Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!

Petrol

Petrol

Petrol Diesel Rates: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ‘యూఎస్ – ఇరాన్ పీస్ డీల్’ తర్వాత నుంచి చమురు ధరల్లో నిరంతర పతనం కొనసాగుతోంది. తాజా పతనంతో క్రూడాయిల్ ధరలు గత నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యుద్ధ సమయంలో బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్ల మార్కును తాకి ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ధరలు.. ఇప్పుడు ఏకంగా 77 డాలర్ల కంటే కిందికి చేరాయి.

గతంలో చమురు ధరలు మండిపోయినప్పుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి బ్రిటన్, భారత్ వరకు తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తింది. ఆ సమయంలో భారతదేశం విషయానికి వస్తే.. క్రూడాయిల్ ప్రియమవ్వడంతో గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు పెంచాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు క్ర్యాష్ అవ్వడంతో, దేశంలో ‘పెట్రోల్-డీజిల్ రేట్ల కోత’ ఉంటుందా అనే ఆశలు వాహనదారుల్లో చిగురిస్తున్నాయి.

$120 నుంచి $77 కిందకి..

అసలు కథ చూస్తే.. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత, ప్రపంచ చమురు అవసరాలలో 20 శాతాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ )ని ఇరాన్ మూసివేసింది. నిజానికి ఈ సముద్ర మార్గం చమురు రవాణాకు చాలా కీలకమైన ప్రాంతంగా ఉండేది. ఇరాన్ ఈ మార్గాన్ని క్లోజ్ చేయడంతో అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడి ఏప్రిల్ నాటికి బ్రెంట్ క్రూడ్ ధర 120 డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, అమెరికాతో సహా అన్ని దేశాలు ఇంధన మంటను అనుభవించాయి. అయితే ఇప్పుడు అమెరికా – ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో చమురు మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. తాజా ట్రేడింగ్ లెక్కల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర 76.47 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 72.63 డాలర్ల వద్ద, అలాగే ముర్బన్ క్రూడ్ 69.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ చౌక అవుతాయా..

ధరలు తగ్గాయి కాబట్టి దేశీయంగా రేట్లు వెంటనే తగ్గుతాయా? అనే అంశంపై కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కాయనాత్ చైన్‌వాలా కీలక విశ్లేషణ చేశారు. “యూఎస్-ఇరాన్ ఒప్పందంతో గ్లోబల్ టెన్షన్స్ తగ్గాయి. అమెరికా ట్రెజరీ ఇరాన్ చమురు విక్రయాలపై 60 రోజుల పాటు అనుమతులు ఇవ్వడంతో గ్లోబల్ సప్లై చైన్ పుంజుకుంది. ఇరాన్ ప్రస్తుతం ఆసియా కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పూర్తిగా మెరుగుపడే వరకు ఇంధన ధరల్లో తక్షణమే పెద్ద మార్పులను ఆశించలేం” అని పేర్కొన్నారు. మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ నివేదికల ప్రకారం.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వల్ల భారతదేశ దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. ఇది రూపాయి విలువను బలపరచడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గుతాయని ఆశిస్తున్న వినియోగదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పదని చెప్పారు. భారత్‌లో ఇంధన ధరలు కేవలం అంతర్జాతీయ ముడిచమురు ధరలపై మాత్రమే కాకుండా.. ప్రభుత్వ పన్నులు (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్), రిఫైనింగ్ మార్జిన్లు, చమురు మార్కెటింగ్ కంపెనీల గత నష్టాల రికవరీ వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్రూడ్ క్రాష్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభించినప్పటికీ, సామాన్యుడి జేబుకు మాత్రం తక్షణ ఉపశమనం లభించడం కొంచెం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.