RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు

Rbi Data Centre Bhubaneswar

Rbi Data Centre Bhubaneswar

RBI Data Centre in Bhubaneswar: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన నూతన డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణ సంస్థను ప్రారంభించారు. సుమారు రూ.169 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాలు దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయనున్నాయి. సురక్షితమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఈ కార్యక్రమం కీలక ముందడుగు అని ప్రధాని పేర్కొన్నారు. RBI నూతన డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణ సంస్థ ప్రారంభంతో దేశ ఆర్థిక రంగంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రతా సామర్థ్యాలు మరింత బలోపేతం కావచ్చని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విద్యాసంస్థలు అభివృద్ధి చెందాయని అన్నారు. అయితే దేశంలోని అనేక ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాల కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు మెరుగైన చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని వివరించారు. అదే విధంగా చిన్న నగరాలకు విమానయాన సౌకర్యాలను విస్తరించడంపై గతంలో తగినంత దృష్టి సారించలేదని అన్నారు.

గ్రామాల్లో రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలు కూడా అనేక ప్రాంతాల్లో సవాలుగా ఉండేవని ప్రధాని తెలిపారు. రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయాల కొరత కూడా ఉండేదని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ దిశగా అభివృద్ధి విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

తమ ప్రభుత్వం ప్రజానుకూల, చురుకైన పాలనతో పాటు సుపరిపాలన నమూనాను అనుసరిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌లో సమతుల్య అభివృద్ధి సాధించడం, గ్రామాలు, చిన్న పట్టణాలకు కొత్త అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని వివరించారు. మారుమూల ప్రాంతాలకు మెరుగైన రవాణా, కనెక్టివిటీ సదుపాయాలు కల్పించడంతో పాటు పేద కుటుంబాలు గౌరవప్రదమైన జీవితం గడిపేలా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి ప్రయాణంలో ఏ ఒక్క పౌరుడూ వెనుకబడిపోకూడదని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వంపై విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలో రవాణా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ప్రధాని వివరించారు. ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా చిన్న పట్టణాలను కూడా అనుసంధానిస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్‌ (AIIMS) వంటి వైద్య సంస్థలను వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తున్నామని, చిన్న నగరాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.