PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం డబ్బుల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మొత్తం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున అన్నదాతలకు ఈ డబ్బులు అందుతాయి. అయితే PM-KISANలో పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన రైతులకు డబ్బులు అందుతాయని అనుకోవద్దు. ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ముఖ్యమైన ప్రక్రియలను అన్నదాతలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ల్యాండ్ సీడింగ్, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకింగ్, e-KYC పూర్తి చేయడం కీలకం. వీటిలో ఏదైనా ప్రక్రియ అసంపూర్తిగా ఉంటే మీకు కేంద్రం చేసే డబ్బు చెల్లింపు నిలిచిపోయే అవకాశం ఉంది.
1. ల్యాండ్ సీడింగ్ పూర్తి కాలేదా?
PM-KISAN డబ్బులు నిలిచిపోవడానికి ప్రధాన కారణాల్లో ల్యాండ్ సీడింగ్ ఒకటని చెబుతున్నారు. రైతు భూమికి సంబంధించిన వివరాలు PM-KISAN రికార్డుల్లో సరిగ్గా నమోదు అయి, ధ్రువీకరణ పూర్తై ఉండాలి. భూమి రికార్డులు అప్‌డేట్ కాకపోయినా, పథకం రికార్డుల్లో భూమికి సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉన్నా దీని ప్రభావం మీకు వచ్చే డబ్బులపై పడే అవకాశం ఉంది. అందుకే రైతులు తమ ల్యాండ్ సీడింగ్ స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
2. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాలేదా?
PM-KISAN డబ్బులు DBT (Direct Benefit Transfer) విధానంలో రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ అవుతాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్/లింకింగ్ పూర్తిగా ఉండటం ముఖ్యం. ఆధార్ లింకింగ్ పెండింగ్‌లో ఉంటే కిస్తీ చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 30,18,361 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10.44 లక్షలకు పైగా, బీహార్‌కు చెందిన సుమారు 1.39 లక్షల కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
3. e-KYC పూర్తి చేశారా?
PM-KISAN లబ్ధిదారులకు e-KYC కూడా తప్పనిసరి. e-KYC పూర్తి చేయకపోతే మీకు రావాల్సిన డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది. రైతులు PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌లో OTP ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్, ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో e-KYC చేయడంలో ఇబ్బంది ఉంటే సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు డబ్బులు రాలేదంటే..
పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అవసరమైన నిబంధనలు, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తికాకపోవడంతో ల్యాండ్ సీడింగ్‌కు సంబంధించి 16,52,379 మంది, ఆధార్-బ్యాంక్ సీడింగ్‌కు సంబంధించి 23,53,748 మంది, e-KYCకు సంబంధించి 32,94,609 మంది లబ్ధిదారుల చెల్లింపులు ప్రభావితమైనట్లు వెల్లడించింది. దీంతో PM-KISANలో పేరు నమోదై ఉండటం ఒక్కటే సరిపోదని స్పష్టమవుతోంది. రైతులు తమ భూమి వివరాలు, ఆధార్-బ్యాంక్ లింకింగ్, e-KYC వంటి ప్రక్రియలను కూడా సక్రమంగా పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
మీ బ్యాంక్ ఖాతాలో PM-KISAN కింద రావాల్సిన రూ.2,000 జమ కాకపోతే ముందుగా మీ స్టేటస్‌ను చెక్ చేసుకోండి. PM-KISAN అధికారిక పోర్టల్‌లోని ‘Know Your Status’ ఆప్షన్ ద్వారా చెల్లింపులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అక్కడ పేమెంట్ స్టేటస్, బ్యాంక్ పేరు, UTR నంబర్, డబ్బులు జమ అయిన తేదీ వంటి వివరాలను పరిశీలించవచ్చు. అదే సమయంలో e-KYC, ఆధార్-బ్యాంక్ లింకింగ్, ల్యాండ్ సీడింగ్ స్టేటస్‌లను కూడా చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మీ అకౌంట్లో జమ కావాల్సిన డబ్బుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు.

