KCC Loan: రైతులకు పంట సాగు నుంచి కోత వరకు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, కూలీల ఖర్చులతో పాటు వ్యవసాయ పరికరాల కొనుగోలుకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఇలాంటి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు క్రెడిట్ కార్డు (KCC) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 1998 ఆగస్టులో ప్రారంభమైన KCC పథకం తొలుత పంట సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం మాత్రమే ఉపయోగపడేది. అనంతరం పశుపోషణ, డెయిరీ, మత్స్య, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను కూడా ఇందులో చేర్చారు. రైతులు బ్యాంకుల ద్వారా KCC పొందవచ్చు.
తక్కువ వడ్డీకే రుణం
KCCలో రైతులకు తక్కువ వడ్డీకి రుణం లభించడం ప్రధాన ప్రయోజనం. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద అర్హత ఉన్న వారికి రూ.3 లక్షల వరకు KCC రుణాలకు 7 శాతం వార్షిక వడ్డీ రేటుతో అందించేందుకు బ్యాంకులకు సహాయం అందుతుంది. రుణాన్ని నిర్ణీత సమయంలో చెల్లించే రైతులకు అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభించే అవకాశం ఉంది. దీంతో నిబంధనలు, అర్హతల ప్రకారం ప్రభావవంతమైన వడ్డీ రేటు 4 శాతానికి తగ్గవచ్చు. సొంత భూమిలో వ్యవసాయం చేసే రైతులతో పాటు కౌలు రైతులు, బటాయిదారులు కూడా అర్హత పొందవచ్చు. రైతుల స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG) కూడా ఈ పథకం పరిధిలోకి రావచ్చు. డెయిరీ, పశుపోషణ, మత్స్య, తేనెటీగల పెంపకం, పట్టు పరిశ్రమ, మష్రూమ్ సాగు వంటి కార్యకలాపాలు చేసేవారు కూడా KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత రుణం వస్తుందంటే..
KCC రుణ పరిమితి ప్రతి రైతుకు ఒకేలా ఉండదు. భూమి విస్తీర్ణం, పంట, సాగు ఖర్చు, అవసరాలను బట్టి బ్యాంకు పరిమితిని నిర్ణయిస్తుంది. పంట సాగు, కోత అనంతర ఖర్చుల కోసం గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు క్రెడిట్ పరిమితి ఉండొచ్చు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు వర్కింగ్ క్యాపిటల్‌గా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పరిమితి ఉండే అవకాశం ఉంది. KCCలో క్రెడిట్ పరిమితిని సాధారణంగా ఐదేళ్ల కాలానికి నిర్ణయిస్తారు. ఇది రివాల్వింగ్ క్రెడిట్ విధానంలో ఉంటుంది. అంటే నిర్ణయించిన పరిమితిలో రైతు అవసరానికి అనుగుణంగా డబ్బు తీసుకుని తిరిగి జమ చేయవచ్చు. పంట ఖర్చులు, కోత అనంతర వ్యయాలు, వ్యవసాయ ఆస్తుల నిర్వహణ, బీమా ప్రీమియం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిమితిని నిర్ణయిస్తారు. తరువాతి సంవత్సరాల్లో ఖర్చుల పెరుగుదలను బట్టి పరిమితిని పెంచే అవకాశం ఉంటుంది. KCC రుణాన్ని వరి, గోధుమ వంటి పంటలకే కాకుండా కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు తదితర సాగుకు ఉపయోగించుకోవచ్చు. పంట కోత అనంతర ఖర్చులకు కూడా వినియోగించవచ్చు. కొన్ని నిబంధనల ప్రకారం e-NWR ఆధారంగా గోదాముల్లో నిల్వ చేసిన పంటకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు పంటను వెంటనే తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితిని కొంతవరకు నివారించవచ్చు.
ఎక్కడ అప్లై చేయాలంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన అర్హత ఉన్న బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కంప్యూటరైజ్డ్ ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల ద్వారా KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. దరఖాస్తు సమయంలో ఆధార్, గుర్తింపు, నివాస ధ్రువీకరణ, భూమికి సంబంధించిన పత్రాలు లేదా కౌలు వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు వంటి పత్రాలు అవసరం కావచ్చు. అయితే అవసరమైన డాక్యుమెంట్లు, వడ్డీ రేటు, రుణ పరిమితి, సబ్సిడీ నిబంధనలు బ్యాంకును బట్టి మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు సంబంధిత బ్యాంకు నుంచి తాజా వివరాలను తెలుసుకోవడం మంచిది.

