Google: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివాదంలో భారత్ మ్యాట్రిమెనీ వంటి కొన్ని ప్రముఖ మ్యాట్రిమెనీ యాప్‌లతో సహా దేశంలోని 10 కంపెనీలకు చెందిన యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలో యాంటీట్రస్ట్ అధికారులు 15 శాతం నుంచి 30 శాతం వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించిన తర్వాత, యాప్ చెల్లింపులపై 11 శాతం నుంచి 26 శాతం వరకు రుసుమును విధించకుండా గూగుల్‌ని ఆపడానికి కొన్ని భారతీయ స్టార్టప్‌లు చేసిన ప్రయత్నాలతో వివాదం మొదలైంది.
Read Also: Rinky chakma: చిన్న వయసులోనే మాజీ మిస్ ఇండియా చక్మా కన్నుమూత
అయితే, స్టార్టప్‌లకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జనవరి, ఫిబ్రవరిలో రెండు కోర్టు నిర్ణయాలను వెలువరించిన తర్వాత రుసుము వసూలు చేయడానికి లేదా యాప్‌లను తొలగించడానికి గూగుల్ ముందుకు వెళ్లింది. మాట్రిమోనీ.కామ్, డేటింగ్ యాప్స్ భారత్ మాట్యిమోనీ, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రిమోనీ, జోడీ వంటి యాప్స్ శుక్రవారం తొలగించబడ్డాయి. ఈ కంపెనీల వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకీరామ్ మాట్లాడుతూ.. ఈచర్యను ‘‘ భారతీయ ఇంటర్నెట్ చీకటి రోజు’’గా అభివర్ణించారు.
ఈ మ్యాట్రిమోనీ సంస్థల్ని నడుపుతున్న మ్యాట్రిమోనీ.కామ్, ఇదే విధమైన యాప్ జీవన్‌సతిని నడుపుతున్న ఇన్ఫో ఎడ్జ్‌కి ప్లే స్టోర్ ఉల్లంఘన నోటీసులను పంపింది. రెండు కంపెనీలు ప్రస్తుతం నోటీసులను సమీక్షిస్తున్నాయని, తదుపరి చర్యలను పరిశీలిస్తామని వాటి అధికారులు చెబుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మ్యాట్రిమోనీ.కామ్ షేర్లు 2.7 శాతం వరకు ఇన్ఫోఎడ్జ్ షేర్లు 1.5 వరకు పడిపోయాయి. ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న అన్ని గూగుల్ ఇన్‌వాయిస్‌లను సకాలంలో క్లియర్ చేశామని, దాని విధానాలకు అనుగుణంగా ఉన్నాయని అన్నారు. 10 భారతీయ కంపెనీలు గూగుల్ ప్లేలో పొందుతున్న సేవలకు ఎక్కువ కాలంగా చెల్లించకుండా ఉన్నట్లు ఒక ప్రకటనలో గూగుల్ తెలిపింది.