కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తాజాగా ‘ఆదాయపు పన్ను నిబంధనలు, 2026’ పేరుతో కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. గతేడాది పార్లమెంటు ఆమోదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ని అమలు చేసేందుకు ఈ నిబంధనలను రూపొందించారు. ఇవి ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి పలికి.. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. దశాబ్దాల క్రితం నాటి పాత చట్టంలో ఉన్న కఠినమైన భాషను మార్చారు. సెక్షన్ల సంఖ్యను 819 నుండి 536కి తగ్గించారు. అలాగే చట్టంలోని పదాల సంఖ్యను కూడా సగానికి పైగా తగ్గించి, సామాన్యులకు అర్థమయ్యేలా 39 టేబుళ్లు, 40 ఫార్ములాలను చేర్చారు.
ఉద్యోగులు పొందే ఇంటి అద్దె రాయితీ (HRA) విషయంలో స్పష్టతనిచ్చారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు వంటి 8 ప్రధాన నగరాల్లో ఉండేవారు తమ జీతంలో 50 శాతం వరకు రాయితీ పొందవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారికి ఇది 40 శాతంగా ఉంటుంది. అయితే.. ఇకపై అద్దె రాయితీని క్లెయిమ్ చేయాలంటే.. ఇంటి యజమాని, అద్దెదారు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాలి. దీనివల్ల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read:Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?
పన్ను ఎగవేతను అరికట్టడానికి కొన్ని నిబంధనలను కఠినతరం చేశారు. ముఖ్యంగా షేర్ మార్కెట్ లావాదేవీలు, విదేశీ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ (ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభం) వంటి విషయాల్లో పక్కా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తికి రెండు పాన్ (PAN) కార్డులు ఉండటం వంటి పొరపాట్లను ఇకపై సాఫ్ట్‌వేర్ ద్వారా సులభంగా గుర్తిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు , ఆడిటర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపులు కోరినప్పుడు వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. పన్ను చెల్లింపుల కోసం దాదాపు 150 రకాల కొత్త ఫారాలను కూడా ప్రవేశపెట్టారు. మొత్తంగా చూస్తే.. ఈ కొత్త చట్టం పన్ను రేట్లను మార్చకపోయినా.. పన్ను కట్టే విధానాన్ని చాలా సరళంగా మార్చింది. తప్పుడు సమాచారంతో పన్ను మినహాయింపులు పొందే వారిపై నిఘాను పెంచింది. ఇది సామాన్య పన్ను చెల్లింపుదారులకు మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
