కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ వస్తాయేమో అన్న భయం ప్రజల్లో పెరిగింది. దీంతో కుటుంబ భద్రత కోసం వివిధ రకాల బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనేక ఇన్సూరెన్స్ సంస్థలు కొత్త పథకాలను ప్రవేశపెడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య బీమా స్కీంలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది.
కరోనా తర్వాత తమతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తు భద్రత కోసం ఆరోగ్య మరియు జీవిత బీమా పాలసీలపై ప్రజల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాలసీ కింద రోజుకు కేవలం రెండు రూాపాయలు చెల్లిస్తే, సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాలసీదారుడు ఏ కారణంతో అయినా చనిపోతే ఆకుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతుంది.
అయితే భారతదేశంలో నివసిస్తూ ఆధార్ కార్డ్ ఉండి, వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులేనని బ్యాంకు అధికారులు తెలిపారు. పాలసీ తీసుకునే వ్యక్తికి ఆధార్ కార్డుతో పాటు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నారు.ఈ పథకాన్ని అన్ని బ్యాంకులు పోస్టాఫీసులు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పాలసీ కోసం ఎటువంటి మెడికల్ పరీక్షలు అవసరం లేదన్నారు. కానీ ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్ధయిపోతుందని.. మనం కట్టిన నగదు కూడా తిరిగి రాదని చెప్పారు. అనంతరం మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాలని సూచించారు.
