వచ్చే ఏడాది ప్రారంభం నుంచి జీఎస్టీ పోర్టల్‌లో మార్పులు అమల్లోకి రానున్నాయి. 2025 నుంచి మూడు సంవత్సరాల గడువు తేదీ తర్వాత ఫైల్ చేయడం అనుమతించబడదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) తాజాగా జరిగిన సంప్రదింపులలో ఈ విషయాన్ని తెలిపింది. జీఎస్టీ అమ్మకాల రిటర్న్‌లతో పాటు, బకాయిల చెల్లింపు, వార్షిక రిటర్న్‌లు, టీసీఎస్ వసూలుకు సంబంధించిన రిటర్న్‌లకు కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అంటే రిటర్న్‌ల సమర్పణ గడువు తేదీ నుంచి మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత రిటర్న్ దాఖలు చేయడంపై నిషేధం ఉంటుంది.
ఈ మార్పు వచ్చే ఏడాది (2025) ప్రారంభం నుంచి జీఎస్టీ పోర్టల్‌లో అమలులోకి రాబోతోంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచూసుకోవాలని.. ఇంకా ఎవరైనా జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా దాఖలు చేయాలని జీఎస్టీఎన్ సూచించింది. సకాలంలో జీఎస్టీ దాఖలును పూర్తి చేయడం, డేటా విశ్వసనీయతను పెంచడం, ఫైల్ చేయని రిటర్న్‌ల ‘బ్యాక్‌లాగ్’ను సమర్థవంతంగా తగ్గించడం లక్ష్యంగా జీఎస్టీఎన్ కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసే వ్యవధిని పరిమితం చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిపోల్చుకుని, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.