Margadarsi Chit Fund: ఈ ఆర్థిక సంవత్సరంలో మార్గదర్శి చిట్‌ఫండ్ టర్నోవర్ 12 వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. గతేడాది టర్నోవర్ 9 వేల 7 వందల 12 కోట్ల రూపాయలని తెలిపారు. మార్గదర్శికి 60 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ఈ 60 ఏళ్లలో 60 లక్షల మందికి పైగా చందాదారులకు సేవలందించామని శైలజా కిరణ్ పేర్కొన్నారు. 1962లో ప్రారంభమైన మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో 108 బ్రాంచ్‌లకు విస్తరించిందని వివరించారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రామోజీ గ్రూప్ కంపెనీ అనే సంగతి తెలిసిందే.
ఈ రోజు నుంచే కార్డ్ టోకెనైజేషన్
కార్డుల టోకెనైజేషన్‌కి సంబంధించిన కొత్త రూల్స్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటివరకు 35 కోట్ల కార్డుల టోకెనైజేషన్ పూర్తయిందని పేర్కొంది. ఈ కొత్త ప్రక్రియ అమలు కోసం వ్యవస్థ దాదాపుగా సర్వం సిద్ధమైందని వెల్లడించింది. కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన తుది గడువు నిన్నటితో ముగిసింది. డెడ్‌లైన్‌ని ఈసారి కూడా పొడిగిస్తారేమోనని వివిధ వర్గాలు ఆశించినప్పటికీ ఆర్బీఐ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గతంలోనే పలుమార్లు తుది గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. కస్టమర్ల డేటా సెక్యూరిటీ కోసమే కార్డ్ టోకెనైజేషన్‌ను తెర మీదికి తెచ్చింది.
read also: Zee Media Goodbye to BARC: ‘బార్క్’కి ‘జీ మీడియా’ గుడ్‌బై!
రక్షణ శాఖ.. ఉన్నత శిఖరాలకు..
దేశ రక్షణ రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చటానికి ఈ సెక్టార్‌లోని పరిశ్రమల సహకారం కావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. డిఫెన్స్ ఇండస్ట్రీ కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు చేయాలని, రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ ప్రయత్నాలు రక్షణ రంగానికి మాత్రమే కాకుండా మొత్తం దేశాభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ 117వ వార్షిక సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.
