telugu

Ratan Tata Dreams: రతన్ టాటా నెరవేరని కలల గురించి తెలుసా!

Ratan Tata

Ratan Tata

Ratan Tata Dreams: భారతీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి, అభివృద్ధి యుగానికి నాంది పలికిన సమయంలోనే, 1991లో జెఆర్‌డి టాటా నుంచి రతన్ టాటా గ్రూప్ నాయకత్వాన్ని చేపట్టారు. అపర కుబేరుడైన ఆయనకు కూడా కొన్ని నెరవేరని కలలు ఉన్నాయంటే నమ్ముతారా. ఆయనను చాలా దగ్గరి నుంచి గమనించిన అతి కొద్దిమంది మాత్రం కచ్చితంగా నమ్మాల్సిందే అంటున్నారు. ఆయన తన కలలను పూర్తిగా సాకారం చేసుకోకుండానే గత ఏడాది 86 ఏళ్ల వయసులో మరణించారు. నేడు అక్టోబర్ 9 ఆయన మొదటి వర్ధంతి. ఇంతకీ రతన్ టాటా నెరవేరని కలలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు

భారత సరిహద్దులు దాటి విస్తరించిన కంపెనీ..
రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ భారత సరిహద్దులను దాటి తన పరిధిని విస్తరించింది. 2000 సంవత్సరంలో బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని $432 మిలియన్లకు, 2007లో ఆంగ్లో-డచ్ స్టీల్ తయారీదారు కోరస్‌ను $13 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఒక భారతీయ కంపెనీ విదేశీ సంస్థను కొనుగోలు చేసిన ఘనత సాధించిన అతిపెద్ద సంస్థ టాటా కంపెనీ మాత్రమే. 2008లో టాటా మోటార్స్ బ్రిటిష్ లగ్జరీ ఆటో బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లను ఫోర్డ్ మోటార్ కంపెనీ నుంచి $2.3 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇంత గొప్ప విజయాలను టాటా గ్రూప్ సాధించడానికి కారణం రతన్ టాటా.. కానీ ఆయనకు ఐదు నెరవేరని కలలు ఉన్నాయి. అవి ఏంటంటే..

చెదిరిపోయిన నానో కల
ప్రతి భారతీయ కుటుంబం సొంత కారు కలిగి ఉండాలనే రతన్ టాటా కల. ఆయన ఈ కలను నిజం చేయడానికి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు టాటా నానోను ప్రారంభించారు. అయితే మార్కెట్ సవాళ్లు, ఊహించిన దానికంటే తక్కువ అమ్మకాల కారణంగా రతన్ టాటా ఈ కల పూర్తిగా సాకారం కాలేదు. తన కల పూర్తిగా నిజంగా కాకపోవడంతో రతన్ టాటా ఎల్లప్పుడూ చింతించే వారని ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్న వారు పేర్కొన్నారు. టాటా మోటార్స్ ఇండికా, నానోను “ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు”గా ప్రచారం చేసింది. అయితే ఇండికా వాణిజ్యపరంగా విజయవంతమైంది. అయితే నానో మాత్రం ప్రారంభంలో భద్రతా సమస్యలు, మార్కెటింగ్ తప్పిదాల కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. దీంతో ఒక దశాబ్దం తర్వాత ఈ నానో కారుల ఉత్పత్తిని టాటా మోటార్స్ సంస్థ నిలిపివేసింది.

వ్యక్తిగత జీవితంలో ఒంటరితనం..
రతన్ టాటా తన జీవితాన్ని బ్రహ్మచారిగా గడిపారు. వ్యాపారంలో, దాతృత్వంలో విజయవంతమైన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. ఒంటరిగా ఉండటం, కుటుంబం లేకపోవడం గురించి ఆయన ఒకసారి సిమి గ్రెవాల్‌తో జరిగిన టాక్ షోలో స్పందించారు. ఎవరూ లేకపోవడం తనను ఒంటరితనానికి గురిచేస్తుందని ఆయన ఈ టాక్ షోలో అంగీకరించారు. “కొన్నిసార్లు నాకు భార్య లేదా కుటుంబం లేదని అనిపిస్తుంది, కొన్నిసార్లు నేను ఒకరి కోసం ఆరాటపడతాను” అని ఆయన చెప్పాడు. ఇతరుల భావాలను పట్టించుకోకపోవడం వల్ల కలిగే స్వేచ్ఛను తాను ఆస్వాదించినప్పటికీ, కొన్నిసార్లు ఒంటరితనం అధికంగా అనిపించిందని ఆయన చెప్పారు. ఒంటరిగా ఉండాలనే తన నిర్ణయం గురించి సిమి ఆయనను అడిగినప్పుడు.. “చాలా విషయాలు నన్ను వివాహం చేసుకోకుండా అడ్డుకున్నాయి. నేను చాలాసార్లు పెళ్లి చేసుకునే స్టేజ్ వరకు కూడా వచ్చాను, కానీ అవి ఫలించలేదు” అని రతన్ టాటా పేర్కొన్నారు.

