NTV Telugu Site icon

Car Loan Tips: కార్ లోన్ తీసుకునేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే ఇబ్బందులే?

Car

Car

నేటి రోజుల్లో కారు కలిగి ఉండడం కామన్ అయిపోయింది. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు, ఉపాధి కోసం మరికొందరు కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులుగా భావించిన కార్లు నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. అయితే కొందరు సొంత కారు ఉండాలని కలలు కంటుంటారు. కానీ, చేతిలో సరిపడా డబ్బు ఉండదు. దీని కోసం అప్పులు చేస్తుంటారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్స్ తీసుకుంటుంటారు. అయితే కార్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది.

క్రెడిట్ స్కోర్:

లోన్ల మంజూరులో క్రెడిట్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ తిరిగి చెల్లింపులు సకాలంలో చేస్తే మంచి క్రెడిట్ స్కోర్ వస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎక్కువుంటేనే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కార్ లోన్ లేదా ఇతర లోన్స్ ను అందిస్తుంటాయి. లోన్ పొందటం ఈజీ అవుతుంది.

లోన్ టెన్యూర్:

బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు లోన్ ఇచ్చినప్పుడు, మీరు రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన గడువును ఇస్తుంది. అందువల్ల, మీరు ఎప్పుడు రుణం తీసుకున్నారో, రుణాన్ని తిరిగి చెల్లించడానికి బ్యాంకు మీకు ఎంత సమయం ఇస్తుందో అవగాహన కలిగి ఉండాలి. రుణ కాల వ్యవధి ఎక్కువగా పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా తక్కువ మొత్తంలో ఈఎంఐ చెల్లించొచ్చు. కానీ, అటువంటి పరిస్థితిలో అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. లోన్ టెన్యూర్ తక్కువగా పెట్టుకుంటే వడ్డీరేటు తగ్గుతుంది. మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా లోన్ టెన్యూర్ ఎంచుకోవడం బెటర్.

వడ్డీ రేటు:

కారు రుణం ఇవ్వడంతో పాటు, బ్యాంకు ప్రతి నెలా దానిపై వడ్డీ రేట్లను కూడా వసూలు చేస్తుంది. ప్రతి బ్యాంకుకు, ఫైనాన్స్ కంపెనీకి దాని స్వంత వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి, రుణం తీసుకునే ముందు బ్యాంకు వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకున్నాక ఎందులో తక్కువ వడ్డీ రేట్లు ఉంటే అందులో లోన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదనపు రుసుములు:

లోన్ ఇవ్వడంతో పాటు, బ్యాంకు దానిపై అనేక రకాల ఛార్జీలను కూడా విధిస్తుంది. ఇందులో అప్లికేషన్ ఫీజు, ఒరిజినేషన్ ఫీజు, ప్రీపేమెంట్ పెనాల్టీ వంటి వివిధ ఛార్జీలు ఉంటాయి. కాల్ లోన్ తీసుకునే ముందు మీరు ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఈ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు బ్యాంకు నుంచి దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. కారు లోన్ తీసుకునే విషయంలో తొందరపడకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న తర్వాతే లోన్ తీసుకుంటే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.