Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..

Stockmarket

Stockmarket

గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ మే నెలలో ఇప్పటివరకు వారు రూ. 27,048 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2026 లో మొత్తం ఎఫ్‌పీఐ అవుట్‌ఫ్లోలు రూ. 2.2 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2025 మొత్తం సంవత్సరంలో ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరి మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా నిలిచారు. జనవరిలో రూ. 35,962 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 lakh కోట్ల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్ నెలలో రూ. 60,847 కోట్లు, మే నెలలో ఇప్పటి వరకు రూ. 27,000 కోట్లకు పైగా ఉపసంహరణలు జరిగాయి.

మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా నిపుణుడు హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి, కీలక ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎఫ్‌పీఐల నిరంతర విక్రయాలు, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు (CAD) రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని తెచ్చాయని పేర్కొన్నారు. ఏడాది ఆరంభంలో డాలర్‌తో పోలిస్తే రూ. 90 వద్ద ఉన్న రూపాయి విలువ.. మే 15 నాటికి చారిత్రాత్మక అత్యల్ప స్థాయి రూ. 96.14కు పడిపోయింది.. దీని వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనకు గురయ్యి.. తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

ముడిచమురు ధరలు పెరిగి, ఎఫ్‌పీఐల విక్రయాలు ఇలాగే కొనసాగితే రూపాయి మరింత బలహీనపడే ప్రమాదముంది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంపెనీల్లోకి భారీగా నిధులు తరలిపోతుండటం వల్ల, ఏఐ రంగంలో వెనుకబడి ఉన్న భారత మార్కెట్ నుంచి నిధులు దారి మళ్లుతున్నాయి. అయితే.. ప్రస్తుతం బబుల్ జోన్‌లో ఉన్న ఏఐ ట్రేడింగ్ కాస్త చల్లబడినప్పుడు ఈ ట్రెండ్ మళ్లీ మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.