Site icon NTV Telugu

Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..

Post Office

Post Office

నేటి కాలంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే యువతకు, నిరుద్యోగులకు భారత తపాలా శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. తపాలా సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ‘పోస్టల్ ఫ్రాంచైజీ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో.. స్వయం ఉపాధిని పొందవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఒక మంచి అవకాశం. నిరుద్యోగులు తమ ఖాళీ సమయాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా.. ప్రభుత్వ సేవల్లో భాగస్వాములు కావచ్చు. చిన్న వ్యాపారం చేసుకునే వారు కూడా తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక.

పోస్టల్ ఫ్రాంచైజీ వివరాలు..
తపాలా సేవలను విస్తరించడంలో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొత్త అవుట్‌లెట్ల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
సికింద్రాబాద్ , వికారాబాద్ ప్రాంతాల నివాసితులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కిరాణా షాపులు, స్టేషనరీ షాపులు, పాన్ షాపులు లేదా ఇతర చిన్న వ్యాపారాలు నడుపుతున్న వారు తమ దుకాణాల్లోనే ఈ పోస్టల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువతకు ఇది ఒక చక్కని ఉపాధి మార్గం. దరఖాస్తుదారుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే.. కేవలం డెలివరీ పనుల కోసం దరఖాస్తు చేసే వారు 10వ తరగతి పాసైతే సరిపోతుంది. కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన ఉండాలి. స్మార్ట్‌ఫోన్ యాప్‌లను వాడటం తెలిసి ఉండాలి.

స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి. డెలివరీ పనుల కోసం దరఖాస్తు చేసే వారికి సొంత వాహనం (టూ వీలర్ లేదా ఫోర్ వీలర్) మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అందరికీ పాన్ కార్డ్ (PAN Card) ఉండటం తప్పనిసరి.

ఎంపికైన వారు నిబంధనల ప్రకారం కొంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం తమకు సమీపంలోని పోస్ట్ ఆఫీసును గానీ లేదా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని గానీ సంప్రదించవచ్చు. ప్రభుత్వ గుర్తింపుతో సొంతంగా ఎదగాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం.

Exit mobile version