Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!

Success Story

Success Story

Success Story: ఐఐటీలో చదువుకుని, గోల్డ్‌మన్ సాక్స్ లాంటి పెద్ద కంపెనీలో లక్షల జీతంతో ఉద్యోగం వస్తే ఎవరైనా లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌కు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కుల్దీప్ పరేవా మాత్రం ఆ విలాసవంతమైన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఉద్యోగం మానేసి నెయ్యి, నూనె అమ్ముతానని చెప్పినప్పుడు తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. అయినా వెనక్కి తగ్గకుండా తన క్రేజీ బిజినెస్ ఐడియాతో బెంగళూరులోని ఒక చిన్న 2BHK ఫ్లాట్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా రూ. 1,000 కోట్ల విలువైన కంపెనీని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

డ్రాయింగ్ రూమే గోదాం.. స్కూటర్‌పై డెలివరీలు!

ఐఐటీ గౌహతిలో చదువుకున్న కుల్దీప్ పరేవా, 2020లో తన ఇద్దరు ఐఐటీ, గోల్డ్‌మన్ సాక్స్ ఫ్రెండ్స్ అఖిల్ కన్సల్, ఆయుషి ఖండేల్వాల్‌లతో కలిసి ‘అన్వేషణ్’ అనే బ్రాండ్‌ను మొదలుపెట్టారు. వీరి బిజినెస్ కోసం ఎలాంటి పెద్ద ఆఫీసులు గానీ, ఫ్యాక్టరీలు గానీ లేవు. బెంగళూరు ఇందిరానగర్‌లోని కుల్దీప్ ఉంటున్న రెండు గదుల ఫ్లాటే వీరి మొదటి ఆఫీస్. ఆ ఫ్లాట్‌లోని ఒక గదిలో సరుకులు పెట్టి, డ్రాయింగ్ రూమ్‌ను గోదాంలా మార్చేశారు. ముగ్గురూ నేలపై కూర్చుని చేతులతోనే రోజుకు దాదాపు 200 ఆర్డర్లు ప్యాక్ చేసేవారు. ఆ తర్వాత ఆ నూనె డబ్బాలు, నెయ్యి ప్యాకెట్లను స్కూటర్‌పై తీసుకెళ్లి స్వయంగా షాపులకు డెలివరీ చేసేవారు.

కల్తీకి చెక్ పెడుతూ.. రైతులకు అండగా

బయట మార్కెట్లో ఎక్కడ చూసినా కల్తీ సరుకులే కనిపిస్తుండటంతో, జనాలు మళ్లీ మన పాతకాలపు పద్ధతుల్లో తయారైన స్వచ్ఛమైన ఆహారం కోసం వెతుకుతున్నారని వీరు గమనించారు. అందుకే కవ్వంతో చిలికి చేసే అసలైన ‘బిలోనా నెయ్యి’, వేడి తగలకుండా చెక్క గానుగలో తీసే స్వచ్ఛమైన నూనెల వ్యాపారంలోకి దిగారు. అయితే, కేవలం తమ లాభాల కోసమే కాకుండా రైతులకు కూడా నాలుగు రాళ్లు మిగలాలనే ఆలోచనతో, పంట పండే ఊళ్లలోనే చిన్న చిన్న తయారీ కేంద్రాలను పెట్టారు. దీనివల్ల రైతులకు పంటను నేరుగా అమ్ముకోవడం కంటే మంచి గిట్టుబాటు ధర దొరకడమే కాకుండా, కొనేవాళ్లు ప్యాకెట్ మీదున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. ఆ నెయ్యి లేదా నూనె ఏ ఊర్లో, ఎలా తయారైందో కళ్లకు కట్టినట్లు చూసుకునే వీలు కల్పించారు.

రూ. 430 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల స్థాయికి

ఇప్పుడు ఈ కంపెనీ 250 మందికి పైగా రైతులతో కలిసి పనిచేస్తూ, దేశవ్యాప్తంగా 20కి పైగా ప్రాసెసింగ్ యూనిట్లు, 150 మందికి పైగా ఉద్యోగులతో విస్తరించింది. నెయ్యి, నూనెలతో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు తేనె, మసాలాలు, పిండి రకాలు లాంటి అనేక ఆహార పదార్థాలకు పాకింది. కంపెనీ ఆదాయం 2023-24లో రూ. 46.84 కోట్లు ఉండగా, 2024-25 నాటికి రూ. 77.08 కోట్లకు పెరిగింది. 2025 ఏప్రిల్‌లో రూ. 48 కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు కంపెనీ విలువ రూ. 430 కోట్లుగా ఉండగా, 2026 జూన్‌లో జరిగిన సిరీస్-బి ఫండింగ్‌లో రూ. 150 కోట్లు రాబట్టడంతో కంపెనీ వాల్యుయేషన్ ఏకంగా రూ. 900 నుంచి 1,000 కోట్ల మార్కును తాకింది. పట్టుదల, సరైన ఆలోచన ఉంటే ఒక చిన్న గది నుంచైనా వేల కోట్ల వ్యాపారం నిర్మించవచ్చని కుల్దీప్ టీమ్ నిరూపించింది.