India-EU Deal: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ వచ్చింది. భారత్‌లో విదేశీ మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. వాస్తవానికి మన దేశంలో విదేశీ మద్యం ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం పెద్ద ఎత్తున ఎగుమతి సుంకాలు విధించడం. ఈ సుంకాలను ఇప్పుడు ప్రభుత్వం తగ్గించనుంది. యూరప్ నుంచి వచ్చే వైన్, విస్కీ, బీర్‌లను సామాన్యుడు కొనలేడనేంతగా రేట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. భారత్ – యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం వల్ల, యూరప్ నుంచి దిగుమతి అయ్యే మద్యం త్వరలోనే చాలా చౌకగా మారనుంది. ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్”గా అభివర్ణించారు. దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో ఈ రెండు దేశాలను పెద్ద ఎత్తున మేలు చేకూరనుంది.
READ MORE: T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందే!
ఈ ఒప్పందంలో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మద్యం. ప్రస్తుతం భారత్‌లో వైన్‌లపై దిగుమతి పన్ను 150 శాతం వరకు ఉంది. ప్రపంచంలోనే అత్యంత అధిక సుంకంగా చెబుతారు. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం.. ఖరీదైన ప్రీమియం వైన్‌లపై పన్ను కేవలం 20 శాతానికి తగ్గనుంది. మధ్యస్థ ధరల వైన్‌లపై పన్ను 30 శాతానికి తగ్గిస్తారు. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల నుంచి వచ్చే ప్రసిద్ధ యూరోపియన్ వైన్‌లు ఇక భారతీయులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు షెల్ఫ్‌పై చూసి వదిలేసే ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. వైన్‌లతో పాటు స్పిరిట్స్ సైతం చౌకగా మారనుంది. విస్కీ, వోడ్కా, రమ్, జిన్ వంటి మద్యాలపై ప్రస్తుతం 150 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించనున్నారు. దీని వల్ల స్కాచ్ విస్కీ, ఐరిష్ విస్కీ, యూరోపియన్ క్రాఫ్ట్ జిన్‌లు భారత మార్కెట్‌లో మరింత విస్తృతంగా కనిపించనున్నాయి. బీర్ ప్రేమికులకు మాత్రం మంచి కిక్కిచ్చే వార్తగా చెబుతున్నారు. యూరోప్ నుంచి దిగుమతి అయ్యే బీర్‌పై ప్రస్తుతం 110 శాతం పన్ను ఉంది. ఇది ఇకపై 50 శాతానికి తగ్గుతుంది. దీంతో యూరోపియన్ బీర్ బ్రాండ్లు, ముఖ్యంగా మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో మరింత తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కేవలం మద్యానికే పరిమితం కాదు. మొత్తం మీద యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు వచ్చే దాదాపు 97 శాతం ఎగుమతులపై పన్నులు తగ్గించనున్నారు లేదా పూర్తిగా తొలగించనున్నారు.
