Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్‌మాన్.. అసలేం జరుగుతోంది?

Elon Musk

Elon Musk

Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్, AI దిగ్గజం సామ్ ఆల్ట్‌మాన్ మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో విచారణ జరుగుతున్న ఈ హై-ప్రొఫైల్ కేసు విచారణలో మస్క్ స్వయంగా హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదని, కృత్రిమ మేధ (AI) భవిష్యత్తును శాసించే కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..

కోర్టుకు హాజరైన మస్క్ తన వాదనను బలంగా వినిపించారు. OpenAI సంస్థను స్థాపించిన అసలు లక్ష్యాన్ని తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. ‘OpenAI’ అనే పేరు తానే పెట్టానని మస్క్ వెల్లడించారు. గూగుల్ లాంటి సంస్థలు AIని లాభాల కోసం (Closed Source) వాడుకుంటుంటే, దానికి భిన్నంగా అందరికీ అందుబాటులో ఉండేలా (Open Source) ఉండాలనే ఉద్దేశంతో ‘Open’ అనే పదాన్ని చేర్చినట్లు చెప్పారు. మానవాళి శ్రేయస్సు కోసం లాభాపేక్ష లేని (Non-Profit) సంస్థగా దీనిని మొదలుపెట్టామని, కానీ ఇప్పుడు దీనిని పక్కా కమర్షియల్ బిజినెస్‌గా మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది “చారిటీని దోచుకోవడమే” అని ఆయన అభివర్ణించారు.

కథ ఎక్కడ మొదలైందంటే..
2015లో ఎలోన్ మస్క్ – సామ్ ఆల్ట్‌మాన్ కలిసి OpenAIని స్థాపించారు. సురక్షితమైన AIని అభివృద్ధి చేయడం కోసం మస్క్ భారీగా నిధులను సమకూర్చారు. అయితే కాలక్రమేణా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని OpenAI లాభాల బాట పట్టడం మస్క్‌కు నచ్చలేదు. ఈ కేసులో మస్క్ కోరుతున్న పరిహారం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన సుమారు 130 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10.8 లక్షల కోట్లు) నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పునిస్తే OpenAI మళ్లీ తన పాత ‘నాన్-ప్రాఫిట్’ మోడల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి OpenAI సమాధానం ఏంటంటే.. మస్క్ ఆరోపణలను సామ్ ఆల్ట్‌మాన్ – OpenAI బృందం కొట్టిపారేసింది. గూగుల్ వంటి దిగ్గజాలతో పోటీ పడాలంటే భారీగా నిధులు అవసరమని, అందుకే ప్రాఫిట్ మోడల్‌ను ఎంచుకున్నామని వారు వాదిస్తున్నారు. మస్క్ స్వయంగా xAI అనే మరో సంస్థను నడుపుతున్నారని, అందుకే పోటీ తట్టుకోలేక OpenAI పై ఇటువంటి కేసులు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ తీర్పు AI పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కేసు విచారణలో మస్క్ గెలిస్తే AI కంపెనీలపై పారదర్శకత పెరుగుతుంది, వాటిని వ్యాపార వస్తువులుగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాల్సి వస్తుంది. అలా కాకుండా OpenAI గెలిస్తే AI అభివృద్ధికి లాభాపేక్ష తప్పనిసరి అని ప్రపంచం అంగీకరించాల్సి ఉంటుంది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న మస్క్, ఆల్ట్‌మాన్ ఇప్పుడు బద్ధశత్రువులుగా మారారు. ఈ “టెక్ వార్” కేవలం డబ్బు కోసమే కాదు, AI అనేది మానవాళికి మేలు చేసే సాధనంగా మిగులుతుందా లేదా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఆదాయ వనరుగా మారుతుందా అనే ప్రశ్నకు సమాధానం వెతకబోతోంది.