Indian Business Icons: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి.హిందూజా నవంబర్ 4, 2025న 85 సంవత్సరాల వయసులో మంగళవారం లండన్‌లో తుది శ్వాస విడిచారు. రెండేళ్ల క్రితం గోపీచంద్ హిందూజా 2023లో సంస్థకు ఛైర్మన్ అయ్యారు. ఇక్కడ ఆయన గురించి ఒక విషయం చెప్పుకోవాలి.. ఆయన దాదాపు 40 ఏళ్ల ముందే పతనం అంచున ఉన్న ఒక కంపెనీ ప్రాణం పోశారని ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తెలుసు.. ఇంతకీ ఆ కంపెనీ ఏంటో తెలుసా.. బ్రిటిష్ కంపెనీ అశోక్ లేలాండ్. 1987లో ఈ కంపెనీ భారతదేశం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నప్పుడు జరిగిన కథ ఇది.
READ ALSO: MacBook Air M4: క్రేజీ డీల్.. Apple MacBook Air M4 పై రూ.17,000 పైగా డిస్కౌంట్
మూతపడే స్థాయి నుంచి నంబర్ టూ వరకు..
పతనం అంచున ఉన్న ఈ కంపెనీ.. ఒక రోజు భారత దేశంలో రెండవ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారుగా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ గోపీచంద్ హిందూజా దానిని నిజం చేసి చూపించారు. 1987లో బ్రిటిష్ లేలాండ్ భారతదేశం నుంచి నిష్క్రమించాలని చూస్తున్న సమయంలో ఆయన ఈ కంపెనీలో 26% వాటాను సొంతం చేసుకున్నారు. అలా “అశోక్ లేలాండ్ పునర్జన్మ” ప్రారంభమైంది. ఆ సమయంలో అశోక్ లేలాండ్ కర్మాగారాలు పాత ఇంజిన్లను మాత్రమే (1948 మోడల్స్) ఉత్పత్తి చేసేవి. అలాగే ఏడాదికి కేవలం 3 వేల నుంచి 4 వేలు వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేసేవి. దీంతో కంపెనీకి క్రమంగా నష్టాలు పెరుగడం ప్రారంభించాయి. ఎప్పుడైతే గోపీచంద్ హిందూజా ఈ కంపెనీలో అడుగు పెట్టారో అప్పటి నుంచి ఈ కంపెనీ కథ మారింది.
కంపెనీ విజయం వెనుక మాస్టర్ స్ట్రాటజీ..
త్వరిత పెట్టుబడులు బ్యాలెన్స్ షీట్ క్లీనప్ : 1987 -1990 మధ్య రూ.100 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు కంపెనీలోకి వచ్చాయి. దీంతో యంత్రాలను మార్చారు, ప్లాంట్లు (ఎన్నోర్, హోసూర్) ఆధునీకరించారు. అలాగే కంపెనీలు అప్పులు కూడా తగ్గించారు. వాస్తవానికి ఇవన్నీ కంపెనీ పునాదిని బలోపేతం చేశాయి.
టెక్నాలజీ భాగస్వామ్యం: ఇవెకో (ఫియట్)తో జాయింట్ వెంచర్ ఫలితంగా 1990లో ‘H-సిరీస్’ ఇంజిన్ విడుదలైంది. ఈ ఇంజిన్ తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని అందించింది. 1997లో అశోక్ లేలాండ్ భారతదేశపు మొట్టమొదటి CNG బస్సును కూడా తయారు చేసింది.
ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది : 1987లో కేవలం 4,000 వాహనాలు ఉత్పత్తి కాగా, 1995లో ఈ సంఖ్య 40 వేలకు, 2007లో లక్షకు పైగా పెరిగింది. అలాగే కంపెనీ ఆధ్వర్యంలో అల్వార్, పంత్ నగర్, భండారాలో కొత్త కర్మాగారాలు ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో భారతదేశం నుంచి ప్రపంచానికి విస్తరణ ప్రారంభం అయ్యింది. లేలాండ్ శ్రీలంక, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాలకు వాహనాలను ఎగుమతి చేయడం మొదలు పెట్టింది. నేడు ఈ కంపెనీ 50 కి పైగా దేశాలలో మార్కెట్ ఉంది. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద బస్సు కంపెనీ, పదవ అతిపెద్ద ట్రక్ కంపెనీగా నిలిచింది. అలాగే 2016లో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బస్సు (సర్క్యూట్)ను ప్రారంభించింది. 2020లో భారతదేశపు మొట్టమొదటి మాడ్యులర్ ట్రక్కును AVTR ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేశారు. తర్వాత కంపెనీలు LNG ట్రక్కులపై దృష్టిసారింది. ఈక్రమంలో 2024లో LNG ట్రక్కులను కూడా ప్రారంభించారు.
గోపీచంద్ పాటించిన 3 సూత్రాలు..
టెక్నాలజీయే భవిష్యత్తు: ప్రతి 5 ఏళ్లకు కొత్త ఇంజిన్లు, కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం అవసరం అని ఆయన నమ్మారు.
భారతదేశాన్ని ప్రపంచీకరించడం: ఎగుమతులను పెంచడం, విదేశీ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, అవుట్‌సోర్సింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆయన దృష్టి సారించారు.
ఉద్యోగులు = కుటుంబం: ప్రతి కార్మికుడికి శిక్షణ ఇవ్వడం, వారిని రక్షించడం, ప్రజలకు దీర్ఘకాలిక ఉద్యోగాలను సృష్టించడం అనేవి ఆయన విజయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
ఆయన విజయాలలో 2007లో ఇవెకోలో 30% వాటాను కొనుగోలు చేయడం ఒకటి. దీంతో ఆయన కంపెనీని పూర్తిగా నియంత్రించడం సాధ్యం అయ్యింది. అప్పటి నుంచి కంపెనీ మరింత విజయపథంలో నడవడం ప్రారంభించింది. నేడు, అశోక్ లేలాండ్ భారతదేశంలో టాటా తర్వాత రెండవ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారిగా రికార్డును సృష్టించిందంటే దానికి ప్రధాన కారణం గోపీచంద్ హిందూజా. ఈ కంపెనీ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బస్సు తయారీదారు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉంది. కంపెనీ ఆధ్వర్యంలో తయారు చేసిన 1,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు దేశంలో నడుస్తున్నాయి, అలాగే 50 వేల కంటే ఎక్కువ వాహనాలు భారత సైన్యానికి సరఫరా చేశారు. “అశోక్ లేలాండ్‌ను కాపాడకూడదు, నిర్మించాలి. మేము డబ్బును మాత్రమే కాదు, ఒక కలను కూడా పెట్టుబడి పెట్టాము” గోపీచంద్ హిందూజా గర్వంగా చెప్పేవారు. ఇది పతనం అంచున నుంచి విజయవంతం అయిన కంపెనీ చరిత్ర. ఆ చరిత్రకు ప్రధాన కారణం గోపీచంద్ హిందూజా.
