Site icon NTV Telugu

Gold Rates Fall: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్క రోజే రూ.10 వేలు డౌన్..

Gold

Gold

బులియన్ మార్కెట్‌లో సోమవారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సామాన్యులకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.10,320 వరకు ధర తగ్గడం విశేషం. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విడతలుగా ధరలు పతనమవ్వడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ధరల పతనం ఇలా..

సోమవారం ఉదయం నుంచే మార్కెట్‌లో సానుకూల పవనాలు వీచాయి. తొలి విడతలో 24 క్యారెట్ల బంగారంపై రూ.5,950 తగ్గగా, సాయంత్రం 4 గంటల తర్వాత మరో రూ.4,370 పడిపోయింది. మొత్తంగా చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు).. రూ.10,320 తగ్గి, ప్రస్తుతం రూ.1,35,650 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు).. రూ.9,450 తగ్గి, ప్రస్తుతం రూ.1,24,350 వద్ద ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. అయితే.. వీటికి జీఎస్‌టీ (GST) , తరుగు (Making charges) అదనంగా ఉంటాయని గమనించాలి.

బంగారం ధరలు ఇలా అమాంతం పడిపోవడానికి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్‌లో సానుకూలతను నింపింది. యుద్ధ మేఘాలు కొద్దిగా తొలగడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు నుంచి తమ పెట్టుబడులను ఇతర రంగాల వైపు మళ్ళిస్తున్నారు.

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై నెలకొన్న స్పష్టత కూడా పసిడి ధర తగ్గుముఖం పట్టడానికి దోహదపడింది. ధరలు తగ్గాయి కదా అని తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్‌పై ఆంక్షలు మళ్లీ పెరిగినా లేదా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలైనా.. బంగారం ధరలు తిరిగి రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధరలు భారీగా పెరగకపోయినా, మరీ దారుణంగా పడిపోయే అవకాశం కూడా తక్కువగానే కనిపిస్తోంది.

Exit mobile version