తనకు నచ్చిన వృత్తిని ఎంచుకోలేకపోయిన రతన్ టాటా..
రతన్ టాటాకు తన జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటే ఆయన వేరే వృత్తిని ఎంచుకునేవాడని చెప్పారు. ఒక వీడియో ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ.. 1959లో కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి తను ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పొందానని, అది తనకు ఇష్టమైన వృత్తి అని అన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన రెండు ఏళ్లు ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు. కానీ తన తండ్రి రతన్ టాటాను ఇంజినీర్ కావాలని కోరుకున్నారు. దీంతో ఆయన ఇంజినీర్ కావడానికి రెండు ఏళ్లు చదివిన తర్వాత.. అప్పుడు ఆయన తన నిజమైన కెరీర్ ఆర్కిటెక్చర్ గ్రహించినట్లు చెప్పారు. “నేను పూర్తి సమయం ఆర్కిటెక్ట్ కాలేకపోవడం పట్ల ఎప్పుడూ చింతించలేదు. ఆ వృత్తిలో ఎక్కువ కాలం ఉండనందుకు చింతిస్తున్నాను” అని అన్నారు.

భారతీయ యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి, వారిని ప్రోత్సహించడానికి రతన్ టాటా ఎల్లప్పుడూ ముందు ఉండేవారు. జాతీయ పురోగతికి ఉన్నత విద్య కీలకమని ఆయన విశ్వసించారు. అయితే దేశంలోని యువత అందరికీ పెద్ద ఎత్తున ఈ సౌకర్యాన్ని అందించడంలో ఉన్న పరిమితులు ఆయనను విచారంలోకి నెట్టాయి. అయినప్పటికీ ఆయన టాటా గ్రూప్, వివిధ ట్రస్టుల ద్వారా భారతీయ విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యను పొందేందుకు సహాయపడ్డారు. రతన్ టాటా ప్రారంభించిన స్కాలర్‌షిప్ పథకాలు చాలా ప్రతిష్టాత్మకమైనవి, అయినా వాటి పరిధి పరిమితం. ప్రపంచ స్థాయి విద్య, అవకాశాల డిమాండ్, వాస్తవ సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందని, దాతృత్వం ద్వారా మాత్రమే ఈ అంతరాన్ని పూడ్చడం కష్టమని రతన్ టాటా గ్రహించరని సన్నిహితులు చెబుతున్నారు. పేదరికం లేదా వనరుల కొరత కారణంగా భారతీయ యువత అందరూ తమ కలలను కోల్పోకూడదని ఆయన బలంగా ఆకాంక్షించారని వాళ్లు పేర్కొన్నారు. భారతీయ యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.

ఎప్పుడు తప్పుడు మార్గాలను అనుసరించలేదు..
వ్యాపారంలో రతన్ టాటా ఎల్లప్పుడూ నిజాయితికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ఎప్పుడూ తప్పుడు మార్గాలను అనుసరించలేదు. ఈ కారణంగా టాటా గ్రూప్ ఇతర కంపెనీల వలె వేగంగా విస్తరించలేకపోయింది. దీంతో కొన్నిసార్లు ఆయన చింతించేవారు. “చివరికి మనం సృష్టించని అవకాశాలకు మాత్రమే చింతిస్తున్నాము” అని రతన్ టాటా తన సన్నిహితులతో చెప్పేవారని వారు పేర్కొన్నారు. అంటే ఆయన పూర్తిగా స్వాధీనం చేసుకోలేని వ్యాపారం లేదా వ్యక్తిగత అవకాశాలపై ఆయన హృదయంలో నిరంతరం విచార పడేవారు. అయినా కానీ ఆయన ఎప్పుడు నిజాయితీ మార్గాన్ని మాత్రం వీడలేదు.

READ ALSO: Israel Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందానికి ప్రపంచం మొత్తం కలిసి వచ్చింది: ట్రంప్

Exit mobile version