Jio Platforms IPO: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓకు సంబంధించిన షేర్ల అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. సుమారు రూ.30,213 కోట్ల పరిమాణంతో వచ్చిన ఐపీఓ మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడంతో షేర్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ఐపీఓకు దరఖాస్తు చేసిన పెట్టుబడిదారులు తమకు షేర్లు అలాట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం సెబీ అనుమతించిన అధికారిక వేదికలను ఉపయోగించాలి. ముఖ్యంగా ఐపీఓ రిజిస్ట్రార్ కెఫిన్ టెక్నాలజీస్ పోర్టల్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్ల ద్వారా అలాట్‌మెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో..
బీఎస్‌ఈ అధికారిక ఐపీఓ అప్లికేషన్ స్టేటస్ పేజీకి వెళ్లి ‘Issue Type’లో ‘ఈక్విటీ’ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘Issue Name’లో Jio Platforms Limitedను సెలెక్ట్ చేసి, మీ అప్లికేషన్ నంబర్, పాన్ వివరాలను నమోదు చేయాలి. క్యాప్చా పూర్తి చేసి ‘Search’పై క్లిక్ చేస్తే అలాట్‌మెంట్ స్టేటస్ తెలుస్తుంది.
ఎన్‌ఎస్‌ఈలోనూ..
ఎన్‌ఎస్‌ఈ అధికారిక ఐపీఓ బిడ్ వివరాల పేజీ ద్వారా కూడా దరఖాస్తు స్థితిని పరిశీలించవచ్చు. అక్కడ Equity & SME IPO bid details ఆప్షన్‌ను ఎంచుకుని, ‘Select Symbol’లో JPLను ఎంపిక చేయాలి. అనంతరం అప్లికేషన్ నంబర్, పాన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే సంబంధిత వివరాలు కనిపిస్తాయి.
కెఫిన్ టెక్నాలజీస్‌లో ఇలా..
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు రిజిస్ట్రార్‌గా కెఫిన్ టెక్నాలజీస్ వ్యవహరిస్తోంది. ముందుగా అధికారిక ఐపీఓ స్టేటస్ పోర్టల్‌ను ఓపెన్ చేసి, ‘Select IPO’ ఆప్షన్‌లో Jio Platforms Limitedను ఎంచుకోవాలి. ఆ తర్వాత పాన్ నెంబర్ లేదా అప్లికేషన్ నంబర్ లేదా డీపీ/క్లయింట్ ఐడీ వంటి వివరాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని సంబంధిత నంబర్‌ను నమోదు చేయాలి. క్యాప్చా పూర్తి చేసి ‘Submit’ లేదా ‘Search’పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తుకు సంబంధించిన అలాట్‌మెంట్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. షేర్లు కేటాయించబడితే ఎన్ని షేర్లు వచ్చాయో కూడా అక్కడే తెలుసుకోవచ్చు.
ఇవన్నీ కాకుండా ఎక్కడో వెతికే అవసరం లేకుండా మీ డీమ్యాట్ అకౌంట్ లింక్ ఉన్న ఈమెయిల్ ను చూస్తే సులువుగా అర్థమవుతుంది. మీకు ఒకవేళ షేర్స్ అలాట్ అయ్యి ఉంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో మెయిల్ వచ్చి ఉంటుంది. అందులో మీకు ఎన్ని షేర్స్ అలాట్ అయ్యాయో.. ఇంకా ఇతర విషయాలన్నీ క్షుణంగా తెలపబడి ఉంటాయి.
షేర్లు దక్కని వారికి ఎలా.?
ఐపీఓలో షేర్లు కేటాయించని ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాల్లో బ్లాక్ చేసిన నిధుల అన్‌బ్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. షేర్లు కేటాయించబడిన వారికి వాటిని డీమ్యాట్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28 నుంచి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో అధికారికంగా ట్రేడింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. దీంతో అలాట్‌మెంట్ తర్వాత స్టాక్ మార్కెట్‌లో జియో షేరు ఎలా ప్రారంభమవుతుందనే దానిపై కూడా ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొంది.

