Bank Holiday List: వచ్చే వారం బ్యాంకులకు వెళ్లాలనుకునే వారికి అలర్ట్. జూన్ 22 నుంచి 28 మధ్య వచ్చే వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు రోజుల పాటు క్లోజ్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసిన జూన్ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు శని, ఆదివారాల సెలవులు ఇందుకు కారణం. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కొన్ని సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. మరి వచ్చే వారం బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వచ్చే వారం బ్యాంకు సెలవుల వివరాలు:
జూన్ 25 (గురువారం): ముహర్రం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూన్ 26 (శుక్రవారం): ముహర్రం పండుగ కారణంగా హైదరాబాద్ (తెలంగాణ)తో పాటు అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 27 (శనివారం): ఇది నెలలో వచ్చే నాల్గవ శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు అధికారిక సెలవు.
జూన్ 28 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి.
మిగిలిన జూన్ నెల సెలవుల క్యాలెండర్..
ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో మరికొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే..
జూన్ 29: సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా శిమ్లాలో బ్యాంకులు బంద్.
జూన్ 30: ‘రెమ్నా నీ’ ప్రాంతీయ పండుగ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథాతథం..
వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంక్ మూతపడినప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లేదా బ్యాంక్ అఫీషియల్ యాప్స్ ద్వారా 24 గంటల పాటు డబ్బులు పంపడం, స్వీకరించడం చేయవచ్చు. NEFT, RTGS లావాదేవీలు డిజిటల్ పద్ధతిలో యథాతథంగా కొనసాగుతాయి. అయితే బ్యాంకుల షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ సమయంలో మాత్రం స్వల్ప అంతరాయం కలగవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. కాబట్టి, బ్యాంకు పనులు ఉన్నవారు ఈ సెలవుల జాబితాను చూసుకుని, దానికి అనుగుణంగా తమ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

